Tuesday, 29 December 2015

తీవ్ర ఆర్ధిక సమస్యలకు పరిహారాలు

తీవ్ర ఆర్ధిక సమస్యలకు పరిహారాలు


తీవ్ర ఆర్ధిక సమస్యలు మనిషిని క్రుంగదీస్తాయి. సమాజంలో ప్రతిష్ట మసకబారుతుంది. నేటి పోటి ప్రపంచంలోఎక్కువ మంది సరియైన ఉద్యోగం లేకనో, వ్యాపారాలలో తీవ్ర నష్టం వల్లనో లేదా ఇతర మానవ తప్పిదాలవలనో తీవ్ర ఆర్ధిక సమస్యలతో క్రుంగిపోతున్నారు. మానవ జీవితంలో వచ్చే ఇటువంటి ఆర్ధిక సమస్యలకు మన మహర్షులు ఎన్నో తరుణోపాయాలు సూచించారు. వీటిని మూఢ నమ్మకంగా కొట్టివేయకుండా సంపూర్ణ విశ్వాసంతో ఆచరిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్ధిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది.

జాతక పరిశీలన ద్వారా ఆర్ధిక సమస్యలకు పరిహారాలు లభిస్తాయి. జాతకం లో ఏ గ్రహ సంయోగాల ద్వారా ఆర్ధిక సమస్యలు వస్తున్నాయో పరిశీలించి ఆయా గ్రహాలకు శాంతి పరిహారాలు పాటించుట ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. జాతకం కోసం పుట్టిన తేదీ, సమయం మొ|లగు వివరాలు తప్పనిసరి. కానీ ఈ వివరాలు లేనివాళ్ళుఇటువంటి పరిహారాలు పొందలేరు. అందుకని అన్నీ రకాల ప్రజల కోసం కొన్ని పరిహారాలను మన మహర్షులు సూచించారు. జాతకం ఉన్నవారు పుట్టినతేది వివరాలు లేనివాళ్లు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు.

ఆర్ధిక సమస్యలకు పరిహారాలు;

ప్రతి పౌర్ణిమ తిధి రోజు మహాలక్ష్మి ఆలయంలో సహస్రనామార్చన చేయిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది,
ప్రతి మంగళ వారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.
41 రోజుల పాటు శ్రీ లలిత సహస్రనామావళి తో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.
21 రోజుల పాటు వరుసగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ జరిపించాలి.
41 రోజుల పాటు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలి. అన్ని నియమాలు పాటించాలి.
90 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి రోజు 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.
శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ మంగళవారం రాహు కాలంలో చేయాలి.
18 మంగళవారాలు లేదా శుక్రవారలందు దుర్గా ఆలయం లో రాహు కాలం దీపం వెలిగించాలి.
41 రోజుల పాటు గణపతిని గరిక తో అర్చించాలి.
11 శ్రావణ నక్షత్రమ్ రోజులందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు, పూలతో సహస్ర నామార్చన చేయించాలి.
5 స్వాతి నక్షత్రం రోజులలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికీ సహస్ర నామార్చన జరిపించాలి.
శ్రీలక్ష్మి సహస్రనావళి లేదా శ్రీ లలిత సహస్ర నామావళితో ఒక సం|రమ్ పాటు కుంకుమార్చన చేయాలి. అన్ని నియమాలను పాటించాలి.
ప్రతిరోజూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీసూక్తం పారాయణం చేస్తే ఆర్ధిక సమస్యలు క్రమంగా తగ్గిపోగలవు.
గణపతి ఆలయంలో 41 రోజుల పాటు ప్రతి రోజు 28 ప్రదక్షిణాలు చేసి గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ఈ రోజులలో చవితి తిధి రోజున ఉపవాసం ఉంది గణపతికి ఉండ్రాళ్ళు మరియు ఇతర మధుర ఫలాలను నివేదిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
సర్పసూక్తంతో శివాలయంలో 21 రోజుల పాటు అభిషేకం చేయాలి.
11 సప్తాహాలు శ్రీ గురుచరిత్ర అన్ని నియమాలతో పారాయణం చేసి అనంతరం ఏదైనా దత్త క్షేత్రాలలోతీరిపోగలవు
5 లేదా 11 లేదా 15 లేదా 21 లేదా 25 లేదా 27 సంఖ్యలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఎటువంటి ధన ఉద్యోగ సమస్యలైన తీరిపోగలవు
గురుముఖంగా లక్ష్మి, లలిత. దత్త విష్ణు శివ మంత్రాలను తీసుకొని ప్రతిరోజూ క్రమం తప్పకుండ జపం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి
సంధ్యావందనం అర్హత ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజూ సంధ్యా వందనం ఆచరించాలి. సంధ్యావందనం చేయకుండా ఏ దేవతను ఆరాధించిన ప్రయోజనం ఉండదు. సంధ్యావందనం తో సకల అరిష్టాలు తొలగిపోగలవు.
చండీ సప్తశతి పారాయణం ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్ని సమస్యలు తీరిపోగలవు.
7 సప్తాహాలు షిర్డి సాయి చరిత్ర పారాయణం చేసి శిరిడీ ని దర్శించి ధుని లో కొబ్బరికాయను సమర్పించి 11 మంది పేదవారికి అన్నదానం చేస్తే ఆర్ధిక ఆరోగ్య సమస్యలు తీరిపోగలవు.
వాల్మీకి రామాయణం లోని సుందరకాండను ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్నీ శుభాలు కలుగుతాయి.

పైన ఉదహరింపబడిన పరిహారాలు ఎవ్వరైన పాటించవచ్చు. పై వాటిలో ఎవరికి అనుకూలమైన పరిహారం వారు చేయవచ్చు. అన్ని పాటించనవసరం లేదు.


సూర్యదేవర వేణుగోపాల్ , H-No- 1-879  సుందరయ్య నగర్
మధిర ఖమ్మం జిల్లా   తెలంగాణ
venusuryadevara@gmail.com


Saturday, 19 December 2015

వాస్తు విజ్ఞానం 6&7
బావి ఈశాన్యంలో, ఉపగృహం నైరుతిలో ఎందుకుండాలి?
                              సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)



దిక్కులను యే విధంగా ఉపయోగించుకోవాలో మనం పరిశీలిద్దాం. అన్ని దిక్కులు ఉపయోగకరమైనవే. ఏ దిక్కుకు ఉండే లాభ నష్టాలు ఆ దిక్కుకు ఉంటాయి. మానవ మనుగడకు దిక్కులను సమతౌల్యం చేసి వినియోగించుకోవాలి. సుఖ శాంతులను ప్రసాదించే దిక్కుల బలాన్ని పెంచి, నష్టాలను ఇచ్చే దిక్కుల బలాన్ని తగ్గించడం ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు అనే విషయాన్ని మనం గత అధ్యాయాలలో తెలుసుకొన్నాం. దిక్పతుల బలం, నవగ్రహ బలం మనపై ఉంటుంది. దిక్పతుల, నవగ్రహాల లక్షణాలను అనుసరించి దిక్కుల బలాబలాలను సమతౌల్యం చేయాలి..దిక్పతుల బలాన్ని యే విధంగా పెంచాలి లేదా తగ్గించాలి అన్నది వాస్తులో చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిజ్ఞానం తప్పనిసరిగా వాస్తు పండితునికి ఉండాలి. ముందుగా దిక్పతి బలాన్ని యే విధంగా పెంచాలో తెలుసుకొందాం. మనకు యే దిక్పతి బలం అవసరమో ఆ దిక్కును బాగా పల్లం చేయాలి. అదే విధంగా విశాలంగా బరువులు వేయకుండా ఉంచాలి. అప్పుడే ఆ దిక్పతి బలం పెరిగి అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అదేవిధంగా ఏ దిక్పతి బలం మనకు నష్టం కలిగిస్తుందో లేదా ఏ దిక్పతి బలహీనంగా ఉంటే లాభిస్తుందో, ఆ దిక్కును బాగా మెరకలో అంటే ఎత్తులో ఉంచి బరువులను వేయాలి. అదే విధంగా ఆ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలాలి. అప్పుడే ఆ దిక్కు బలం తగ్గి మంచి లాభాలను కలిగిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే పల్లమైన దిశ అధిబలం కలిగి ఉంటుంది. మెరకలో ఉన్న దిశ బలహీన మౌతుంది.


తూర్పు, ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులు శుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. అదే విధంగా దక్షిణ, పశ్చిమ,నైరుతి,వాయవ్య మరియు ఆగ్నేయ దిశలు అశుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. సుఖప్రదమైన జీవితానికి శుభాలను ప్రసాదించే తూర్పు,ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి. అదేవిధంగా అశుభాలను ప్రసాదించే దక్షిణ,పశ్చిమ ,నైరుతి మొదలగు దిశల బలం తగ్గాలి. అప్పుడే దిక్కుల మధ్య సమతౌల్య స్థితి ఉండి మనిషి మనుగడ సుఖప్రదంగా సాగుతుంది. మంచి జీవితం కోసం శుభాలను కలిగించే తూర్పు ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి కాబట్టి ఈ దిక్కులను పల్లంగాఉంచి బరువులు వేయకుండా విశాలంగా ఎక్కువ ఖాళీగా ఉంచాలని వాస్తు ఆదేశిస్తుంది. అదేవిధంగా మిగిలిన దిక్కులు కష్టాలను నష్టాలను ఇస్తాయి కాబట్టి ఈ దిక్కుల బలం తగ్గాలి కనుక తక్కువ ఖాళీ స్థలం వదలి బరువులు పెట్టి  మెరకలో ఉంచాలని వాస్తు తెలుపుతుంది. ఈ విధంగా చేస్తే మనిషి జీవితం సుఖప్రదంగా ఉంటుంది.


పై సూత్రం ప్రాతిపదిక పైనే మనం ఈశాన్యం లో జలాశయాలు, బోర్ వెల్స్ మరియు బావులను త్రవ్వుతున్నాము. బావి, బోర్లు ఈశాన్యంలో ఉండుటవలన అవి బాగా పల్లంగా లోతుగా ఉండటం వల్ల ఈశాన్యం బలం పెరిగి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా తూర్పు ఉత్తరంలలో ఉన్నప్పటికి ఈ దిక్కుల బలం పెరిగి సుఖశాంతులు కలుగుతాయి. ఈ దిక్కుల బలం మానవ మనుగడకు తప్పనిసరిగా అవసరం కాబట్టి ఈ దిక్కులందే బావులను, జలాశయాలను ఉంచాలని వాస్తు చెపుతుంది. అంతేకాని గ్రుడ్డిగా కారణం లేకుండా వాస్తు చెప్పలేదు. ఈ దిక్కులందు బాగా పల్లం ఉంటే గృహస్తుకు అన్ని విషయాలలో యోగిస్తుంది. అన్నివిధాల అభివృద్ది ఉంటుంది. ఈ క్రింది శ్లోకం గమనించండి......

 పూర్వప్లవా ధరా శ్రేష్టా ఆయు: శ్రీ బలవర్ధినీ
సర్వసంపత్కరీ పుంసాం ప్రాసాదానామ్ విభూతిధా
పూజ్యా లాభకరీ నిత్యం పుత్ర పౌత్ర వివర్ధినీ
కామదా భోగదా చైవ ధనదాచోత్తర  ప్లవా ---                                                               
వరసౌఖ్య సతీ సత్య సౌభాగ్యాది వివర్ధిని.                    
ధనా:ఐశ్వర్య సంపన్న ధర్మ ఈశానక ప్లవా----" అపరాజితపృచ్చ"                                              


పై శ్లోకం "అపరాజితపృచ్చ" అనే ప్రాచీన వాస్తు గ్రంధం లోనిది. తూర్పు పల్లంగా ఉంటే ఆయుషు, ధనం తో పాటు అన్ని శుభాలు కలుగుతాయి, ఉత్తరం పల్లంగా ఉంటే ధనధాన్య వృద్ది ఇంకా వంశ వృద్ది ఉంటుంది. అదేవిధంగా ఈశాన్యం పల్లంగా ఉంటే సతీ సౌఖ్యం, ధనం, ఐశ్వర్యం సమకూరగలవు అని పై శ్లోకం చెపుతుంది. కనుక సకల శుభాలను కలిగించే ఈ దిక్కులను కావలసినంత మేరకు విశాలంగా పల్లంగా ఉంచితే, ఈ దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న దిక్పతుల,  గ్రహాల ఆశీర్వాదం వల్ల మానవ మనుగడ సుఖప్రదం అవుతుంది. కనుక అత్యంత పల్లం కలిగిన బోర్లు, నూతులు ఇంకా జలాశయాలు ఈ దిక్కులలోనే ఉంచాలి.అప్పుడే ఈ దిక్కులు శక్తివంతంగా మారి శుభాలను ప్రసాదిస్తాయి కాబట్టే మన ప్రాచీన వాస్తు గ్రంధాలు ఈ దిక్కులను పల్లంగా ఉంచాలని చెపుతున్నాయి. ఈ దిశలందు పల్లం ఉంటే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని అనుభవంద్వారా కనుగొని మన మహర్షులు తెలియ జేశారు.


అశుభాలను ప్రసాదించే దిక్కుల బలాన్ని సుఖప్రదమైన జీవితం కోసం తగ్గించాలి. కనుక ఈ దిక్కులను మెరక చేసి, బరువులను ఉంచి తక్కువ ఖాళీ స్థలం వదలాలి. దక్షిణ,పశ్చిమ,నైరుతి, ఆగ్నేయ,మరియు వాయవ్య దిశలను మెరక చేసి బరువులను ఉంచడం ద్వారా ఈ దిక్పతులను, గ్రహాలను బలహీనం చేయాలి. అప్పుడే సమస్యలు తగ్గిపోగలవు. ఈ దిశలు పల్లం అయితే ఈ దిక్పతుల బలం పెరిగి తీవ్ర నష్టాలు వస్తాయి. మన ప్రాచీన వాస్తు గ్రంధాలు ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. ఈ దిక్పతులను పల్లం చేయడం ద్వారా ఈ దిక్కుల బలాన్ని పెంచితే ఎటువంటి దుష్ట ఫలితాలు కలుగుతాయో " అపరాజితపృచ్చ" అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలిపింది. ఈ శ్లోకం గమనించండి.....
                                 
                                  నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
                             ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:    
                             ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
                             ధనహానిమ్ తధా నిత్యం కురుతే నైరుతి ప్లవా.                                                      
                                    పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
                             శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.  
                             ఆగ్నేయ ప్లవకా భూమి అగ్నిదాహ భయావహా
                             శత్రు సంతాపదా నిత్యం కలి దోషోగ్ని ప్లవ: స్మృత: 
                             శతృకర్త్రీ విరాగీ చ గోత్ర క్షయకరీ తధా
                             గృహే చ కన్యకానాం హంత్రీ సదా దు:ఖ భయవహా.
                                                                             అపరాజితపృచ్చ


పై శ్లోకం ప్రకారం దక్షిణం పల్లమైతే ధననష్టం, రోగభయం. ఇటువంటి స్థలంలో దేవుడు కూడా రాణించడు. నైరుతి పల్లం అయితే సదా రోగ భయం, ప్రవర్తన దోషాలు, ధన హాని ఇంకా మృత్యు భయం. పడమర పల్లం ధన ధాన్యాలను నాశనం చేస్తుంది. ఇంకా ఆగ్నేయ పల్లం వలన అగ్నిభయం, శత్రువృద్ది ఉంటుంది. వాయవ్య పల్లం స్త్రీలకు నష్టం కలిగిస్తుంది. ఇంకా సదా దుఖాన్ని కలిగిస్తుంది. పై శ్లోకం అర్ధం ఇదే.  ఈ దిశలందు పల్లం అయితే ఈ దిక్కుల బలం పెరిగి మానవునికి తీవ్ర నష్టాలు వస్తాయి. కనుక వీటిని మెరకలో ఉంచి తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లుగా చేసి బరువులు వేయడం ద్వారా వీటి బలాన్ని తగ్గిస్తే మనిషి జీవితం బాగుంటుంది. అత్యంత పల్లం ఉండే బావులు, బోర్లు, జలాశయాలు ఈ దిక్కులలో ఉంచితే వీటి బలం విపరీతంగా పెరిగి తీవ్ర నష్టాలు వస్తాయి. అందువల్లే ఈ దిక్కులందు నూతులు, బోర్లు, జలాశయాలు ఉండరాదని వాస్తు తెలియజేస్తుంది.ఈ దిక్కుయందు ఉపగృహాలు నిర్మిస్తే ఈ దిక్కుల బలం తగ్గి సమస్యలు తగ్గుతాయి. అయితే బావులు పడమర వాయవ్యంలో ఉండటం పాత ఇండ్లలో మనం నేటికీ చూస్తాము. ఈ దిక్కు చంద్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి బావులు ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికి ఈ దిక్కు లో బావులు ఉండుట వలన ఆర్ధిక అభివృద్ది లోపిస్తుంది. స్త్రీలకు ఇంకా పురుషలకు కూడా ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు. ఈ దిశ పల్లం అయితే వాయు మరియు చంద్రుని బలం పెరిగుతుంది. ఈ బలం వ్యవసాయానికి మరియు పశువుల అభివృద్దికి తోడ్పడుతుంది. పూర్వకాలంలో మానవుని ప్రధానమైన ఆర్ధిక వనరు ఇవే కాబట్టి వారికి లాభించి ఉండవచ్చు. అయితే నేటి కాలంలో ఇది లాభించదు. కాబట్టి ఇక్కడ బావులు ఉండకూడదు. కనుక నష్టాలను లేదా అశుభాలను కలిగించే దిక్కులను బలహీనపర్చుట ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు. ఈ దిక్కులు కూడా మంచివే. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో వీటి బలం కూడా మనిషికి అవసరం అవుతుంది. కనుక వీటిని జాగ్రత్తగా కావలసినంత మేరకే వినియోగించుకొంటే సర్వోతోముఖాభివృద్ది ప్రాప్తిస్తుంది.


మానవుని సుఖజీవితం కోసం శుభాలను కలిగించే తూర్పు, ఉత్తర,ఈశాన్య దిక్కులకు బలం పెంచడానికే అత్యంత లోతుగా, పల్లంగా ఉండే నూతులు, బోర్లు, జలాశయాలు ఈ దిక్కులందు ఉండాలని వాస్తు ఆదేశిస్తుంది. అశుభాలను, నష్టాలను కలిగించే దక్షిణ,పశ్చిమ, నైరుతి,ఆగ్నేయ మరియు వాయవ్య దిశల బలం తగ్గించడం కోసం ఈ దిక్కులందు బావులను బోర్లను ఉంచకుండా, మెరకజేసి బరువులను ఇంకా ఉపగృహాలను నిర్మించమని వాస్తు తెలియజేస్తుంది. ప్రకృతి నుండి లాభాలను పొందడానికే వాస్తు ఈ విధమైన సూత్రాలను అందించింది. అంతే కాని వాస్తు సూత్రాలు మూఢంగా కారణం లేకుండా రూపొందించబడినవి కావు. ఇందులో ఎంతో విజ్ఞానం ఇమిడివుంది. ఈ సూత్రాలన్నీ మానవ శ్రేయస్సుకోసం ఉద్దేశింపబడినవే.
                                                            సూర్యదేవర వేణుగోపాల్


సూర్యదేవర వేణుగోపాల్. M.A(జ్యోతీష్యం), H.NO-1-879, సుందరయ్య నగర్
  మధిర,   ఖమ్మం జిల్లా తెలంగాణ

Saturday, 12 December 2015

ధ్యానం అంటే సహజత్వానికి చేరడమే.


ధ్యానం అంటే మనకు ఉండే సహజ స్థితికి మనం చేరడమే. దివ్యమైన చైతన్య స్థితే మన సహజ స్థితి. ధ్యానం యొక్క గమ్యం కూడా అదే. ఆ సహజస్థితి లో  వుండడమే నిజమైన ధ్యానం. సహజస్థితిని పొందడానికి కేంద్రీకృతం  కావడం ముఖ్యం. ధ్యాని తనకు తానుగా కెంద్రీకృతం కాబడి ధ్యానబిందువు గా మారాలి. ఇదే సహజత్వాన్ని పొందటానికి రహదారి. కేంద్ర బిందువు లో మౌనంగా స్థిరపడినప్పుడు మాత్రమే మన సహజస్థితి అనుభవం లోనికి వస్తుంది. అప్పుడే  జ్ణానం సంప్రాప్తమౌతుంది. ఈ కేంద్ర బిందువుకి చేరాలంటే నిరంతర సాధన, ధ్యానాన్ని గురించిన సరియైన అవగాహన ముఖ్యం.
ధ్యానం గంభీరంగా చేసేది కాదు. ధ్యానం గంభీరతను కోరదు. ధ్యానం అంటే మనకున్న సహజత్వాన్ని పొందడమే కదా. దీనికి అంత భయంకర నియమాలు , కటినమైన గంభీరత అవసరం లేదు. మన సహజ స్థితిని మనం ఇప్పటికే పొందివున్నాం. కనుక మనం చేయవలసిందల్లా ఆ బిందువుకు చేరడమే. మనస్సు తో చేసే ఏకాగ్రతా ధ్యానం పరమ గమ్యాన్ని చేర్చలేదు. ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ధ్యానం అంటే మనస్సుకు అతీతమైన స్థితి. విపరీతంగా చేసే ఏకాగ్రత  మనోతీత స్థితికి చేర్చలేదు. కనుక మనస్సుకు అతీతంగా ధ్యానాన్ని ఆచరించాలి. ఈ ప్రయత్నం  ఆలోచనరహిత స్థితిని ప్రసాదిస్తుంది. ఈ ఆలోచన రహిత  స్థితి మనిషిని తన కేంద్ర బిందువుకి చేర్చుతుంది. ఆలోచనలు పూర్తిగా లుప్తం అయినప్పుడే మనోతీత స్థితి లభ్యం అవుతుంది. మనోతీత మైన స్థితి గతం గురించిన ఆలోచలననుండి, భవిష్యత్ గురించిన చింతల నుండి దూరం చేసి  మనిషిని ఎల్లప్పుడు వర్తమానం లో కి సంచరింపజేస్తుంది. ఇదేయే నిజమైన ధ్యానం..  కనుక నిజమైన ధ్యానానికి మనస్సు దాని నుండి ఉద్భవించే ఆలోచనలు పూర్తిగా నశించాలి.
ఆలోచనలు లుప్తం కావాలంటే యేమి చేయాలి?  ఆలోచనలు నశించాలంటే మనం ఒక ప్రేక్షకునిలా మారి ఆలోచనలను గమనించాలి. ఆలోచనలకు కేవలం సాక్షి లా మారాలి. మనస్సును దాని నుండి జన్మించే ఆలోచనలను ,పరిసరాలను,ఇంకా మన ప్రతి కదలికను కేవలం ఒక సాక్షిగా మారి మన లోపలి నుండి పరిశీలించాలి. ఇటువంటి గమనిక అత్యంత శాంతి ని ప్రసాదిస్తుంది. నిరంతరం అన్నీ విషయాల పట్ల సాక్షిగా వుండటమే ధ్యానం యొక్క పరమార్ధం. ఈ విధమైన సాక్షి సాధన కేవలం అభ్యాస ,వైరాగ్యాల ద్వారా మరియు సరియైన అవగాహన ద్వారానే సాధ్యం కాగలదు.ఒక్కసారి మనం మన సహజత్వాన్ని పొందితే నిజమైన ఆనందం తేటతెల్లం అవుతుంది.మనోభ్రాంతి, ఇంకా చెప్పాలంటే సకల మాలిన్యాలు మట్టికలసి పోతాయి.ఇదేయే నిజమైన జ్ణాని, అవధూత, లేదా శ్రీకృష్ణ స్థితి.
ఈ విధమైన ధ్యానానికి గంటల తరబడి కూర్చోనవసరం లేదు. మనం మన దైనందిన భాద్యతలను నిర్వర్తిస్తూ కొంచం జాగురుకతతో మరికొంచెం స్పృహ తో వుంటే చాలు. ధ్యానం కోసం ఏకాంత ప్రదేశాలకు పోనవసరం లేదు. మన ప్రతి క్రియను జాగరూకతతో మన కేంద్రం నుండి నిర్వర్తించాలి. అప్పుడు  జీవితమే ధ్యానం గా  మారుతుంది. తదుపరి అన్ని విషయాల పట్ల నిస్సంగత్వమ్ అలవడి గీత లో కృష్ణ పరమాత్మ బొధించినట్లుగా తామరాకు మీద నీటి బిందువులా జీవితం మారిపోతుంది. ఇదియే బుద్దుని స్థితి.

ఆలోచనలు ,పరిసరాలు ధ్యానాన్ని ఎప్పుడూ భంగ పరుస్తూనే వుంటాయి. ఆలోచనలను అదిమిపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే పరిసరాల నుండి పారిపోకూడదు. ఈ విధమైన ప్రయత్నాలన్నీ ఘర్షణలను సృస్టిస్తాయి. ఆలోచనలను పరిసరాలను ధ్యాని స్వీకరించాలి.  వీటిని అంగీకరిస్తూనే  విలువ ఎంతమాత్రం ఇవ్వరాదు. సాగిపోయే అలలు లాగా పరిశీలించాలి. ఎప్పుడైతె ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వమో  అప్పుడే అవి నశిస్తాయి. ఈ రహస్యాన్ని తెలుసుకొని ధ్యానాన్ని ఆచరించాలి. ఇదియే సహజ స్థితి ని పొందడానికి సులభమైన మార్గం. మనస్సుతో మరియు, ఆలోచన్లతోపాటుగా ధ్యాని ప్రయాణం చేయకూడదు. వాటిని జాగురూకతతో పరిశీలించాలి. ఈ ఆలోచనలు మనిషి యొక్క సహజత్వాన్ని భంగపరచలేవు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి.ఇదియే నిజమైన ధ్యానం.
                                                          
                                                                                             
   

  venusuryadevara@gmail.com

Monday, 7 December 2015

               స్థలఎంపికలో- వాస్తు జాగ్రత్తలు
                                                                                      సూర్యదేవర వేణుగోపాల్

గృహ నిర్మాణానికి  స్థల నిర్ణయం చాలా ముఖ్యమైనది. అన్ని స్థలాలు నిర్మాణానికి పనికి రావు. స్థల ఎంపికలో వాస్తును ఖచ్చితంగా పాటించాలి. మన పూర్వ వాస్తుగ్రంధాలు ఈ స్థల ఎంపికపై చాలా సూచనలు చేశాయి. ఈ సూచనలను నేటి కాలంలో యధాతధంగా, పూర్తిగా మనము పాటించలేకపోయినప్పటికి,కొన్ని ముఖ్యమైన వాటిని తప్పనిసరిగా పాటించాలి. కనుక ఈ సూచనలను స్థలాలు కొనే సందర్భంలో తప్పనిసరిగా ప్రతీవ్యక్తి గుర్తుంచుకోవాలి.
తూర్పు ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులలో తొలగించడానికి వీలు లేని ఎత్తైన కట్టడాలు గాని కొండలు ,గుట్టలు గాని ఉన్న స్థలాలను తీసుకోకూడదు. ఇటువంటి ప్రదేశాలలో నివశిస్తే అభివృద్ది కుంటుబడుతుంది. తూర్పులో ఎత్తైన గుట్టలు ,కొండలు ఉంటే ఆ ప్రదేశం లో మగవారికి అభివృద్ది ఉండదు. ఇటువంటి స్థలాలలో పరిశ్రమలు ఉంటే వాటి మనుగడ సామాన్యం గా ఉంటుంది.ముఖ్యంగా వ్యాపారాలకు ఉత్తరము మరియు ఈశాన్యము తేలికగా పల్లం గా ఉండాలి. ఈ దిక్కులందు పైన ఉదహరించినట్లు గుట్టలు, బరువైన నిర్మాణాలు ఉంటే వ్యాపారము రాణించదు.స్థలాలను ఎంపిక చేసే సమయములో ఈ జాగ్రత్తను తప్పనిసరిగా పాటించాలి. ఈ దిక్కులలో ఉన్న బరువులను తొలగించడానికి వీలుగా ఉంటే స్థలమును తీసుకోవచ్చు. నిర్మాణానికి ముందే వీటిని తొలగించాలి.అప్పుడే నిర్మాణం సకాలంలో పూర్తి అవుతుంది.
తీసుకొనే స్థలానికి దక్షిణ పడమర దిక్కులలో నదులు గాని, ఎక్కువ విస్తీర్ణము కలిగిన నీటి ప్రవాహములు గాని, బావులుగానీ ఉండగూడదు. వీటివల్ల చాలా నష్టాలు వస్తాయి. ఈ స్థలాలలో తీవ్ర ఆర్ధిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా సవరించడానికి వీలులేనంతగా గుంటలు గాని లేదా పల్లంగాని ఈదిక్కులలో ఉంటే ఇటువంటి స్థలాలను వదిలివేయడం మంచిది. పరిశ్రమలకైతే ఇటువంటి స్థలాలు మంచివికావు. ఇటువంటే ప్రదేశాలలో కట్టే పరిశ్రమలు సిక్ పరిశ్రమలుగా మారతాయి.

 నైరుతి, ఆగ్నేయం పల్లంగా ఉండగూడదు. ఈ దిక్కులలో పల్లం ఉంటే అక్కడ కట్టే పరిశ్రమలు, పెట్టె వ్యాపారాలు దెబ్బతింటాయి.
దక్షిణ పడమర మరియు నైరుతి దిశలందు ఎత్తైన గుట్టలు గాని, నిర్మాణాలు గాని ఉంటే అటువంటి స్థలాలు మంచివి.ఇటువంటి స్థలాలలో పరిశ్రమలు  గాని వ్యాపారాలు గాని ఇంకా గృహాలు గాని బాగా రాణిస్తాయి. ఇటువంటి స్థలాలకు  తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులలో నీటి ప్రవాహాలు గాని నదులు గాని ఉంటే ఈ స్థలం లక్ష్మీమయం అవుతుంది. ఎటువంటి నిర్మాణాలైన బాగా రాణిస్తాయి. స్థలానికి ఉత్తరం తూర్పు బాగా పల్లం గా ఉంటే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే అన్నీ దిశల కన్నా ఉత్తరం పల్లం గా ఉంటే మంచి ఆర్ధిక పుష్టి, అభివృద్ది ఉంటుంది. ఈ దిశలందు నీటి ప్రవాహాలు నదులు మొ| నవి ఉంటే  ఇంకా మంచిది .
ఇక వీధి శూలలు గురించి బాగా గమనించాలి. స్థలాలను కొనే ముందే ఈ వీధిశూలలను పరిశీలించాలి..దక్షిణం పడమర ల వీధి శూలలు ఉన్న ప్రదేశాలు మంచివికావు. నైరుతి, తూర్పు ఆగ్నేయంమరియు ఉత్తరవాయవ్యం నుండి వీధి శూల ఉంటే అటువంటి స్థలాలను తీసుకోకూడదు. అయితే వీధి శూల పడే మేరకు స్థలాన్ని వేరు చేసి మిగిలిన స్థలం లో నిర్మాణం చేసే వీలు ఉంటే స్థలాన్ని తీసుకోవచ్చు. Mainroad మరియు మంచి మార్కెట్ ఏరియా లో ఇటువంటి స్థలం ఉంటే  స్థలం తీసుకొని వీధిశూలకు వాస్తు లో చెప్పిన పరిహారాలను ఉపాయాలను పాటించవచ్చు. ఈశాన్య పశ్చిమ వాయవ్య,మరియు దక్షిణ ఆగ్నేయ దిశల నుండి వీధి చూపులున్న స్థలాలు మంచివే. తూర్పు ఉత్తర వీధి చూపులు కూడా మంచివే.. వీటిని కొనవచ్చు.అయితే కేవలం తూర్పు ఉత్తరం వీధిచూపులుంటే వాస్తు పండితుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.వ్యాపారాలకు పరిశ్రమలకు  దక్షిణ ఆగ్నేయ మరియు ఉత్తర ఈశాన్య వీధి చూపులుచాలా మంచివి.స్థలాలను కొనే ముందు వీధి శూలలను బాగా గమనించి కొనాలి.
నూతన స్థలాలను కొనే ముందు దేవాలయాల విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. శిఖరం నీడ, ధ్వజ స్తంభం నీడ పడే స్థలాలను కొనకూడదు.ఈ నీడలు వల్ల జీవితాలు అభివృద్దిని కోల్పోతాయి. అనేక ఆర్ధిక,ఆరోగ్య ఇతర సమస్యలు దేవాలయ, ధ్వజస్తంభ నీడలవల్ల కలుగుతాయి. ఇంకా విష్ణు ఆలయాలకు వెనుక వైపు, శివాలయాలకు ఎదురుగా మరియు శక్తి ఆలయాలకు పార్శ్వ భాగం లోఅంటే ప్రక్క భాగంలో  ఇల్లు గాని స్థలాలు గాని ఉండకూడదు.నవగ్రహాలలో శని అత్యంత బలవంతుడు.ఈ శనీశ్వరుని వీక్షణ ఉన్న స్థలంలో నిర్మాణాలు మంచివి కావు. కనుక ఇటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. అదేవిధంగా జాతరలు జరిగే స్థలాలు కూడా మంచివి కావు.
శ్మశానాలకు దగ్గరగా ఉన్న స్థలాలు మంచివి కావు. శ్మశానాలకు అనుకోని ఉన్న స్థలాలను కొనకూడదు.ఇంకా కొలిమి పెట్టిన స్థలాలు, సున్నం గానుగా పెట్టిన స్థలాలు మంచివి కావని ఋషి వాక్కు.అదేవిధంగా పిడుగు పడిన స్థలాలను కూడా వదిలివేయాలని మన పూర్వీకులు సూచించారు. త్రికోణ ఆకారం కలిగిన స్థలాలు మంచివికావు. అయితే ఈ స్థలాలను వాస్తుకు అనుగుణంగా మార్చుకోగలిగితే తీసుకోవచ్చు. తటాకాలను పూడ్చి నేడు నిర్మాణాలు చేస్తున్నారు. ఇటువంటి స్థలాలు కూడా అంతగా కలసి రావు. స్థలానికి నీటి ప్రవాహపు పోటు మంచిది కాదు. స్థలానికి ఎదురుగా నీటిప్రవాహపు పోటు ఉంటే ఆ స్థలాన్ని వదిలివేయుట మంచిది.
నైరుతి దిక్కున సవరించడానికి వీలు లేని బావులు గాని, నీటి ప్రవాహం గాని పల్లమైన స్థలం గాని ఉంటే అవి మృత్యుదేవతకు నివాసంగా మారతాయి.కనుక అటువంటి స్థలాలను వదలివేయాలి. ఇటువంటి దోషాలు వాయవ్యం మరియు ఆగ్నేయంలోఉన్నాకూడా అటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. మృత్తిక రుచి,రంగు పై ఆధారపడి మన పూర్వీకులు కొన్ని వాస్తు సూచనలు చేశారు. కానీ వాటిని ఇప్పటి కాలంలో అనుసరించలేము.
ఊరి బయట స్థలాలను తీసుకొన్నప్పడు తప్పనిసరిగా దాని పూర్వస్థితిని  గమనించాలి. ఇటువంటి స్థలాలలో గృహాన్ని నిర్మించేటప్పుడు తప్పనిసరిగా అడుగు లేదా రెండు అడుగుల మందం పై భూమిని తొలగించి గృహాన్ని నిర్మించాలి. పరిశ్రమలకోసం స్థలాన్ని తీసుకొనే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థలం యొక్క నైసర్గిక వాస్తును తప్పనిసరిగా పరిశీలించాలి. లేకపోతే పరిశ్రమలు తీవ్ర నష్టాలపాలు అవుతాయి.వ్యాపారాలకు గాని పరిశ్రమలకు గాని తప్పనిసరిగా ఉత్తరం మరియు ఈశాన్యం పల్లంగా ఉండాలి. దక్షిణ పడమర మరియు నైరుతి దిక్కులందు ఎత్తైయన గుట్టలుగాని,కట్టడాలు గాని ఉంటే ఆ పరిశ్రమలు, వ్యాపారాలు బాగా రాణిస్తాయి.
అన్నీ స్థలాలు అందరికీ కలసి రావు. కొన్ని దిక్కులు కొందరికే సరిపడతాయి. కనుక స్థలాన్ని కొనే ముందు మంచి వాస్తు పండితుడి సలహా తీసుకోవాలి. వర్గు పద్దతిని తప్పనిసరిగా పాటించాలి. నేటి కాలంలో ఈ వర్గు విధానాన్ని విస్మరిస్తున్నారు. కానీ దీనిని పరిగణలోకి తీసుకొంటే మంచి ఫలితాలు వస్తాయి. వర్గును విస్మరించడం తప్పు. నేటి నవీన వాస్తుకు మన ప్రాచీన గ్రంధాలలో చెప్పిన కొన్ని మంచి విషయాలను అన్వయించితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. కనుక వర్గు ను సాధ్యమైనంత మేరకు ఉపయోగించుకొంటె మంచి ఫలితాలు వస్తాయి. వర్గును నేటి పరిస్థితులకు తగినట్లుగా  యే విధంగా మలుచుకోవాలి అనే విషయాన్ని తదుపరి వ్యాసాలలో వివరిస్తాను. స్థలం కొనే ముందే వర్గు విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. అదే విధంగా మన నామ నక్షత్ర ప్రాతిపదికపై స్థల నిర్ణయం చేయడం మంచిది. కొందరు జన్మ నక్షత్రం ను ఆధారం గా తీసుకొని స్థలాలను నిర్ణయిస్తున్నారు.ఇది తప్పుకాకపోయినప్పటికి స్థలాలు గృహాలు వ్యాపారాలు నిర్ణయించే సమయంలో నామ నక్షత్రం పై ఆధార పడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ క్రింది శ్లోకం గమనించండి---
దేశే,గ్రామే,గృహే,యుద్ధే సేనయా వ్యవహారికే
నామరాశే: ప్రధానత్వం జన్మరాశి న చింతయేత్
“జ్యోతిర్నిబంధం”
స్థలాలను ఎంపిక చేసే సమయం లో పైన ఉదహరింపబడిన సూచనలను పాటిస్తే  సుఖప్రదమైన జీవితం మరియు సర్వతోముఖాభివృద్ది లభిస్తుంది.

సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

H.NO—1-879   సుందరయ్య నగర్       మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా

Saturday, 5 December 2015

తూర్పు ఉత్తరాలలో ఎక్కువ ఖాళీ ఎందుకు వదలాలి?
                                                          సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
అన్ని దిక్కులు ఒకే విధమైన ఫలితాలు ఇవ్వవు. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గృహాన్ని నిర్మించే సందర్భంలో మంచిని కలిగించే దిక్కుల బలాన్ని పెంచి చెడును కలిగించే దిక్కుల ప్రభావంను తగ్గించుట ద్వారా సుఖజీవితాన్ని పొందవచ్చు. కాని ఈ సందర్భంలో కొన్ని దిక్కులు మంచిని ఎందుకు ప్రసాదిస్తున్నాయి మరికొన్ని దిక్కులు చెడును మాత్రమే ఎందుకు ఇస్తాయి అన్న ప్రశ్న వస్తుంది. దిక్కులకు మంచి చెడులు దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న అధిపతులకు గల లక్షణాల పై ఆధారపడి వస్తాయి. అధిపతుల లక్షణాలనే మనం మంచి చెడు గా వర్గీకరిస్తున్నాము. వాస్తు, జ్యోతిష్యం లోని సంహిత విభాగానికి చెందినది. దిక్కులకు నవగ్రహాలకు సంభందం ఉంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కున బలాన్ని కలిగి ఉంటుంది. దిక్కులకు నవగ్రహ బలమే కాకుండా అధిపతి బలంకూడా ఉంటుంది. దిక్పతుల, నవగ్రహాల లక్షణాలే దిక్కులకు ఉంటాయి. వీటినే మనం మంచి చెడు గా వర్గీకరిస్తున్నాము.

తూర్పుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరతుడు,పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వరుణుడు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి ఈశ్వరుడు అధిదేవతలుగా ఉన్నారు. వీరిలో దక్షిణానికి అధిపతియైన యముడు నైరుతి అధిపతి యైన నిరతుడు అధిక చెడునుకలిగిస్తారు. ఇక పడమర అధిపతి వరుణుడు సమయానుకూలంగా చెడును కలిగించగలడు. అనేక రకాలైన పీడనలకు ఇతను కారకుడు. ఇక ఆగ్నేయ దిక్కు తూర్పు వైపు చెడును అదేవిధంగా దక్షిణనం వైపు మంచిని కలిగిస్తుంది. అదేవిధంగా వాయవ్యం ఉత్తరం వైపు చెడును పడమర వైపు మంచిని కలిగిస్తుంది. ఇక మిగిలిన దిక్కులు సహజంగా మంచినే కలిగిస్తాయి. అందుకనే తూర్పు ఉత్తరం ఈశాన్యం  దిక్కులను మంచివి అంటాము. మనిషి సుఖ జీవనానికి మంచిని కలిగించే ఈ దిక్కుల బలాన్ని పెంచి చెడును కలిగించే దిక్కుల బలాన్ని కావలిసినంత మేరకే ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఇది దిక్పతుల వివరణ.
రవి మొదలగు నవగ్రహాలు భూమిపై వాటి ప్రభావాలను  తమ కిరణాల ద్వారా  చూపిస్తాయి. ఈ విషయాన్ని మన మహర్షులు చాలా చక్కగా వివరించారు. నవగ్రహాలు ప్రసారం చేసే కిరణాలను మనం కాస్మిక్ రేస్ అని అంటాము. నవగ్రహాలలోకొన్ని  శుభ గ్రహాలు మరికొన్నిఅశుభ గ్రహాలు ఉంటాయి. శుభ గ్రహాల నుండి వచ్చే cosmic rays శుభ ఫలితాలను అశుభ గ్రహాల నుండి వచ్చే కిరణాలు అశుభ ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కులో బలం కలిగి ఉంటుంది. శుభ గ్రహాల ఆధిపత్యం లేదా బలం కలిగిన దిశలు మంచి ఫలితాలను ఇస్తాయి. అశుభ గ్రహాల బలం కలిగిన దిశలు చెడు ఫలితాలను ఇస్తాయి. ఇదే అసలు రహస్యం.దిక్కుల మంచి చెడు, దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న గ్రహం మరియు దిక్పతి పై ఆధారపడి ఉంటుంది. ఇదే వాస్తుకు జోతిష్యానికి ప్రధాన సంభందం. వాస్తుకు జ్యోతిష్యం తో సంభందం లేదు అన్న వాదన సరియైనది కాదు. నవగ్రహాలు భూమి పై వివిధ దిక్కుల ద్వారా తమ ఫలితాలను ప్రసారం చేస్తాయి.గ్రహాలలో శుభులెవరూ  అశుభులెవరో తెలుసుకొంటే దిక్కుల గురించిన పూర్తి అవగాహన వస్తుంది.. ఈ శ్లోకం గమనించండి
                        క్షీణేన్దు మందర విరాహు శిఖక్షమాజా:
                                పాపాస్తు పాపయుత చంద్ర సతశ్చ్హ పాప:
                                తేషాను తీవ శుభ దౌ గురు దాస వేశ్యౌ
                                క్రూరా దివాకర సూతక్షితి ఔ భవేతాం.
పై శ్లోకం ప్రకారం క్షీణ చంద్రుడు, రవి,శని, రాహు,కేతు మరియు పాపులతో కలసిన బుధుడు అశుభ గ్రహాలు. గురు,శుక్ర, మరియు శుభులతో కలిసిన బుధుడు, ఇంకా పూర్ణచంద్రుడు శుభ గ్రహాలుగా వర్గీకరించబడ్డాయి.
 కొన్ని దిక్కులందు శుభ గ్రహాలు బలంగాఉంటాయి. కొన్ని దిక్కులందు అశుభ గ్రహాలు బలంగా ఉంటాయి. శుభగ్రహాలు బలంగా ఉన్న దిక్కులు శుభఫలితాలను, అశుభగ్రహాలు బలంగా ఉన్న దిక్కులు అశుభఫలితాలను భూమి పైకి ప్రసరింపచేస్తాయి. ఇదే దిక్కులలోని శుభ అశుభ ఫలితాల మర్మం. ఏయే దిక్కులందు ఏ గ్రహం బలంగా ఉంటుందో ఈ క్రింది శ్లోకం తెలియజేస్తుంది.
ప్రాచ్యామ్ శక్తౌసౌమ్యాజీవాయామ్యాయాం రవి మంగళౌ
మందో బలీప్రతిచ్యాంచ కుబేర్యామ్ చంద్ర భార్గవౌ
ఈ శ్లోకం ప్రకారం బుధుడు, గురుడు తూర్పున బలవంతులు. రవి కుజులు దక్షిణాన బలవంతులు. శని గ్రహం పశ్చిమంలో బలవంతుడు. ఉత్తరం నందు చంద్ర శుక్రులు బలవంతులు. వీటిని గ్రహ దిగ్బలములు అంటారు. అదే విధంగా నవగ్రహాలను దిక్కులకు అధిపతులుగా మన మహర్షులు నిర్ణయించారు. ఈ విధమైన విభజనలో ఏకాశితపదవిన్యాసంలో రాహువు నైరుతి లో, కేతు వు వాయవ్యంలో ఉంటారు. పై వర్గీకరణ ప్రకారం శుభగ్రహాలు తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులలో బలంగా ఉండుట వలన ఈ దిక్కులు పూజనీయమైనివి గా పరిగణింపబడుచున్నవి. అదే విధంగా దక్షిణం పడమర నైరుతి మొ| దిక్కులలో పాప గ్రహాలు బలంగా ఉండుటవలన ఈ దిక్కులుతో జాగ్రత్తగా ఉండాలని వాస్తు తెలుపుతుంది. ఏ గృహాన్నైనా తూర్పు ఉత్తరాలను, పశ్చిమ దక్షిణాల కన్నా అధిక ఖాళీ ఉంచి నిర్మించాలని వాస్తు  ఆదేశిస్తుంది. నవగ్రహ మండలాన్ని మనం గమనించినట్లైతే ఈ దిక్కులందు శుభగ్రహాల బలం ఉంటుంది.ఈ శ్లోకం గమనించండి....
                        మధ్యే వర్తులాకార మండలే రవి:
                                ఆగ్నేయ దిగ్భాగే చతురస్రమండలే చంద్ర:
                                దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే కుజ:
                                ఈశాన్య దిగ్భాగే బాణాకార మండలే బుధ:
                                ఉత్తర దిగ్భాగే దీర్గ చతురస్రమండలే గురు:
                                ప్రాగ్ భాగే పంచకోణాకార మండలే శుక్ర:
                                పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే శని:
                                నైరుతి దిగ్భాగే సూర్పాకారమండలే రాహు:
                                వాయవ్య దిగ్భాగే ధ్వజాకార మండలే కేతు:  ----            “సూర్యసిద్ధాంతం”                                                                                                        
నవగ్రహ మండలంలో తూర్పు, ఉత్తర ,ఈశాన్యంలో శుభ గ్రహాలైన గురు, బుధ శుక్రులు ఉంటారు. ఈ గ్రహాలు   శుభమైన కిరణాలను లేదా cosmic rays ప్రసారం చేస్తాయి. వీటి వలన గృహస్తుకు శుభఫలితాలు వస్తాయి. ఈ గ్రహాల శుభదృష్టి మనిషి మనుగడకు, సుఖ జీవనానికి అవసరం. కనుక ఈ దిక్కులందు అధిక ఖాళీ స్థలం వదిలినట్లైతే అధిక ప్రదేశంలో ఈ గ్రహ దృష్టి పడి సుఖ శాంతులు కలుగుతాయి.ఈ దిక్కులలో  అధిక ఖాళీ ఉంచి ఇంకా తేలికగా బరువులు వేయకుండా ఉంచితే అధికంగా శుభ గ్రహాల మరియు దిక్పతుల ప్రభావం పడి గృహస్తుకు అధిక సుఖ శాంతులు లభిస్తాయి. కనుకనే ఈ దిక్కులందు అధిక మైన ఖాళీ స్థలం వదలమని వాస్తు చేపుతుంది. ఈ గ్రహ దృష్టి కోసమే ఈ దిక్కులను విశాలంగా మరియు పవిత్రంగా ఉంచాలి.
అశుభ గ్రహాల దృష్టి లేదా cosmic rays వీలైనంత తక్కువగా పడాలి కనుక నవగ్రహామండలంలో  పాపగ్రహాల బలం కలిగిన దక్షిణ పశ్చిమ నైరుతి ఆగ్నేయ వాయవ్య  దిక్కులందు తక్కువ స్థలం వదలాలి. ఈ గ్రహాల కిరణాలకు అవరోధం ఉండాలి. కనుకనే ఈ దిక్కులలో బరువులు వుంచి తక్కువ స్థలం వదిలితే గృహస్తుకు సమస్యలు రావు. అంటే చెడును ప్రసాదించే దిక్కులలో తక్కువ ఖాళీ స్థలం వదలి, మంచిని కలిగించే దిశలలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలినట్లైతే మనిషి జీవితం శుభ గ్రహ దృష్టి వలన సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. కనుకనే మంచి దృష్టిని ప్రసాదించే తూర్పు ఉత్తర ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ స్థలం వదలి ప్రతికూల దృష్టిని ప్రసారం చేసే దక్షిణ పశ్చిమ మొ|లగు దిక్కులలో తక్కువ ఖాళీ స్థలం వదలమని వాస్తు  ఆదేశిస్తుంది.
గ్రహం మరియు దిక్పతుల ప్రభావం సరిగా ఉండటానికి ఇంటికి 4 ప్రక్కల ఖాళీ స్థలాన్ని వదలాలి. హద్దులపై నిర్మాణం ఉండకూడదు. చెడును ప్రసాదించే దిక్కులను కూడా కావలసినంత మేరకు ఉపయోగించుకోవాలి. అప్పుడే  మంచి ఫలితాలు వస్తాయి. సమస్యలు దక్షిణం పడమర దిశల నుండి ఉంటాయని ఈ దిశలకు ఇంటిని ఖాయం చేసి ఖాళీ వదలకుండా నిర్మించకూడదు. ఈ విధంగా ఇంటిని నిర్మిస్తే నైసర్గిక వాస్తు దోషం సోకుతుంది. మన మహర్షులు 4 ప్రక్కల ఖాళీ స్థలాన్ని వదలిన ఇంటికి వాస్తుదోషం ఉండదని చెప్పడం జరిగింది.
                        చతుర్ద్వారే గృహేచైవ వాస్తు దొషో న విద్యతే.------   నారద సంహిత.

 4 ప్రక్కల స్థలం వదలి ద్వారాలను అమర్చితే గృహానికి వాస్తు దోషం ఉండదని పై శ్లోకం తెలుపుతోంది. ఇంటికి 4 ప్రక్కల ద్వారాలను అమర్చితే శుభఫలితాలు వస్తాయి. తూర్పు ద్వారం వలన దైవ భక్తి, ఉత్తర ద్వారము వలన సిరి సంపదలు దక్షిణ ద్వారం వలన సకల సౌఖ్యాలు, ఇంకా పశ్చిమ ద్వారం వలన ధనం ధాన్యం వంటి లాభాలు కలుగుతాయని మన మహర్షులు చెప్పడం జరిగింది. కనుక శుభ ఫలితాలకు గృహానికి 4 ప్రక్కల పిశాచ భాగం వదలి గృహాన్ని నిర్మించుట మంచిది. 

Monday, 30 November 2015

Veedhi Soola-Veedhi choopu in Vastu by suryadevara venugopal

వాస్తు విజ్ఞానం-2&3
అన్ని చింతలకు ఈశాన్యమే పరిష్కారం కాదు.
                                                సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)

ఈశాన్యం పెంచడం నవీన వాస్తు లో ఒక విపరీత ధోరణిగా మారింది. అన్ని సమస్యలకు ఈశాన్యం తూర్పు ఉత్తర నడకలే పరిష్కారంగా ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికైనా,ఏ నిర్మాణానికైనా అయిన ఈ దిశలు మాత్రమే కరెక్ట్ గా ఉంటే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయన్న ఒక విపరీత ధోరణి ప్రచారంలో ఉంది.ఈశాన్యం పెంచి తూర్పు ఉత్తర దిశలను కరెక్ట్ గా ఉంచి ఈ దిశలగుండ నడకలను ఏర్పర్చడంతో వాస్తు కు సంపూర్ణత్వం వస్తుంది అని నేటి భావన. కాని ఇది కరెక్ట్ కాదు.అన్ని దిశలు మంచివే. ఏ దిశకు ఉండే లాభ నష్టాలు ఆ దిశకు ఉంటాయి. అన్ని దిశలను సమతౌల్యం చేసి నిర్మించిన నిర్మాణాలే బాగా రాణిస్తాయి. ఏ దిక్కును యే విధంగా,ఏ మేరకు ఉపయోగించాలి అన్నదే ముఖ్యమైన విషయం. అందులోనే వాస్తు ప్రతిభ దాగుంది. అన్ని నిర్మాణాలకు ఒకే విధమైన వాస్తు సరిపడదు.. వృత్తిని బట్టి, కార్యకలాపాలను బట్టి,ప్రయోజనాన్ని బట్టి వాస్తును ఇవ్వవలసి ఉంటుంది. ఒక వ్యాపారానికి వాస్తు ఇచ్చే సందర్భంలో చాలా  విషయలను పరిగణనలోకి తీసుకోవాలి.ఇవ్వబడే  వాస్తు అక్కడ జరిగే వ్యాపారానికి సహకరించాలి. వ్యాపార అభివృద్దికి తోడ్పడాలి. ఒక విద్యా సంస్థకు ఇచ్చే వాస్తు సంస్థ అభివృద్దితోపాటు విద్యానాణ్యత కూడా పెరిగేలా  ఉండాలి.గృహ నికి ఇచ్చే వాస్తు పరిశ్రమలకు,వ్యాపారాలకు ఇచ్చే వాస్తు ఒకేలా ఉండదు. అదేవిధంగా గృహ వాస్తును దేవాలయాలకు అన్వయించకూడదు. అన్నిటికి ఒకే విధమైన వాస్తు సూత్రాలు అంతగా లాభాన్ని కలిగించవు. ప్రస్తుతం మనం గమనిస్తే అన్నిటికి  అంటే గృహాలకు, వ్యాపారాలకు, ధార్మిక సంస్థలకు ,విద్యాలయాలకు మొ| అన్నిటికి ఒకే విధమైన వాస్తు సూత్రాలను పాటిస్తున్నారు. దీని వల్ల నష్టం అంతగా ఉండనప్పటికి అభివృద్ది మాత్రం త్వరితగతిన జరుగదు. కనుక  దిక్కులను, దిక్పతులను మరియు నవగ్రహాలను బాగా అర్ధం చేసుకొని వాస్తును పాటించవలసి ఉంటుంది.వాస్తులో లోతైన అవగాహనకు  వాస్తు తో పాటుగా జ్యోతిష్య పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం. ఒకటి లేదా రెండు వాస్తుపుస్తకాల జ్ఞానం చాలదు. మన పూర్వ గ్రంధాల వాస్తు పరిజ్ఞానం తోపాటు జ్యోతిష్య పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం.ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి..
ఆధీతో గణితో యస్తు వాస్తుకేషు కృతశ్రమ:
శోధికారీ భవేరత్ర వాస్తుశాస్ర విరీక్షిత:
గణితము మరియు లోతైన శాస్రజ్ఞానం కలిగినవారు మాత్రమే వాస్తుపండితులు కాగలరని స్థూలంగా దీని భావం.
మనం నిర్మించే కట్టడాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అన్ని కట్టడాలలో ఒకే విధమైన కార్యకలాపాలు ఉండవు. గృహ ప్రయోజనం వేరు, వ్యాపార ప్రయోజనం వేరు అదే విధంగా పరిశ్రమలలో జరిగే కార్యకలాపాలు వేరు, హస్పిటల్స్ లో జరిగే కార్యకలాపాలు వేరు. విశ్రాంతి మందిరాల ప్రయోజనం వేరు అదే విధంగా సినిమా హాల్ ప్రయోజనం వేరు. ఈ ప్రయోజనాలను అనుసరించి వాస్తు నిర్ధారణ ఉండాలి. దిక్పతుల బలాబలాలు పూర్తిగా అవగాహన చేసుకొని,యే ప్రయోజనానికి యే దిక్పతి బాగా సహకరిస్తాడో తెలుసుకొని వాస్తును నిర్ధారించవలసి ఉంటుంది. ఈ విధమైన వాస్తు వలన అభివృద్ది సాధ్యం అవుతుంది. ఉదా: ఆసుపత్రుల ముఖ్య లక్ష్యం వైద్యం. మరణాల సంఖ్య తగ్గాలి కనుక వైద్యం మెరుగుగా బలంగా ఉండాలి. కనుక ఏ దిక్పతి ఈ ప్రయోజనాన్ని అధికంగా నెరవేర్చగలడో తెలుసుకొని ఆ దిక్పతి బలాన్ని పెంచే విధంగా వాస్తును అమలుపర్చాలి. అదే విధంగా విద్యాలయంలో విద్యా అభివృద్ది కోసం వాస్తు సహకరించాలి. కనుక విద్యాభివృద్దికి తోడ్పడే దిక్పతికి బలాన్ని కలిగించే విధంగా వాస్తు ఉండాలి. అంతేకాని అన్నిటికి తూర్పు ఉత్తరాలవైపు, పడమర దక్షిణాల కన్నా అధికమైన ఖాళీ ఉంచి ఈశాన్యాన్ని బాగా పెంచి నడకలను ఆ దిశలందు ఏర్పాటు చేస్తే సరిపోదు. ఈ దిశలే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. అన్ని నిర్మాణాలకు ఈ విధమైనవాస్తు అమరిక అమృతం కాదు. ఒక నిర్మాణానికి ఈశాన్య దిక్పతి బలం అవసరమౌతుంది,మరొక నిర్మాణానికి పడమర దిక్పతి సహాయం కావలసివస్తుంది, ఇంకా కొన్ని నిర్మాణాలకు దక్షిణ పశ్చిమ దిక్పాలకులు బలంగా ఉండాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రయోజనాన్ని బట్టి దిక్కులను దిక్పాలకులను వినియోగించుకోవాలి. ఇదే సరియైన పద్దతి.
 ఈ విధానమే మంచి లాభాలను కలిగిస్తుంది. కనుక దిక్కులను యే ప్రయోజనాలకు ఎంత మేరకుఉపయోగించాలో వాస్తు పండితుడికి తప్పనిసరిగా తెలిసిఉండాలి. ప్రయోజనాన్ని బట్టి కార్యకలాపాలను బట్టి వాస్తు మారుతుంది. అన్నిటికి ఈశాన్య జపమే కరెక్ట్ కాదు.
ఈశాన్యం గురించి మనకు కొన్ని మూఢ నమ్మకాలున్నాయి. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అని నేటి నమ్మకం. చాలా మంది వాస్తు పండితులు కూడా ఈ నమ్మకాన్నే బలపరుస్తున్నారు. కాని నిజం ఏమంటే  ఈశాన్యం పెరగాలే కానీ మరీ విపరీతంగా పెరగకూడదు. ఈశాన్యం విపరీతంగా పెరగడం వల్ల అధిక ఖర్చు, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపించడం వంటి సమస్యలు ఉంటాయి. ఈశాన్యం విపరీతం గా పెరిగితే స్థల ఆకారం లో మార్పువస్తుంది. ఆ స్థలం “విషమబాహు స్థలంగా” మారుతుంది. విషమే శోకలక్షణం” అని చెపుతుంది “సమరాంగణ సూత్రధార” అనే ప్రాచీన వాస్తుగ్రంధం. కనుక స్థల ఆకారంలో మార్పు వచ్చే విధం గా ఈశాన్యం కూడా పెంచకూడదు. అసలు ఈశాన్యం ఎంత పెంచాలో మన ప్రాచీన వాస్తు గ్రంధాలు తెలియజేశాయి. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.
                                “మాషామాత్రంతు ఈశాన్యం పుత్రదారాది లాభకృత్
                                విద్యావినోద పాండిత్యం చతుస్పాజీవ లాభదం”
                                                                                                                “ప్రాచీనకారిక”
మినపగింజంత పరిమాణంలో ఈశాన్యం పెరిగినా భార్య, సంతాన లాభముతోపాటు విద్య,పాండిత్యం,పశుగణ వృద్ది కలుగుతాయి అని ప్రాచీనకారిక అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలియ జేస్తుంది. దీని ప్రకారం మనం గమనిస్తే ఈశాన్యాన్ని విపరీతంగా పెంచాల్సిన అవసరం లేదు అని స్పష్టమౌతుంది. తూర్పు ఆగ్నేయం కన్నా మరియు ఉత్తర వాయవ్యం కన్నా కొద్దిగా పెరిగితే సరిపోతుంది. కరెక్ట్ చెప్పాలంటే స్థలం యొక్క వైశాల్యంను అనుసరించి ఈశాన్యాన్ని పెంచడం మంచిది.
ఇప్పుడు మనం ప్రయోజనాలను అనుసరించి, కార్యకలాపాలను లేదా లక్ష్యాలను అనుసరించి వాస్తును యే విధంగా మలచాలో, దిక్పతుల బలాన్ని యే విధంగా ఉపయోగించుకోవాలోతెలుసుకుందాం. ఉదాహరణకు కొన్ని సంస్థలను పరిశీలిద్దాం. ముందుగా హాస్పిటల్స్ కు యే విధమైన వాస్తు అవసరం అవుతుందో పరిశీలిద్దాం. వైద్య శాలలు అందరికీ సమానమే. స్త్రీ పురుషులిరువురు సమానమైన వైద్యాన్నిపొందుతారు. మరణాల సంఖ్య తగ్గాలి మెరుగైన వైద్యం ప్రజలందరికీ అందాలి. అదే విధంగా వైద్యుడు అభివృద్దిని పొందాలి. హాస్పిటల్ యొక్క ప్రయోజనం ఇదే. ఈ ప్రయోజనాలకి ఏ దిక్కులు సహకరిస్తాయో ఏ దిక్కులు ఆటంకాలను కలిగిస్తాయో ముందుగా తెలుసుకోవాలి. హాస్పిటల్స్ కు తూర్పు మరియు పడమర దిశల ఖాళీ ప్రదేశాలలో ఎక్కువ బేధం ఉండరాదు. పడమర కన్నా తూర్పు కొద్దిగా మాత్రమే ఎక్కువ ఉండాలి.పడమర వైపు ఖాళిస్థలం లేకుండా హాస్పిటల్ నిర్మించరాదు. అదేవిధంగా ఎత్తుపల్లాలలో కూడా తూర్పు పడమరల మధ్య అధిక బేధం ఉండకూడదు. పడమర తూర్పుకన్న కొద్దిగా మాత్రమే ఎత్తు ఉండాలి.హాస్పిటల్స్ కు దక్షిణం వైపు ఖాళీ ఉండాలి. నైరుతి, ఆగ్నేయ,దక్షిణ ప్రాంతాలు ఈశాన్య, వాయవ్య, పడమర, తూర్పు దిశల కన్నా ఎత్తు ఉండాలి. ఆపరేషన్ గదులు పడమర, వాయవ్య, తూర్పు, ఆగ్నేయ దిశలలో ఉండాలి. దక్షిణం మధ్య భాగంలో మరియు నైరుతి దిక్కులో  ఆపరేషన్ రూమ్ ఉండకూడదు.ఉత్తర దిశ, ఈశాన్య దిశ పల్లంగా ఉండాలి. ఉపయోగించిన నీరు ఈ దిశలగుండ బయటకు వెళ్ళాలి. హాస్పటల్ యజమాని యైన డాక్టర్ తన వర్గు నియమాన్ని అనుసరించి తన గదిని నిర్మించుకోవాలి. తన స్వ వర్గులో కానీ, మిత్ర వర్గు కలిగిన దిశలలో కూర్చోవాలి. అంతే కాని యజమాని దిక్కు నైరుతి మాత్రమే అని ఆ దిశలో కూర్చోరాదు. నైరుతి దిశ డాక్టర్ యొక్క శత్రు దిశ అయితే చాలా సమస్యలు వస్తాయి.హాస్పటల్స్ కు తూర్పు బలం చాలా అవసరం కనుక తూర్పులోనే Underground Watersumps నిర్మించాలి. Pharmacy వాయవ్యంలో మంచిది. Cash counter ఉత్తరంలో ఉండాలి. Store room నైరుతి లో ఉండాలి. వైద్యశాలలకు తూర్పు,పడమర మరియు ఉత్తరం సింహద్వారములు మంచివి. ఈ విధంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాస్తును నిర్ధారించాలి.తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి.
అదే విధంగా విద్యాలయాల వాస్తును గమనిస్తే, విద్యార్ధులు తూర్పు లేదా ఉత్తరం అభిముఖంగా కూర్చొని విద్యను నేర్చుకోవాలి. దీనికి అనుగుణంగా తరగతి గదులను రూపొందించాలి. ఉత్తరం పల్లంగా ఉండాలి. నిర్మాణం చుట్టూ 4 దిశలందు ఖాళీ ఉండాలి. తూర్పుఉత్తరాల వైపు విపరీతమైన ఖాళీ ఉంచి భవనాన్ని నిర్మించరాదు. ఈ విధంగా చేయడం వల్ల భవనం మొత్తం పూర్తి నైరుతిలోకి ఉంటుంది లేదా స్థలం యొక్క అసుర భాగంలోఉంటుంది. ఈ విధంగా ఉంటే విద్యాఫలితాలు ఆశించినంతగా ఉండవు. కనుక అసుర స్థానంలోకి భవనం వెళ్లకుండా జాగ్రత్తగా నిర్మించాలి. ఉత్తరం లేదా  తూర్పు భాగాలలో కాష్ కౌంటర్ ఉండాలి. వాయవ్యంలో విద్యాసంస్థలకు కాష్ కౌంటర్ మంచిది కాదు. అన్ని దిశలకన్నా ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యం పల్లంగా ఉండాలి. పరిశోధన శాలలు తూర్పు, పడమర వాయవ్యం మరియు ఆగ్నేయం లో ఉండాలి. పి‌హెచ్‌డి తరగతులు తప్పనిసరిగా ఉత్తరం లో ఉంచాలి. సైన్స్ తరగతులను పడమర దక్షిణ దిక్కులందు మిగిలినవి వాయవ్య ఉత్తర దిశలందు ఏర్పాటుచేయాలి. విద్యాలయాలకు దక్షిణ.పడమర తూర్పు సింహా ద్వారములు మంచివి. మగపిల్లల తరగతి గదులు దక్షిణ  తూర్పులందు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్త్రీలకు పడమర ఉత్తరాలు మంచివి. విద్యాలయాలకు తప్పనిసరిగా ప్రధాన దిశలందు గేట్ తప్పనిసరి.ఈశాన్యంలో గేట్ ఉన్నది కదా అని ప్రధాన దిశాలైన తూర్పు,ఉత్తరాలలో గేట్ లేకుండా ఉండకూడదు. ఈ విధంగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వాస్తును నిర్ణయించాలి. తూర్పు ఈశాన్యం  కన్నా ఉత్తర ఈశాన్యం కొద్దిగా ఎక్కువ ఉండాలి.
ధార్మిక సంస్థలకు, ఆశ్రమాలకు నైరుతి దోషం ఉండకూడదు. నైరుతి దోషం ఉంటే ఆశ్రమాలు అక్రమాలకు నిలయం కాగలవు. అదేవిధంగా ఆగ్నేయ దోషాలు ఉండరాదు. కలహాలు ఉంటాయి. ఆశ్రమాలకు నైరుతి మరియు ఆగ్నేయ దోషం ఉంటే అనేకరకమైన ప్రవర్తనా దోషాలు ఉంటాయి. ఈ దోషానికి వాయవ్య దోషం తోడైతే పోలీస్ కేసులు ఇంకా న్యాయపరమైన వివాదాలు ఉంటాయి.  అదేవిధంగా వీటిని తప్పనిసరిగా 4 వైపులా సమానమైన ఖాళీ వదలి నిర్మించాలి. ఆశ్రమాలకు లాభాపేక్ష ఉండదు కాబట్టి  వీటికి ఈశాన్యం పెంచరాదు. 4 దిశలు సమంగా ఉండాలి.ఇది గమనించండి
                “ముక్తికామస్యకరణే శుద్ద ప్రాచీమ్ ప్రయోజయేత్”
ముక్తిని కొరువారు 4 కొలతలు సమానమైన భూమిలో నివశించాలి. దీనినే శుద్ధ ప్రాచీ స్థలం అని అంటారు. ఈ స్థలంలో ఈశాన్యం పెరిగి ఉండక 4 దిశలు సమానం గా ఉంటాయి. ఇటువంటి స్థలాలలో ఆశ్రమాలు ధార్మిక సంస్థలు బాగా రాణిస్తాయి.సింహద్వారాలు ఈశాన్య భాగంలో కాకుండా ప్రధాన దిక్కులలో ఉండాలి. తూర్పు,పడమర ,ఉత్తరం మరియు దక్షిణ మధ్య భాగాలందు ద్వారాలు ఉండాలి. అంతే కాని విదిక్కు లైన ఈశాన్యం,దక్షిణ ఆగ్నేయం ,పశ్చిమ వాయవ్యం లలో సింహద్వారాలు ఉండకూడదు. విదిక్కులందు కిటికీలను ఉంచాలి.
వ్యవసాయానికి పడమర మరియు వాయవ్య దిశలు బలంగా ఉండాలి. వ్యాపారానికి ఉత్తరంతో పాటు దక్షిణ ఆగ్నేయం కూడా బాగుండాలి.కొన్ని రకాలైన వ్యాపారాలకు ఉత్తరం కన్నా దక్షిణం కొద్దిగా పల్లంగా  ఉండాలి.బార్ మరియు మద్యపాన దుకాణాలకు నైరుతి బలంగా ఉండాలి. మద్యపాన దుకాణాలకు ఈశాన్యం కన్నా నైరుతి ఎంతోకొంత పెరిగిఉంటే చక్కటి వ్యాపారం ఉంటుంది. అయితే ఇటు వంటి షాపుల యజమాని ఇంట్లో నైరుతి కరెక్ట్ గా ఉండి ఈశాన్యం పెరిగి ఉండాలి.ఇటు వంటి విచారణ తో మరియు పూర్తి అవగాహనతో వాస్తును అమలు చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. గృహాలలో తప్పనిసరిగా దక్షిణం పడమరలు తూర్పు ఉత్తరాలకన్నా మెరకగా ఉండాలి నైరుతి అన్నిటికన్నా మెరక తో మరియు ఈశాన్యం అన్నిటికన్నా పల్లంగా ఉండాలి.
ఈ విధంగా పూర్తి అవగాహనతో వాస్తును అనుసరించవలసి ఉంటుంది. మిడిమిడి జ్ఞానం పనికి రాదు. దిక్పతులను దిక్కుల లక్షణాలను మరియు నవగ్రహాలను పూర్తిగా అవగాహన చేసుకొని వాస్తును అమలుచేయాలి. ఈశాన్యం పెంపుతో తూర్పు ఉత్తర నడకలతో వాస్తు ఆగిపోదు.ఇది నిరంతర ప్రక్రియ పరిశోధన చేస్తే ఎన్నో విషయాలు వెలుగులోనికి వస్తాయి.
గృహాలకు వాస్తును నిర్ణయించేటప్పుడు చెడును కలిగించే దిక్పతుల బలాన్ని తగ్గించి మంచిని కలిగించే దిశల బలాన్ని పెంచేటట్లుగా అమరిక ఉండాలి. కాని కొన్ని రకాలైన నిర్మాణాలకు చెడును కలిగించే దిశలను కూడా అవసరమైనంత మేరకు ఉపయోగించుకోవలసి ఉంటుంది. అప్పుడే నిర్మాణం యొక్క ప్రయోజనం చక్కగా నెరవేరగలదు. ఉదాహరణకు మద్యపాన దుకాణాలకు నైరుతిని కొంచం పెంచవలసి ఉంటుంది. నైరుతి దురలవాట్లను పెంచుతుంది. మద్యం ఒక దురలవాటు. కనుక మద్యం దుకాణాలు నిర్మించేటప్పుడు నైరుతిని ఆగ్నేయ వాయవ్యాల కన్నా కొంచెం ఎక్కువ ఉంచితే మద్యం అమ్మకం పెరుగుతుంది. కాని ఈ మద్యం దుకాణం యజమాని ఇంట్లో నైరుతి కరెక్ట్ గా ఉండాలి ఎంతోకొంత ఈశాన్యం పెరిగిఉండాలి. ఈ సందర్భంలో మనం చెడును ప్రసాదించే నైరుతిని అవసరమైనంతగా ఉపయోగించగలిగితే ఇటువంటి వ్యాపారాలు బాగా వృద్దిలోకి వస్తాయి. ఈ విధంగా జరిగే కార్యకలాపం,ప్రయోజనం బట్టి వాస్తు అమరిక ఉండడం సరియైన పద్దతి. అదేవిధంగా హోటల్స్ కు ఉత్తరం దక్షిణం సమానమైన ఎత్తులో ఉండాలి. కొన్ని రకాలైన హోటల్స్ కు దక్షిణ దిశను ఉత్తర దిశ కన్నా కొద్దిగా పల్లంగా ఉంచితే వ్యాపారం బాగా సాగుతుంది. దక్షిణం పల్లమైతే వ్యయం. కాబట్టి తినుబండారాలు అమ్మకం జోరుగా సాగుతుంది. కాని యజమాని ఇంట్లో మాత్రం ఉత్తరమే పల్లంగా ఉంచాలి. దక్షిణ దిశను మెరకలో ఉంచాలి. ఇటు వంటి వాస్తు నిర్ణయాలు తీసుకొనే సందర్బంలో సరియైన వాస్తు పండితుని సలహా మరియు పర్యవేక్షణ అవసరం. కిరాణా దుకాణాలు,ఆర్ధికపరమైన సంస్థలను  దక్షిణ ముఖద్వారం తో నిర్మిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.దక్షిణ ఆగ్నేయంలో దర్వాజా ఉంచితే స్త్రీలకు సకాలంలో వివాహాలు అవుతాయి.పాడిపరిశ్రమలకు, పశువుల కొష్టాలకు తూర్పు కన్నా పడమరను పల్లంలో ఉంచాలి. అప్పుడే పశువృద్ది, పాలవృద్దిచక్కగా ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుంటుంది.

దీనిని బట్టి అర్థం అయ్యే దేమంటే అన్నీ దిశలను  వాటి లక్షణాలను అనుసరించి మనం సరిగ్గా ఉపయోగించుకొంటే మంచి ఫలితాలు వస్తాయి. దిక్పతుల బలాబలాలను సరిగ్గా అంచనా వేయడంలోనే నిజమైన ప్రతిభ దాగుంది. ఇటు వంటి ప్రతిభ ఉన్నవారే నిజమైన వాస్తు పండితులు. వీరివల్ల ప్రజలకు సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

Sunday, 29 November 2015

వాస్తులో  ఎత్తుపల్లాల  ప్రాముఖ్యత
 సూర్యదేవర వేణుగోపాల్
ఎత్తుపల్లాలు వాస్తు నందు చాలా ముఖ్యమైనవి. వాస్తు లో గల అన్ని నిర్మాణ నియమాలు ఎత్తుపల్లాల ప్రాతిపదికనే రూపొందించబడినవి.. యే ఏ దిశలందు మెరక ఉండాలి, యే ఏ దిశలందు పల్లం ఉండాలన్న విషయాన్ని వాస్తుశాస్త్రం స్పష్టంగా తెలియచేసింది. గృహం లో ఉండే వారి జీవితాలను ఈ ఎత్తుపల్లాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎత్తుపల్లాలను శాస్త్ర బద్ధం గా పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ నియమాలను పాటించని పక్షం లో తీవ్ర నష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి. అందువల్ల గృహ నిర్మాణ సమయంలో ఈ నియమాలను శాస్త్ర బద్ధంగా పాటించాలి.
స్థూలంగా చెప్పాలంటే దిక్కుల విషయంలో తూర్పు, ఉత్తర ,భాగాలు పల్లంగా ఉండాలి. దక్షిణ, పడమర దిశలందు మెరకగా ఉండాలి. ఈ నియమం భూమి, ఫ్లోరింగ్, శ్లాబ్,వసారా మొదలగు అన్ని నిర్మాణ విషయాలకు వర్తిస్తుంది.ఈ నియమానికి విరుద్దంగా నిర్మాణాలు ఉంటే  అందులో నివసించేవారికి అనేక కష్టనష్టాలు వస్తాయి. ఈ ఎత్తుపల్లాల గురించి లోతుగా అధ్యయనం చేద్దాం.
మెరక పల్లాల ప్రాతిపదిక పై మన మహర్షులు స్థలాలను 4 రకాలుగా వర్గీకరించారు. అవి  గజపృష్ట భూమి:  ధైత్య పృష్ట భూమి:  నాగ పృష్ట భూమి:  మరియు కూర్మ పృష్ట భూమి. భూమి యొక్క ఎత్తుపల్లాలను బట్టి ఈ వర్గీకరణ జరిగింది. జాగ్రత్తగా పరిశీలిస్తే దిక్కులు, విదిక్కులందు ఎత్తుపల్లాలు  యే విధం గా ఉండాలో కూడ ఈ వర్గీకరణ లో తెలియచేయడం జరిగింది.
దక్షిణం, పడమర, నైరుతి, వాయవ్యం, దిశలు మెరక గాను మిగిలిన ఆగ్నేయ, ఈశాన్య, తూర్పు, ఉత్తర దిశలు పల్లం గాను ఉన్న భూమిని గజపృష్ట భూమి అని అంటారు. స్టూలంగా చెప్పాలంటే ఉత్తరం కంటే దక్షిణం మరియు తూర్పు కన్నా పడమర మెరకగా ఉన్న భూమే గజపృష్ట భూమి. ఈ భూమి అన్ని రకాలైన సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఇది నివాసానికి యోగ్యమైన భూమి.
           

            గజపృష్టే భవేద్వాస సలక్ష్మి ధనపూరిత:
            ఆయు:వృద్దికరీ నిత్యం జాయతే నాత్ర సంశయ:                                                                                                                                             “జ్యోతిర్నిబంధం”
పై శ్లోకం” జ్యోతిర్నిబంధం” అను ప్రాచీన వాస్తు గ్రంధం నుండి గ్రహించబడినది. ఈ శ్లోకం ప్రకారం గజపృష్ట భూమి లో నివసించేవాళ్ళకు దీర్ఘ ఆయుషు, సంపద, నిత్యం పెరుగుతూ ఉంటుంది.గృహస్థు ఎల్లప్పుడు  సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాడు.
ధైత్య్హ్యపృష్ఠ భూమి లో తూర్పు, ఆగ్నేయం, మరియు ఈశాన్యం మెరకగా ఉంటాయి. మిగిలిన దిశలైన నైరుతి, పడమర, దక్షిణం మరియు వాయవ్యం పల్లం గా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే తూర్పు భాగం మెరకగా ఉండి పడమర భాగం పల్లంగా ఉన్న భూమి ధైత్యపృష్ట భూమి. ఈ భూమి అత్యంత వినాశకారి.
                        ధైత్యపృష్ఠే కృతేవాసే లక్ష్మీర్ణయాతి మందిరం
                        ధనపుత్ర పశూనాంచ హానిరేవ న సంశయ:               “జ్యోతిర్నిబంధం.”

పై శ్లోకం ప్రకారం ఇందులో నివసించే వాళ్ళకు ధన నాశనం,పుత్ర పశు మరియు వంశ నాశనం జరుగవచ్చు.ఈ భూమి నివాసయోగ్యం కాదు.
ఉత్తర దక్షిణాలు మెరకగా ఉండి తూర్పు పడమరలు దీర్ఘంగా, పొడవుగా ఉన్న భూమి నాగపృష్ట భూమి.ఇది నివాసానికి పనికిరాదు.
                        నాగపృష్టే యధావాసో మృత్యురేవ న సంశయ:
                        పత్నీహాని: పుత్రహాని: శత్రువృద్ది: పదేపదే.
                                                                                    “జ్యోతిర్నిబంధం.”
మధ్య భాగం ఎత్తుగా ఉండి మిగిలిన 4 దిశలు పల్లంగా ఉన్న భూమిని కూర్మపృష్ట భూమి అని అంటారు.ఈ భూమి ఫలితాల పై కొన్ని ప్రాచీన గ్రంధాలు అనుకూలంగా తెలియజేస్తే మరికొన్ని గ్రంధాలు ప్రతికూలంగా తెలియజేశాయి.
”ధనం ధాన్యం భవేత్తస్య నిశ్చ్హితం విపులం శుభం”.      జ్యోతిర్నిబంధం
పై శ్లోకం ప్రకారం  కూర్మపృష్ట భూమి ధనధాన్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.అయితే”“విశ్వకర్మప్రకాశిక” అను మరో ప్రాచీన వాస్తు గ్రంధం
“ కూర్మే ధన నాశనం “  అని తెలియజేసింది.ఇప్పటి పరిస్థితుల ప్రకారం పరిశీలిస్తే ఈ భూమి అంతగా మంచి ఫలితాలు ఇవ్వడం లేదు అని చెప్పవచ్చును.
జ్యోతిర్నిబంధం, విశ్వకర్మ ప్రకాశిక ఇంకా నారద సంహిత వంటి అనేక ప్రాచీన వాస్తు గ్రంధాలు అప్పటి పరిస్థితులను, అప్పటి అవసరాలను,కాలాన్ని బట్టి స్థల విభజన చేశాయి. ఈ విభజన లో కొన్ని వాస్తు నియమాలు తెలియజేయబడినవి.. అయితే ఇప్పటి కాలంలో స్థలాలను వాస్తుకు అనుగుణంగా సవరించి గృహాలను నిర్మించవచ్చు. యే విధమైన స్థలమునైనా వాస్తుకు అనుగుణంగా సవరించి నిర్మాణాలు చేపట్టవచ్చు. వాస్తు లో ఎత్తుపల్లాలు సరియైన సమన్వయంతో ఉండాలి. ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. నిర్మాణాలలో ఎత్తుపల్లాలు, వాస్తు కు అనుగుణంగా యే విధంగా ఉండాలో స్థూలంగా పరిశీలిద్దాం.
ఏ స్థలం లో నైనా లేదా నిర్మాణంలో నైనా తూర్పు, ఈశాన్య దిశలు పల్లంగా ఉండాలి. నైరుతి, దక్షిణం, పడమర మరియు ఆగ్నేయ దిశలు మెరకగా ఉండాలి. అంటే నైరుతి, దక్షిణం, పడమర ,ఆగ్నేయ మరియు వాయవ్య దిశలు, తూర్పు, ఉత్తర,మరియు ఈశాన్య దిశలకన్నా మెరకగా ఉండాలి.ఈ విధమైన అమరిక వాస్తు పుష్టిని కలిగించి గృహస్థు కు అనేక శుభాలను ప్రసాదిస్తుంది.ఈ సూత్రానికి వ్యతిరేకంగా నిర్మాణాలు ఉంటే అనేక నష్టాలు వస్తాయి.. దిక్కులలో దక్షిణ, పడమర దిక్కులు తూర్పు, ఉత్తర దిశలకన్నా మెరకగా ఉండాలి. అదేవిధంగా నైరుతి ఆగ్నేయం కన్నా మెరకగా ఉండాలి.వాయవ్యం ఆగ్నేయం కన్నా పల్లంగా ఉండాలి. ఇంకా ఈశాన్యం వాయవ్యం కన్నా పల్లంగా ఉండాలి. అంటే అన్నిటికంటే నైరుతి మెరకగాను, ఈశాన్యం పల్లంగాను ఉండాలి.ఈ విధమైన కూర్పు అనేక సంపదలకు రహదారి కాగలదు. ఇటువంటి గృహాలలో నివసించేవారికి అన్ని విషయాలలో అభివృద్ది, సంఘం లో పేరు ప్రతిష్టలు ఉంటాయి.ఈ ఎత్తుపల్లల నియమాలను భూమి విషయం లో ఇంకా నిర్మాణ విషయాలైన Flooring, slabs, వసారాలు,ప్రహరీ మొదలగు అన్నిటి యందు పాటించాలి.
గృహానికి వెలుపల ఉన్న ఎత్తుపల్లాలు కూడా ముఖ్యమైనవే. ఇవి కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. గృహం వెలుపల ఉన్న వాస్తు దోషాలను సవరించలేము. ప్రహరీ నిర్మిస్తే వెలుపలి దోషాలు వాటి ప్రభావాలు తగ్గిపోతాయి.కనుక యే నిర్మాణాని కైనా ప్రహరీ చాలా ముఖ్యం.వివిధ దిక్కులలో ఉన్న ఎత్తుపల్లాల వల్ల వివిధ రకాలైన ప్రభావాలు కలుగుతాయి. కొన్ని దిక్కులలో ఉన్న మెరక వల్ల తీవ్ర నష్టాలు  కలుగుతాయి. మరికొన్ని దిక్కులలో ఉన్న పల్లం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతీ దిక్కుకు ఆ దిక్పతికి సంబందించిన ఎత్తుపల్లాల నియమాలు ఉన్నాయి. ఈ నియమాలకు భంగం రాకుండా నిర్మాణం జరగాలి. దిక్కులకు సంబందించిన నియమాలు యేమిటి  వాటిని యే విధంగా పాటించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ప్రధాన దిక్కులైన  తూర్పు, ఉత్తరం, దక్షిణం మరియు పడమర,  విదిక్కులైన నైరుతి,ఆగ్నేయం, వాయవ్యం మరియు ఈశాన్యం స్థానాలలో ఎత్తుపల్ల నియమాలు యే విధం గా ఉండాలో వాటి ఫలితాలు యే విధం గా ఉంటాయో “అపరాజితపృచ్చ” అను ప్రాచీన వాస్తు గ్రంధం తెలియజేసింది. వీటిని గురించి వివరంగా విడివిడిగా తెలుసుకుందాం.
తూర్పు:  తూర్పు ఎప్పుడు పల్లంగానే ఉండాలి. పడమర కంటే తప్పని సరిగా పల్లంగా ఉండాలి. తూర్పు మెరకగా ఉంటే గృహం లో నివసించే మగవారికి అరిష్టం. వారికి కలిసిరాదు. వారు యే వృత్తిలోను స్థిరపడలేరు. తూర్పు పల్లం గా ఉంటే వంశ వృద్ది, సంపద, ఆరోగ్య వృద్ది, ఉంటాయి. మగసంతానం అభివృద్ది పధంలో ఉంటారు. రాజకీయ రంగంలో ఉండేవారికి తూర్పు తప్పనిసరిగా పల్లం గా ఉంటారు.
                                                పూర్వప్లవా ధరా శ్రేష్టా ఆయు: శ్రీ బలవర్ధినీ
                                                సర్వసంపత్కరీ పుంసాం ప్రాసాదానామ్ విభూతిధా
                                                                                                “అపరాజిత పృచ్చ”
           
పై  శ్లోకం ప్రకారం పల్లమైన తూర్పు మంచి ఆయుర్దాయము, సిరిసంపదలు, రాజ్యపూజ్యతను కలుగజేస్తుంది. తూర్పున పల్లంగా ఉన్న దేవాలయము ప్రసిద్దిని పొందుతుంది. కాబట్టి సుఖసంతోషాల కోసం తూర్పును పల్లంగా ఉంచాలి.
ఆగ్నేయం: ఆగ్నేయం ఎత్తుగా ఉండాలి. నైరుతి కన్నా పల్లంగా, వాయవ్య, ఈశాన్యాల కన్నా మెరకగా ఉండాలి. ఆగ్నేయం, ఈశాన్యవాయవ్యాల కన్నా పల్లంగా ఉంటే, అగ్నిప్రమాదాలు, స్త్రీలకు అనారోగ్యం, బంధు మిత్రులతో సమస్యలు, ఆర్ధికసమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆగ్నేయం పల్లమైతే మధుమేహ సమస్య. మూత్రపిండాల సమస్యలు, అజీర్ణ సమస్యలు ఆ స్థలంలో నివసించేవారికి వచ్చే అవకాశం ఉంది.
                                    ఆగ్నేయ ప్లవకా భూమి అగ్నిదాహ భయావహా
                                    శత్రు సంతాపదా నిత్యం కలి దోషోగ్ని ప్లవ: స్మృత: 
                                                                                                “అపరాజిత పృచ్చ”
ఆగ్నేయం పల్లంగా ఉన్న ప్రదేశం అగ్ని భయాన్ని, శత్రు సమస్యను.ఇంకా చెడ్డ పనుల పట్ల మనసును మళ్ళించడం వంటి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కనుక ఆగ్నేయం పల్లంగా ఉండకుండా ఉండవలసినంత ఎత్తు లో ఉండాలి.
దక్షిణం: దక్షిణం తప్పనిసరిగా మెరకగా ఉండాలి. దక్షిణం మెరక ఉంటే, మంచి ఆరోగ్యం, ఆర్ధికాభివృద్ది ఉంటాయి. దక్షిణం పల్లమైతే, ప్రమాదాలు, ఆర్ధిక నష్టం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలలో అవయువ నష్టం వంటి సమస్యలు వస్తాయి. దక్షిణం పల్లమైన దేవాలయం కూడా అభివృద్దికి నోచుకోదు.
                        నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
                        ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:     “ అపరాజిత పృచ్చ”
                                                                                   
ధన ఆరోగ్య హాని నిత్యం రోగభయం వంటి నష్టాలు దక్షిణం పల్లమైన భూమి ప్రసాదిస్తుంది. ఇటువంటి స్థలంలో దేవుడు కూడా నశిస్తాడు అని పై శ్లోకం తెలుపుతోంది. కనుక చక్కటి జీవితానికి దక్షిణాన్ని తప్పనిసరిగా మెరకగా ఉంచాలి.

నైరుతి: ఇది అన్నింటికన్నా ప్రమాదకరమైనది. ఇది అన్నీ దిశల కన్నా తప్పనిసరిగా మెరకలో ఉండాలి. నైరుతి పల్లమైన భూమిలో నివశిస్తే అనేక అరిష్టాలు కలుగుతాయి. యాక్సిడెంట్లు, ప్రవర్తనా దోషాలు, వృత్తి ఉద్యోగ సమస్యలు, ఆర్ధిక ఆరోగ్య నష్టం, గుండె సమస్యలు,శస్త్ర చికిత్సలు, సంతానం లేకపోవడం,వంశనాశనం, వంటి తీవ్ర సమస్యలు వస్తాయి. నైరుతి వాస్తు దోషం గృహం లో నివసించే పెద్ద సంతానం, యజమాని, యజమానురాలిపై తీవ్రం గా పనిచేస్తుంది. నైరుతి అన్నీ దిశల కన్నా మెరకగా ఉంటే సకల శుభాలు కలుగుతాయి.
                                    ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
                                    ధనహానిమ్ తధా నిత్యం కురుతే నైరుతి ప్లవా.
                                                                                    అపరాజితపృచ్చ.
నైరుతి పల్లం ధన హానికి అనారోగ్యానికి  మృత్యువుకు హేతువు అవుతుంది. ఆకస్మిక మరణాలకు ప్రమాదాలకు నైరుతి కారణం. కనుక ఈ దిక్కును తప్పనిసరిగా మెరకగా ఉంచాలి.
పడమర: ఈ దిశ మెరకగా ఉండాలి. తూర్పు కన్నా తప్పనిసరిగా మెరకగా ఉండాలి. పడమర పల్లమైతే మగవారికి నష్టం. కలిసిరాదు. పుత్ర సంతానం ఉండకపోవచ్చు. పుత్ర సంతానం నష్టం కావచ్చు. కనుక పడమర తప్పనిసరిగా మెరకగా ఉండాలి.
                                    పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
                                    శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.   -  అపరాజితపృచ్చ
                                                                                   
పడమర పల్లం ధనధాన్యాలను నాశనం చేస్తుంది. శోకం,వంశనాశనం కలుగుతుంది. కనుక పడమర ఎత్తులో ఉండాలి. పడమర ఎత్తులో ఉంటే సకల సంపదలు కలుగుతాయి. మగవారు ప్రయోజకులు గా ఉంటారు. సంఘం లో ప్రతిష్ట ఉంటుంది.
వాయవ్యం: ఈ దిశ ఈశాన్యం కన్నా మెరకగాను, ఆగ్నేయం కన్నా పల్లం గాను ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ అమరికకు వ్యతిరేకంగా ఉంటే, రోగ భయం, శత్రువృద్ది, స్త్రీసంతాన సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, మానసిక ఆరోగ్య సమస్యలు,వెన్నుపూస సమస్యలు, టాన్సిల్స్ వంటి ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్దిక నష్టాలు, ఐ‌పి దాఖలు చేయడం వంటివి ఉంటాయి.ఆడ పిల్లలకు వివాహాలు సకాలం లో కావు, ఆడపిల్లల వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి.
                                    శతృకర్త్రీ విరాగీ చ గోత్ర క్షయకరీ తధా
                                    గృహే చ కన్యకానాం హంత్రీ సదా దు:ఖ భయవహా.
                                                                                                అపరాజితపృచ్చ
కనుక వాయవ్యం తప్పనిసరిగా ఈశాన్యం కన్నా మెరకగా ఆగ్నేయం,నైరుతి కన్నా పల్లం గా ఉండాలి.
ఈ విధమైన అమరిక వలన సకల పీడలు నశిస్తాయి.
ఉత్తరం: సకల ఆర్ధిక శుభాలకు ఈ దిక్కే కారణం. ఇది కుబేర స్థానం. ఈ దిశ ఎప్పుడు పల్లంగా ఉండాలి. ఉత్తరమ్ నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఆన్ని దిశల కన్నా పల్లంగా ఉంటే సిరిసంపదలు అనాయాసంగా ఒనగూడతాయి.పాండిత్య.శాస్త్ర విజ్ఞానం గృహస్తుకు కలుగుతుంది. ఇహ లోకంలో సుఖాలను పొందాలనుకుంటే ఈ దిశ తప్పనిసరిగా పల్లం గా ఉండాలి.
                                    పూజ్యా లాభకరీ నిత్యం పుత్ర పౌత్ర వివర్ధినీ
                                    కామదా భోగదా చైవ ధనదాచోత్తర  ప్లవా --- అపరాజితపృచ్చ
అన్నివిధాలైన ఇహలోక లాభాలకు,వంశవృద్దికి, ఇష్టకామ్య సిద్దికి అన్నీ భోగాలకు ఉత్తరం పల్లం గా ఉంచాలి. ఈ దిశ మెరక ఉంటే ధన నష్టం వ్యాపార విద్యా నష్టం, స్త్రీలకు వివాహం ఆలస్యం కావడం వంటి నష్టాలు కలుగుతాయి.. ఉత్తరమ్ మెరకగా ఉంటే ఆర్ధికాభివృద్దికి తీవ్ర ప్రతిబంధకం. కనుక సత్వర అభివృద్దికి ఉత్తరం పల్లంగా ఉండాలి.
ఈశాన్యం: ఇది అన్నీ దిశల కన్నా పల్లంగా తేలికగా ఉండాలి. ఈశాన్య పల్లం సకల సంపదలకు నిలయం. వంశవృద్దికి,ధనవృద్దికి  విద్యావృద్దికి ఈ దిశే కారణం. ఈశాన్యం పల్లంగా ఉంటే మగ పిల్లలు చక్కగా వృద్దిలోనికి వస్తారు.  మగవారు తమ భాద్యతల పట్ల అంకిత భావం తో ఉంటారు.
                                    వరసౌఖ్య సతీ సత్య సౌభాగ్యాది వివర్ధిని.
                                    ధనా:ఐశ్వర్య సంపన్న ధర్మ ఈశానక ప్లవా
                                                                                    అపరాజితపృచ్చ
పై శ్లోకం ప్రకారం ఈశాన్యం పల్లంగా ఉంటే సర్వతోముఖాభివృద్ది ఉంటుంది. మానవుడు సకల సౌఖ్యాలను పొందుతాడు. ఈశాన్యం మెరక ఉంటే తీవ్ర ఆర్ధిక సమస్యలు ఉంటాయి. యే రంగం లో ను కలసి రాదు. మగవారు అంతగా ప్రయోజకులు కాలేరు. కాన్సర్ వంటి రోగాలు వస్తాయి. కనుక మంచి జీవితానికి ఈశాన్యం పల్లం గా ఉండాలి.

పై విధమైన నియమాలను దృష్టి లోఉంచుకొని గృహ నిర్మాణాన్ని చేయాలి. ఆయా దిక్కులు వాటి ఎత్తుపల్లా ల నియమాలను దృష్టిలో ఉంచుకొని వాటిని పరస్పరం సమన్వయం చేసి గృహ నిర్మాణమ్ చేయాలి.ఈ నియమాలను అన్నీ నిర్మాణ విషయాలలో అంటే శ్లాబ్,ఫ్లోరింగ్, ప్రహరీ ఇంకా వసారాలు వంటి అన్నీ నిర్మాణాలలో పాటించాలి. ఈ విధం గా పాటిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఈ సూత్రాలను ఉల్లంఘిస్తే తిప్పలు తప్పవు. అందుకని వీటిని సమతౌల్యం చేసి అన్నీ నిర్మాణాలలో పాటించాలి. అప్పుడే సంపదతో పాటు సర్వతోముఖాభివృద్ది కలుగుతుంది.
సకల శుభాలను యే విధంగా పొందవచ్చో ఈ క్రింది శ్లోకం తెలుపుతుంది గమనించండి.
                                   
                                    అత్యంత వృద్దిదమ్ నృణా ఈశాన ప్రాగుదక్ ప్లవమ్
                                    అన్య దిక్షు ప్లవమ్ తేషాం శశ్వదత్యంత హానిదమ్.
                                                                                    నారద సంహిత.

ఈశాన్యం, తూర్పుమరియు ఉత్తరం పల్లంగా ఉంటే అత్యంత శుభం కలుగుతుంది. మిగిలిన దిక్కులు పల్లమైతే విపరీత మైన హాని కలుగు తుంది అని పై శ్లోకం తెలుపుతుంది.
కనుక ఎత్తుపల్లాల నియమాలను నిర్లక్ష్యం చేయకుండా వీటిని చక్కగా పాటించితే సకల విధమైన అభివృద్ది తప్పక కలుగుతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే విపరీతమైన నష్టం అన్నీ విషయాలలో కలుగుతుంది.  ఈ నిజాన్నిగమనించి పాటించుట మంచిది.

             
                                                సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)