జ్యోతిష్య,వాస్తు,సంఖ్యాశాస్త్ర,యోగా సమగ్ర విశ్లేషణ .... సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
Monday, 30 November 2015
వాస్తు విజ్ఞానం-2&3
అన్ని చింతలకు ఈశాన్యమే పరిష్కారం కాదు.
సూర్యదేవర
వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
ఈశాన్యం పెంచడం నవీన వాస్తు లో ఒక విపరీత ధోరణిగా మారింది. అన్ని
సమస్యలకు ఈశాన్యం తూర్పు ఉత్తర నడకలే పరిష్కారంగా ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికైనా,ఏ నిర్మాణానికైనా అయిన ఈ దిశలు మాత్రమే కరెక్ట్
గా ఉంటే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయన్న ఒక విపరీత ధోరణి ప్రచారంలో ఉంది.ఈశాన్యం పెంచి తూర్పు ఉత్తర దిశలను కరెక్ట్ గా ఉంచి ఈ దిశలగుండ నడకలను ఏర్పర్చడంతో
వాస్తు కు సంపూర్ణత్వం వస్తుంది అని నేటి భావన. కాని ఇది కరెక్ట్
కాదు.అన్ని దిశలు మంచివే. ఏ దిశకు ఉండే లాభ నష్టాలు ఆ దిశకు ఉంటాయి.
అన్ని దిశలను సమతౌల్యం చేసి నిర్మించిన నిర్మాణాలే బాగా రాణిస్తాయి.
ఏ దిక్కును యే విధంగా,ఏ మేరకు ఉపయోగించాలి అన్నదే
ముఖ్యమైన విషయం. అందులోనే వాస్తు ప్రతిభ దాగుంది. అన్ని నిర్మాణాలకు ఒకే విధమైన వాస్తు సరిపడదు.. వృత్తిని బట్టి, కార్యకలాపాలను బట్టి,ప్రయోజనాన్ని బట్టి వాస్తును ఇవ్వవలసి
ఉంటుంది. ఒక వ్యాపారానికి వాస్తు ఇచ్చే సందర్భంలో చాలా విషయలను పరిగణనలోకి తీసుకోవాలి.ఇవ్వబడే వాస్తు అక్కడ జరిగే వ్యాపారానికి సహకరించాలి. వ్యాపార
అభివృద్దికి తోడ్పడాలి. ఒక విద్యా సంస్థకు ఇచ్చే వాస్తు సంస్థ అభివృద్దితోపాటు విద్యానాణ్యత
కూడా పెరిగేలా ఉండాలి.గృహ నికి ఇచ్చే వాస్తు
పరిశ్రమలకు,వ్యాపారాలకు ఇచ్చే వాస్తు ఒకేలా ఉండదు. అదేవిధంగా
గృహ వాస్తును దేవాలయాలకు అన్వయించకూడదు. అన్నిటికి ఒకే విధమైన వాస్తు సూత్రాలు అంతగా
లాభాన్ని కలిగించవు. ప్రస్తుతం మనం గమనిస్తే అన్నిటికి అంటే గృహాలకు, వ్యాపారాలకు, ధార్మిక సంస్థలకు ,విద్యాలయాలకు మొ| అన్నిటికి ఒకే విధమైన వాస్తు సూత్రాలను పాటిస్తున్నారు. దీని వల్ల నష్టం అంతగా
ఉండనప్పటికి అభివృద్ది మాత్రం త్వరితగతిన జరుగదు. కనుక దిక్కులను, దిక్పతులను మరియు
నవగ్రహాలను బాగా అర్ధం చేసుకొని వాస్తును పాటించవలసి ఉంటుంది.వాస్తులో లోతైన అవగాహనకు
వాస్తు తో పాటుగా జ్యోతిష్య పరిజ్ఞానం తప్పనిసరిగా
అవసరం. ఒకటి లేదా రెండు వాస్తుపుస్తకాల జ్ఞానం చాలదు. మన పూర్వ గ్రంధాల వాస్తు పరిజ్ఞానం
తోపాటు జ్యోతిష్య పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం.ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి..
ఆధీతో గణితో యస్తు వాస్తుకేషు కృతశ్రమ:
శోధికారీ భవేరత్ర వాస్తుశాస్ర విరీక్షిత:
గణితము మరియు లోతైన శాస్రజ్ఞానం కలిగినవారు మాత్రమే వాస్తుపండితులు
కాగలరని స్థూలంగా దీని భావం.
మనం నిర్మించే కట్టడాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది.
అన్ని కట్టడాలలో ఒకే విధమైన కార్యకలాపాలు ఉండవు. గృహ ప్రయోజనం వేరు, వ్యాపార
ప్రయోజనం వేరు అదే విధంగా పరిశ్రమలలో జరిగే కార్యకలాపాలు వేరు, హస్పిటల్స్ లో జరిగే కార్యకలాపాలు వేరు. విశ్రాంతి మందిరాల ప్రయోజనం వేరు
అదే విధంగా సినిమా హాల్ ప్రయోజనం వేరు. ఈ ప్రయోజనాలను అనుసరించి వాస్తు నిర్ధారణ ఉండాలి.
దిక్పతుల బలాబలాలు పూర్తిగా అవగాహన చేసుకొని,యే ప్రయోజనానికి
యే దిక్పతి బాగా సహకరిస్తాడో తెలుసుకొని వాస్తును నిర్ధారించవలసి ఉంటుంది. ఈ విధమైన
వాస్తు వలన అభివృద్ది సాధ్యం అవుతుంది. ఉదా: ఆసుపత్రుల ముఖ్య లక్ష్యం వైద్యం. మరణాల
సంఖ్య తగ్గాలి కనుక వైద్యం మెరుగుగా బలంగా ఉండాలి. కనుక ఏ దిక్పతి ఈ ప్రయోజనాన్ని అధికంగా
నెరవేర్చగలడో తెలుసుకొని ఆ దిక్పతి బలాన్ని పెంచే విధంగా వాస్తును అమలుపర్చాలి. అదే
విధంగా విద్యాలయంలో విద్యా అభివృద్ది కోసం వాస్తు సహకరించాలి. కనుక విద్యాభివృద్దికి
తోడ్పడే దిక్పతికి బలాన్ని కలిగించే విధంగా వాస్తు ఉండాలి. అంతేకాని అన్నిటికి తూర్పు
ఉత్తరాలవైపు, పడమర దక్షిణాల కన్నా అధికమైన ఖాళీ ఉంచి ఈశాన్యాన్ని
బాగా పెంచి నడకలను ఆ దిశలందు ఏర్పాటు చేస్తే సరిపోదు. ఈ దిశలే అన్ని సమస్యలకు పరిష్కారం
కాదు. అన్ని నిర్మాణాలకు ఈ విధమైనవాస్తు అమరిక అమృతం కాదు. ఒక నిర్మాణానికి ఈశాన్య
దిక్పతి బలం అవసరమౌతుంది,మరొక నిర్మాణానికి పడమర దిక్పతి సహాయం
కావలసివస్తుంది, ఇంకా కొన్ని నిర్మాణాలకు దక్షిణ పశ్చిమ దిక్పాలకులు
బలంగా ఉండాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రయోజనాన్ని బట్టి దిక్కులను దిక్పాలకులను వినియోగించుకోవాలి.
ఇదే సరియైన పద్దతి.
ఈ విధానమే మంచి లాభాలను
కలిగిస్తుంది. కనుక దిక్కులను యే ప్రయోజనాలకు ఎంత మేరకుఉపయోగించాలో వాస్తు పండితుడికి
తప్పనిసరిగా తెలిసిఉండాలి. ప్రయోజనాన్ని బట్టి కార్యకలాపాలను బట్టి వాస్తు మారుతుంది.
అన్నిటికి ఈశాన్య జపమే కరెక్ట్ కాదు.
ఈశాన్యం గురించి మనకు కొన్ని మూఢ నమ్మకాలున్నాయి. ఈశాన్యం ఎంత
పెరిగితే అంత మంచిది అని నేటి నమ్మకం. చాలా మంది వాస్తు పండితులు కూడా ఈ నమ్మకాన్నే
బలపరుస్తున్నారు. కాని నిజం ఏమంటే ఈశాన్యం
పెరగాలే కానీ మరీ విపరీతంగా పెరగకూడదు. ఈశాన్యం విపరీతంగా పెరగడం వల్ల అధిక ఖర్చు, కుటుంబ
సభ్యుల మధ్య సమన్వయం లోపించడం వంటి సమస్యలు ఉంటాయి. ఈశాన్యం విపరీతం గా పెరిగితే స్థల
ఆకారం లో మార్పువస్తుంది. ఆ స్థలం “విషమబాహు స్థలంగా” మారుతుంది. “విషమే శోకలక్షణం” అని చెపుతుంది “సమరాంగణ సూత్రధార” అనే ప్రాచీన వాస్తుగ్రంధం. కనుక స్థల ఆకారంలో మార్పు వచ్చే విధం గా ఈశాన్యం
కూడా పెంచకూడదు. అసలు ఈశాన్యం ఎంత పెంచాలో మన ప్రాచీన వాస్తు గ్రంధాలు తెలియజేశాయి.
ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.
“మాషామాత్రంతు ఈశాన్యం పుత్రదారాది లాభకృత్
విద్యావినోద
పాండిత్యం చతుస్పాజీవ లాభదం”
“ప్రాచీనకారిక”
మినపగింజంత పరిమాణంలో ఈశాన్యం పెరిగినా భార్య, సంతాన
లాభముతోపాటు విద్య,పాండిత్యం,పశుగణ వృద్ది
కలుగుతాయి అని ప్రాచీనకారిక అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలియ జేస్తుంది. దీని ప్రకారం
మనం గమనిస్తే ఈశాన్యాన్ని విపరీతంగా పెంచాల్సిన అవసరం లేదు అని స్పష్టమౌతుంది. తూర్పు
ఆగ్నేయం కన్నా మరియు ఉత్తర వాయవ్యం కన్నా కొద్దిగా పెరిగితే సరిపోతుంది. కరెక్ట్ చెప్పాలంటే
స్థలం యొక్క వైశాల్యంను అనుసరించి ఈశాన్యాన్ని పెంచడం మంచిది.
ఇప్పుడు మనం ప్రయోజనాలను అనుసరించి, కార్యకలాపాలను
లేదా లక్ష్యాలను అనుసరించి వాస్తును యే విధంగా మలచాలో, దిక్పతుల
బలాన్ని యే విధంగా ఉపయోగించుకోవాలోతెలుసుకుందాం. ఉదాహరణకు కొన్ని సంస్థలను పరిశీలిద్దాం.
ముందుగా హాస్పిటల్స్ కు యే విధమైన వాస్తు అవసరం అవుతుందో పరిశీలిద్దాం. వైద్య శాలలు
అందరికీ సమానమే. స్త్రీ పురుషులిరువురు సమానమైన వైద్యాన్నిపొందుతారు. మరణాల సంఖ్య తగ్గాలి
మెరుగైన వైద్యం ప్రజలందరికీ అందాలి. అదే విధంగా వైద్యుడు అభివృద్దిని పొందాలి. హాస్పిటల్
యొక్క ప్రయోజనం ఇదే. ఈ ప్రయోజనాలకి ఏ దిక్కులు సహకరిస్తాయో ఏ దిక్కులు ఆటంకాలను కలిగిస్తాయో
ముందుగా తెలుసుకోవాలి. హాస్పిటల్స్ కు తూర్పు మరియు పడమర దిశల ఖాళీ ప్రదేశాలలో ఎక్కువ
బేధం ఉండరాదు. పడమర కన్నా తూర్పు కొద్దిగా మాత్రమే ఎక్కువ ఉండాలి.పడమర వైపు ఖాళిస్థలం
లేకుండా హాస్పిటల్ నిర్మించరాదు. అదేవిధంగా ఎత్తుపల్లాలలో కూడా తూర్పు పడమరల మధ్య అధిక
బేధం ఉండకూడదు. పడమర తూర్పుకన్న కొద్దిగా మాత్రమే ఎత్తు ఉండాలి.హాస్పిటల్స్ కు దక్షిణం
వైపు ఖాళీ ఉండాలి. నైరుతి, ఆగ్నేయ,దక్షిణ
ప్రాంతాలు ఈశాన్య, వాయవ్య, పడమర, తూర్పు దిశల కన్నా ఎత్తు ఉండాలి. ఆపరేషన్ గదులు పడమర, వాయవ్య, తూర్పు, ఆగ్నేయ దిశలలో
ఉండాలి. దక్షిణం మధ్య భాగంలో మరియు నైరుతి దిక్కులో ఆపరేషన్ రూమ్ ఉండకూడదు.ఉత్తర దిశ, ఈశాన్య దిశ పల్లంగా ఉండాలి. ఉపయోగించిన నీరు ఈ దిశలగుండ బయటకు వెళ్ళాలి. హాస్పటల్
యజమాని యైన డాక్టర్ తన వర్గు నియమాన్ని అనుసరించి తన గదిని నిర్మించుకోవాలి. తన స్వ
వర్గులో కానీ, మిత్ర వర్గు కలిగిన దిశలలో కూర్చోవాలి. అంతే కాని
యజమాని దిక్కు నైరుతి మాత్రమే అని ఆ దిశలో కూర్చోరాదు. నైరుతి దిశ డాక్టర్ యొక్క శత్రు
దిశ అయితే చాలా సమస్యలు వస్తాయి.హాస్పటల్స్ కు తూర్పు బలం చాలా అవసరం కనుక తూర్పులోనే
Underground Watersumps నిర్మించాలి. Pharmacy వాయవ్యంలో మంచిది. Cash counter ఉత్తరంలో ఉండాలి. Store room నైరుతి
లో ఉండాలి. వైద్యశాలలకు తూర్పు,పడమర మరియు ఉత్తరం సింహద్వారములు
మంచివి. ఈ విధంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాస్తును నిర్ధారించాలి.తూర్పు
ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి.
అదే విధంగా విద్యాలయాల వాస్తును గమనిస్తే, విద్యార్ధులు
తూర్పు లేదా ఉత్తరం అభిముఖంగా కూర్చొని విద్యను నేర్చుకోవాలి. దీనికి అనుగుణంగా తరగతి
గదులను రూపొందించాలి. ఉత్తరం పల్లంగా ఉండాలి. నిర్మాణం చుట్టూ 4 దిశలందు ఖాళీ ఉండాలి.
తూర్పుఉత్తరాల వైపు విపరీతమైన ఖాళీ ఉంచి భవనాన్ని నిర్మించరాదు. ఈ విధంగా చేయడం వల్ల
భవనం మొత్తం పూర్తి నైరుతిలోకి ఉంటుంది లేదా స్థలం యొక్క అసుర భాగంలోఉంటుంది. ఈ విధంగా
ఉంటే విద్యాఫలితాలు ఆశించినంతగా ఉండవు. కనుక అసుర స్థానంలోకి భవనం వెళ్లకుండా జాగ్రత్తగా
నిర్మించాలి. ఉత్తరం లేదా తూర్పు భాగాలలో కాష్
కౌంటర్ ఉండాలి. వాయవ్యంలో విద్యాసంస్థలకు కాష్ కౌంటర్ మంచిది కాదు. అన్ని దిశలకన్నా
ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యం పల్లంగా ఉండాలి. పరిశోధన శాలలు తూర్పు, పడమర వాయవ్యం మరియు ఆగ్నేయం లో ఉండాలి. పిహెచ్‌డి తరగతులు తప్పనిసరిగా ఉత్తరం
లో ఉంచాలి. సైన్స్ తరగతులను పడమర దక్షిణ దిక్కులందు మిగిలినవి వాయవ్య ఉత్తర దిశలందు
ఏర్పాటుచేయాలి. విద్యాలయాలకు దక్షిణ.పడమర తూర్పు సింహా ద్వారములు మంచివి. మగపిల్లల
తరగతి గదులు దక్షిణ తూర్పులందు ఏర్పాటు చేయాలి.
అదేవిధంగా స్త్రీలకు పడమర ఉత్తరాలు మంచివి. విద్యాలయాలకు తప్పనిసరిగా ప్రధాన దిశలందు
గేట్ తప్పనిసరి.ఈశాన్యంలో గేట్ ఉన్నది కదా అని ప్రధాన దిశాలైన తూర్పు,ఉత్తరాలలో గేట్ లేకుండా ఉండకూడదు. ఈ విధంగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని
వాస్తును నిర్ణయించాలి. తూర్పు ఈశాన్యం కన్నా
ఉత్తర ఈశాన్యం కొద్దిగా ఎక్కువ ఉండాలి.
ధార్మిక సంస్థలకు, ఆశ్రమాలకు నైరుతి దోషం ఉండకూడదు.
నైరుతి దోషం ఉంటే ఆశ్రమాలు అక్రమాలకు నిలయం కాగలవు. అదేవిధంగా ఆగ్నేయ దోషాలు ఉండరాదు.
కలహాలు ఉంటాయి. ఆశ్రమాలకు నైరుతి మరియు ఆగ్నేయ దోషం ఉంటే అనేకరకమైన ప్రవర్తనా దోషాలు
ఉంటాయి. ఈ దోషానికి వాయవ్య దోషం తోడైతే పోలీస్ కేసులు ఇంకా న్యాయపరమైన వివాదాలు ఉంటాయి.
అదేవిధంగా వీటిని తప్పనిసరిగా 4 వైపులా సమానమైన
ఖాళీ వదలి నిర్మించాలి. ఆశ్రమాలకు లాభాపేక్ష ఉండదు కాబట్టి వీటికి ఈశాన్యం పెంచరాదు. 4 దిశలు సమంగా ఉండాలి.ఇది
గమనించండి
“ముక్తికామస్యకరణే శుద్ద ప్రాచీమ్ ప్రయోజయేత్”
ముక్తిని కొరువారు 4 కొలతలు సమానమైన భూమిలో నివశించాలి. దీనినే
శుద్ధ ప్రాచీ స్థలం అని అంటారు. ఈ స్థలంలో ఈశాన్యం పెరిగి ఉండక 4 దిశలు సమానం గా ఉంటాయి.
ఇటువంటి స్థలాలలో ఆశ్రమాలు ధార్మిక సంస్థలు బాగా రాణిస్తాయి.సింహద్వారాలు ఈశాన్య భాగంలో
కాకుండా ప్రధాన దిక్కులలో ఉండాలి. తూర్పు,పడమర ,ఉత్తరం
మరియు దక్షిణ మధ్య భాగాలందు ద్వారాలు ఉండాలి. అంతే కాని విదిక్కు లైన ఈశాన్యం,దక్షిణ ఆగ్నేయం ,పశ్చిమ వాయవ్యం లలో సింహద్వారాలు ఉండకూడదు.
విదిక్కులందు కిటికీలను ఉంచాలి.
వ్యవసాయానికి పడమర మరియు వాయవ్య దిశలు బలంగా ఉండాలి. వ్యాపారానికి
ఉత్తరంతో పాటు దక్షిణ ఆగ్నేయం కూడా బాగుండాలి.కొన్ని రకాలైన వ్యాపారాలకు ఉత్తరం కన్నా
దక్షిణం కొద్దిగా పల్లంగా ఉండాలి.బార్ మరియు
మద్యపాన దుకాణాలకు నైరుతి బలంగా ఉండాలి. మద్యపాన దుకాణాలకు ఈశాన్యం కన్నా నైరుతి ఎంతోకొంత
పెరిగిఉంటే చక్కటి వ్యాపారం ఉంటుంది. అయితే ఇటు వంటి షాపుల యజమాని ఇంట్లో నైరుతి కరెక్ట్
గా ఉండి ఈశాన్యం పెరిగి ఉండాలి.ఇటు వంటి విచారణ తో మరియు పూర్తి అవగాహనతో వాస్తును
అమలు చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. గృహాలలో తప్పనిసరిగా దక్షిణం పడమరలు
తూర్పు ఉత్తరాలకన్నా మెరకగా ఉండాలి నైరుతి అన్నిటికన్నా మెరక తో మరియు ఈశాన్యం అన్నిటికన్నా
పల్లంగా ఉండాలి.
ఈ విధంగా పూర్తి అవగాహనతో వాస్తును అనుసరించవలసి ఉంటుంది. మిడిమిడి
జ్ఞానం పనికి రాదు. దిక్పతులను దిక్కుల లక్షణాలను మరియు నవగ్రహాలను పూర్తిగా అవగాహన
చేసుకొని వాస్తును అమలుచేయాలి. ఈశాన్యం పెంపుతో తూర్పు ఉత్తర నడకలతో వాస్తు ఆగిపోదు.ఇది
నిరంతర ప్రక్రియ పరిశోధన చేస్తే ఎన్నో విషయాలు వెలుగులోనికి వస్తాయి.
గృహాలకు వాస్తును నిర్ణయించేటప్పుడు చెడును కలిగించే దిక్పతుల
బలాన్ని తగ్గించి మంచిని కలిగించే దిశల బలాన్ని పెంచేటట్లుగా అమరిక ఉండాలి. కాని కొన్ని
రకాలైన నిర్మాణాలకు చెడును కలిగించే దిశలను కూడా అవసరమైనంత మేరకు ఉపయోగించుకోవలసి ఉంటుంది.
అప్పుడే నిర్మాణం యొక్క ప్రయోజనం చక్కగా నెరవేరగలదు. ఉదాహరణకు మద్యపాన దుకాణాలకు నైరుతిని
కొంచం పెంచవలసి ఉంటుంది. నైరుతి దురలవాట్లను పెంచుతుంది. మద్యం ఒక దురలవాటు. కనుక మద్యం
దుకాణాలు నిర్మించేటప్పుడు నైరుతిని ఆగ్నేయ వాయవ్యాల కన్నా కొంచెం ఎక్కువ ఉంచితే మద్యం
అమ్మకం పెరుగుతుంది. కాని ఈ మద్యం దుకాణం యజమాని ఇంట్లో నైరుతి కరెక్ట్ గా ఉండాలి ఎంతోకొంత
ఈశాన్యం పెరిగిఉండాలి. ఈ సందర్భంలో మనం చెడును ప్రసాదించే నైరుతిని అవసరమైనంతగా ఉపయోగించగలిగితే
ఇటువంటి వ్యాపారాలు బాగా వృద్దిలోకి వస్తాయి. ఈ విధంగా జరిగే కార్యకలాపం,ప్రయోజనం
బట్టి వాస్తు అమరిక ఉండడం సరియైన పద్దతి. అదేవిధంగా హోటల్స్ కు ఉత్తరం దక్షిణం సమానమైన
ఎత్తులో ఉండాలి. కొన్ని రకాలైన హోటల్స్ కు దక్షిణ దిశను ఉత్తర దిశ కన్నా కొద్దిగా పల్లంగా
ఉంచితే వ్యాపారం బాగా సాగుతుంది. దక్షిణం పల్లమైతే వ్యయం. కాబట్టి తినుబండారాలు అమ్మకం
జోరుగా సాగుతుంది. కాని యజమాని ఇంట్లో మాత్రం ఉత్తరమే పల్లంగా ఉంచాలి. దక్షిణ దిశను
మెరకలో ఉంచాలి. ఇటు వంటి వాస్తు నిర్ణయాలు తీసుకొనే సందర్బంలో సరియైన వాస్తు పండితుని
సలహా మరియు పర్యవేక్షణ అవసరం. కిరాణా దుకాణాలు,ఆర్ధికపరమైన సంస్థలను
దక్షిణ ముఖద్వారం తో నిర్మిస్తే మంచి ఫలితాలు
ఉంటాయి.దక్షిణ ఆగ్నేయంలో దర్వాజా ఉంచితే స్త్రీలకు సకాలంలో వివాహాలు అవుతాయి.పాడిపరిశ్రమలకు, పశువుల కొష్టాలకు తూర్పు కన్నా పడమరను పల్లంలో ఉంచాలి. అప్పుడే పశువృద్ది, పాలవృద్దిచక్కగా ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుంటుంది.
దీనిని బట్టి అర్థం అయ్యే దేమంటే అన్నీ దిశలను వాటి లక్షణాలను అనుసరించి మనం సరిగ్గా ఉపయోగించుకొంటే
మంచి ఫలితాలు వస్తాయి. దిక్పతుల బలాబలాలను సరిగ్గా అంచనా వేయడంలోనే నిజమైన ప్రతిభ దాగుంది.
ఇటు వంటి ప్రతిభ ఉన్నవారే నిజమైన వాస్తు పండితులు. వీరివల్ల ప్రజలకు సమాజానికి ఎంతో
మేలు జరుగుతుంది.
Sunday, 29 November 2015
వాస్తులో
ఎత్తుపల్లాల ప్రాముఖ్యత
సూర్యదేవర వేణుగోపాల్
ఎత్తుపల్లాలు వాస్తు నందు చాలా ముఖ్యమైనవి.
వాస్తు లో గల అన్ని నిర్మాణ నియమాలు ఎత్తుపల్లాల ప్రాతిపదికనే రూపొందించబడినవి..
యే ఏ దిశలందు మెరక ఉండాలి, యే ఏ దిశలందు పల్లం
ఉండాలన్న విషయాన్ని వాస్తుశాస్త్రం స్పష్టంగా తెలియచేసింది. గృహం
లో ఉండే వారి జీవితాలను ఈ ఎత్తుపల్లాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎత్తుపల్లాలను శాస్త్ర బద్ధం గా పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ నియమాలను పాటించని పక్షం లో తీవ్ర నష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి. అందువల్ల గృహ నిర్మాణ సమయంలో ఈ నియమాలను శాస్త్ర బద్ధంగా పాటించాలి.
స్థూలంగా చెప్పాలంటే దిక్కుల విషయంలో తూర్పు, ఉత్తర ,భాగాలు పల్లంగా ఉండాలి. దక్షిణ, పడమర దిశలందు మెరకగా ఉండాలి. ఈ నియమం భూమి, ఫ్లోరింగ్, శ్లాబ్,వసారా మొదలగు అన్ని నిర్మాణ విషయాలకు వర్తిస్తుంది.ఈ
నియమానికి విరుద్దంగా నిర్మాణాలు ఉంటే అందులో
నివసించేవారికి అనేక కష్టనష్టాలు వస్తాయి. ఈ ఎత్తుపల్లాల గురించి
లోతుగా అధ్యయనం చేద్దాం.
మెరక పల్లాల ప్రాతిపదిక పై మన మహర్షులు స్థలాలను 4 రకాలుగా వర్గీకరించారు.
అవి గజపృష్ట భూమి:
ధైత్య పృష్ట భూమి: నాగ పృష్ట భూమి: మరియు కూర్మ పృష్ట భూమి. భూమి యొక్క
ఎత్తుపల్లాలను బట్టి ఈ వర్గీకరణ జరిగింది. జాగ్రత్తగా పరిశీలిస్తే దిక్కులు, విదిక్కులందు ఎత్తుపల్లాలు యే విధం
గా ఉండాలో కూడ ఈ వర్గీకరణ లో తెలియచేయడం జరిగింది.
దక్షిణం, పడమర, నైరుతి, వాయవ్యం, దిశలు మెరక గాను మిగిలిన ఆగ్నేయ, ఈశాన్య, తూర్పు, ఉత్తర దిశలు పల్లం గాను ఉన్న భూమిని గజపృష్ట
భూమి అని అంటారు. స్టూలంగా చెప్పాలంటే ఉత్తరం కంటే దక్షిణం మరియు తూర్పు కన్నా పడమర
మెరకగా ఉన్న భూమే గజపృష్ట భూమి. ఈ భూమి అన్ని రకాలైన సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది.
ఇది నివాసానికి యోగ్యమైన భూమి.
గజపృష్టే భవేద్వాస సలక్ష్మి ధనపూరిత:
ఆయు:వృద్దికరీ
నిత్యం జాయతే నాత్ర సంశయ: “జ్యోతిర్నిబంధం”
పై శ్లోకం” జ్యోతిర్నిబంధం” అను ప్రాచీన వాస్తు గ్రంధం నుండి గ్రహించబడినది.
ఈ శ్లోకం ప్రకారం గజపృష్ట భూమి లో నివసించేవాళ్ళకు దీర్ఘ ఆయుషు, సంపద, నిత్యం పెరుగుతూ ఉంటుంది.గృహస్థు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాడు.
ధైత్య్హ్యపృష్ఠ
భూమి లో తూర్పు, ఆగ్నేయం, మరియు ఈశాన్యం మెరకగా
ఉంటాయి. మిగిలిన దిశలైన నైరుతి, పడమర, దక్షిణం
మరియు వాయవ్యం పల్లం గా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే తూర్పు భాగం మెరకగా ఉండి పడమర
భాగం పల్లంగా ఉన్న భూమి ధైత్యపృష్ట భూమి. ఈ భూమి అత్యంత వినాశకారి.
ధైత్యపృష్ఠే కృతేవాసే
లక్ష్మీర్ణయాతి మందిరం
ధనపుత్ర
పశూనాంచ హానిరేవ న సంశయ: “జ్యోతిర్నిబంధం.”
పై శ్లోకం ప్రకారం ఇందులో నివసించే వాళ్ళకు ధన నాశనం,పుత్ర పశు మరియు వంశ నాశనం జరుగవచ్చు.ఈ భూమి నివాసయోగ్యం కాదు.
ఉత్తర దక్షిణాలు మెరకగా ఉండి తూర్పు పడమరలు దీర్ఘంగా, పొడవుగా ఉన్న భూమి నాగపృష్ట భూమి.ఇది నివాసానికి
పనికిరాదు.
నాగపృష్టే యధావాసో మృత్యురేవ న సంశయ:
పత్నీహాని:
పుత్రహాని: శత్రువృద్ది: పదేపదే.
“జ్యోతిర్నిబంధం.”
మధ్య భాగం ఎత్తుగా ఉండి మిగిలిన
4 దిశలు పల్లంగా ఉన్న భూమిని కూర్మపృష్ట భూమి అని అంటారు.ఈ భూమి ఫలితాల పై కొన్ని ప్రాచీన గ్రంధాలు అనుకూలంగా తెలియజేస్తే
మరికొన్ని గ్రంధాలు ప్రతికూలంగా తెలియజేశాయి.
”ధనం ధాన్యం భవేత్తస్య నిశ్చ్హితం విపులం శుభం”. జ్యోతిర్నిబంధం
పై శ్లోకం ప్రకారం కూర్మపృష్ట
భూమి ధనధాన్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.అయితే”“విశ్వకర్మప్రకాశిక”
అను మరో ప్రాచీన వాస్తు గ్రంధం
“ కూర్మే ధన నాశనం “ అని తెలియజేసింది.ఇప్పటి పరిస్థితుల ప్రకారం పరిశీలిస్తే
ఈ భూమి అంతగా మంచి ఫలితాలు ఇవ్వడం లేదు అని చెప్పవచ్చును.
జ్యోతిర్నిబంధం, విశ్వకర్మ
ప్రకాశిక ఇంకా నారద సంహిత వంటి అనేక ప్రాచీన వాస్తు గ్రంధాలు అప్పటి పరిస్థితులను, అప్పటి అవసరాలను,కాలాన్ని బట్టి స్థల విభజన చేశాయి.
ఈ విభజన లో కొన్ని వాస్తు నియమాలు తెలియజేయబడినవి.. అయితే ఇప్పటి కాలంలో స్థలాలను వాస్తుకు
అనుగుణంగా సవరించి గృహాలను నిర్మించవచ్చు. యే విధమైన స్థలమునైనా వాస్తుకు అనుగుణంగా
సవరించి నిర్మాణాలు చేపట్టవచ్చు. వాస్తు లో ఎత్తుపల్లాలు సరియైన సమన్వయంతో ఉండాలి.
ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. నిర్మాణాలలో ఎత్తుపల్లాలు, వాస్తు కు అనుగుణంగా యే విధంగా ఉండాలో స్థూలంగా పరిశీలిద్దాం.
ఏ స్థలం లో నైనా లేదా నిర్మాణంలో నైనా తూర్పు, ఈశాన్య దిశలు పల్లంగా ఉండాలి. నైరుతి, దక్షిణం, పడమర మరియు ఆగ్నేయ దిశలు మెరకగా ఉండాలి. అంటే
నైరుతి, దక్షిణం, పడమర ,ఆగ్నేయ మరియు వాయవ్య దిశలు, తూర్పు, ఉత్తర,మరియు ఈశాన్య దిశలకన్నా మెరకగా ఉండాలి.ఈ విధమైన
అమరిక వాస్తు పుష్టిని కలిగించి గృహస్థు కు అనేక శుభాలను ప్రసాదిస్తుంది.ఈ సూత్రానికి
వ్యతిరేకంగా నిర్మాణాలు ఉంటే అనేక నష్టాలు వస్తాయి.. దిక్కులలో దక్షిణ, పడమర దిక్కులు తూర్పు, ఉత్తర దిశలకన్నా మెరకగా ఉండాలి.
అదేవిధంగా నైరుతి ఆగ్నేయం కన్నా మెరకగా ఉండాలి.వాయవ్యం ఆగ్నేయం కన్నా పల్లంగా ఉండాలి.
ఇంకా ఈశాన్యం వాయవ్యం కన్నా పల్లంగా ఉండాలి. అంటే అన్నిటికంటే నైరుతి మెరకగాను, ఈశాన్యం పల్లంగాను ఉండాలి.ఈ విధమైన కూర్పు అనేక సంపదలకు రహదారి కాగలదు. ఇటువంటి
గృహాలలో నివసించేవారికి అన్ని విషయాలలో అభివృద్ది, సంఘం లో పేరు
ప్రతిష్టలు ఉంటాయి.ఈ ఎత్తుపల్లల నియమాలను భూమి విషయం లో ఇంకా నిర్మాణ విషయాలైన Flooring, slabs, వసారాలు,ప్రహరీ మొదలగు
అన్నిటి యందు పాటించాలి.
గృహానికి వెలుపల ఉన్న ఎత్తుపల్లాలు కూడా ముఖ్యమైనవే. ఇవి కూడా చాలా
ప్రభావాన్ని చూపిస్తాయి. గృహం వెలుపల ఉన్న వాస్తు దోషాలను సవరించలేము. ప్రహరీ నిర్మిస్తే
వెలుపలి దోషాలు వాటి ప్రభావాలు తగ్గిపోతాయి.కనుక యే నిర్మాణాని కైనా ప్రహరీ చాలా ముఖ్యం.వివిధ
దిక్కులలో ఉన్న ఎత్తుపల్లాల వల్ల వివిధ రకాలైన ప్రభావాలు కలుగుతాయి. కొన్ని దిక్కులలో
ఉన్న మెరక వల్ల తీవ్ర నష్టాలు కలుగుతాయి. మరికొన్ని
దిక్కులలో ఉన్న పల్లం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతీ దిక్కుకు ఆ దిక్పతికి సంబందించిన
ఎత్తుపల్లాల నియమాలు ఉన్నాయి. ఈ నియమాలకు భంగం రాకుండా నిర్మాణం జరగాలి. దిక్కులకు
సంబందించిన నియమాలు యేమిటి వాటిని యే విధంగా
పాటించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ప్రధాన దిక్కులైన తూర్పు, ఉత్తరం, దక్షిణం మరియు పడమర, విదిక్కులైన నైరుతి,ఆగ్నేయం, వాయవ్యం మరియు ఈశాన్యం స్థానాలలో ఎత్తుపల్ల నియమాలు యే విధం గా ఉండాలో వాటి
ఫలితాలు యే విధం గా ఉంటాయో “అపరాజితపృచ్చ” అను ప్రాచీన వాస్తు గ్రంధం తెలియజేసింది.
వీటిని గురించి వివరంగా విడివిడిగా తెలుసుకుందాం.
తూర్పు:
తూర్పు ఎప్పుడు పల్లంగానే ఉండాలి. పడమర కంటే
తప్పని సరిగా పల్లంగా ఉండాలి. తూర్పు మెరకగా ఉంటే గృహం లో నివసించే మగవారికి అరిష్టం.
వారికి కలిసిరాదు. వారు యే వృత్తిలోను స్థిరపడలేరు. తూర్పు పల్లం గా ఉంటే వంశ వృద్ది, సంపద, ఆరోగ్య వృద్ది, ఉంటాయి.
మగసంతానం అభివృద్ది పధంలో ఉంటారు. రాజకీయ రంగంలో ఉండేవారికి తూర్పు తప్పనిసరిగా పల్లం
గా ఉంటారు.
పూర్వప్లవా ధరా శ్రేష్టా ఆయు: శ్రీ బలవర్ధినీ
సర్వసంపత్కరీ
పుంసాం ప్రాసాదానామ్ విభూతిధా
“అపరాజిత
పృచ్చ”
పై శ్లోకం ప్రకారం పల్లమైన
తూర్పు మంచి ఆయుర్దాయము, సిరిసంపదలు, రాజ్యపూజ్యతను కలుగజేస్తుంది. తూర్పున పల్లంగా ఉన్న దేవాలయము ప్రసిద్దిని
పొందుతుంది. కాబట్టి సుఖసంతోషాల కోసం తూర్పును పల్లంగా ఉంచాలి.
ఆగ్నేయం:
ఆగ్నేయం ఎత్తుగా ఉండాలి. నైరుతి కన్నా పల్లంగా, వాయవ్య, ఈశాన్యాల కన్నా మెరకగా ఉండాలి. ఆగ్నేయం, ఈశాన్యవాయవ్యాల కన్నా పల్లంగా ఉంటే, అగ్నిప్రమాదాలు, స్త్రీలకు అనారోగ్యం, బంధు మిత్రులతో సమస్యలు, ఆర్ధికసమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆగ్నేయం పల్లమైతే మధుమేహ సమస్య.
మూత్రపిండాల సమస్యలు, అజీర్ణ సమస్యలు ఆ స్థలంలో నివసించేవారికి
వచ్చే అవకాశం ఉంది.
ఆగ్నేయ ప్లవకా భూమి అగ్నిదాహ భయావహా
శత్రు
సంతాపదా నిత్యం కలి దోషోగ్ని ప్లవ: స్మృత:
“అపరాజిత
పృచ్చ”
ఆగ్నేయం పల్లంగా ఉన్న ప్రదేశం అగ్ని భయాన్ని, శత్రు సమస్యను.ఇంకా చెడ్డ పనుల పట్ల మనసును మళ్ళించడం వంటి ప్రతికూల ఫలితాలను
ఇస్తుంది. కనుక ఆగ్నేయం పల్లంగా ఉండకుండా ఉండవలసినంత ఎత్తు లో ఉండాలి.
దక్షిణం:
దక్షిణం తప్పనిసరిగా మెరకగా ఉండాలి. దక్షిణం మెరక ఉంటే, మంచి ఆరోగ్యం, ఆర్ధికాభివృద్ది ఉంటాయి. దక్షిణం పల్లమైతే, ప్రమాదాలు, ఆర్ధిక నష్టం, ఆరోగ్య
సమస్యలు, ప్రమాదాలలో అవయువ నష్టం వంటి సమస్యలు వస్తాయి. దక్షిణం
పల్లమైన దేవాలయం కూడా అభివృద్దికి నోచుకోదు.
నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన
హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:
“ అపరాజిత పృచ్చ”
ధన ఆరోగ్య హాని నిత్యం రోగభయం వంటి నష్టాలు దక్షిణం పల్లమైన భూమి
ప్రసాదిస్తుంది. ఇటువంటి స్థలంలో దేవుడు కూడా నశిస్తాడు అని పై శ్లోకం తెలుపుతోంది.
కనుక చక్కటి జీవితానికి దక్షిణాన్ని తప్పనిసరిగా మెరకగా ఉంచాలి.
నైరుతి:
ఇది అన్నింటికన్నా ప్రమాదకరమైనది. ఇది అన్నీ దిశల కన్నా తప్పనిసరిగా మెరకలో ఉండాలి.
నైరుతి పల్లమైన భూమిలో నివశిస్తే అనేక అరిష్టాలు కలుగుతాయి. యాక్సిడెంట్లు, ప్రవర్తనా దోషాలు, వృత్తి ఉద్యోగ సమస్యలు, ఆర్ధిక ఆరోగ్య నష్టం, గుండె సమస్యలు,శస్త్ర చికిత్సలు, సంతానం లేకపోవడం,వంశనాశనం, వంటి తీవ్ర సమస్యలు వస్తాయి. నైరుతి వాస్తు
దోషం గృహం లో నివసించే పెద్ద సంతానం, యజమాని, యజమానురాలిపై తీవ్రం గా పనిచేస్తుంది. నైరుతి అన్నీ దిశల కన్నా మెరకగా ఉంటే
సకల శుభాలు కలుగుతాయి.
ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
ధనహానిమ్
తధా నిత్యం కురుతే నైరుతి ప్లవా.
అపరాజితపృచ్చ.
నైరుతి పల్లం ధన హానికి అనారోగ్యానికి మృత్యువుకు హేతువు అవుతుంది.
ఆకస్మిక మరణాలకు ప్రమాదాలకు నైరుతి కారణం. కనుక ఈ దిక్కును తప్పనిసరిగా
మెరకగా ఉంచాలి.
పడమర:
ఈ దిశ మెరకగా ఉండాలి. తూర్పు కన్నా తప్పనిసరిగా మెరకగా ఉండాలి. పడమర పల్లమైతే మగవారికి
నష్టం. కలిసిరాదు. పుత్ర సంతానం ఉండకపోవచ్చు. పుత్ర సంతానం నష్టం కావచ్చు. కనుక పడమర
తప్పనిసరిగా మెరకగా ఉండాలి.
పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
శోకదాహ్యామ్
కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.
- అపరాజితపృచ్చ
పడమర పల్లం ధనధాన్యాలను నాశనం చేస్తుంది. శోకం,వంశనాశనం కలుగుతుంది. కనుక పడమర ఎత్తులో ఉండాలి. పడమర ఎత్తులో ఉంటే సకల సంపదలు
కలుగుతాయి. మగవారు ప్రయోజకులు గా ఉంటారు. సంఘం లో ప్రతిష్ట ఉంటుంది.
వాయవ్యం:
ఈ దిశ ఈశాన్యం కన్నా మెరకగాను, ఆగ్నేయం
కన్నా పల్లం గాను ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ అమరికకు వ్యతిరేకంగా ఉంటే, రోగ భయం, శత్రువృద్ది, స్త్రీసంతాన
సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, మానసిక ఆరోగ్య
సమస్యలు,వెన్నుపూస సమస్యలు, టాన్సిల్స్
వంటి ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్దిక నష్టాలు, ఐపి దాఖలు చేయడం వంటివి ఉంటాయి.ఆడ పిల్లలకు వివాహాలు సకాలం లో కావు, ఆడపిల్లల వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి.
శతృకర్త్రీ విరాగీ చ గోత్ర క్షయకరీ తధా
గృహే
చ కన్యకానాం హంత్రీ సదా దు:ఖ భయవహా.
అపరాజితపృచ్చ
కనుక వాయవ్యం తప్పనిసరిగా ఈశాన్యం కన్నా మెరకగా ఆగ్నేయం,నైరుతి కన్నా పల్లం గా ఉండాలి.
ఈ విధమైన అమరిక వలన సకల పీడలు నశిస్తాయి.
ఉత్తరం: సకల
ఆర్ధిక శుభాలకు ఈ దిక్కే కారణం. ఇది కుబేర స్థానం. ఈ దిశ ఎప్పుడు పల్లంగా ఉండాలి. ఉత్తరమ్
నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఆన్ని దిశల కన్నా పల్లంగా ఉంటే సిరిసంపదలు అనాయాసంగా ఒనగూడతాయి.పాండిత్య.శాస్త్ర
విజ్ఞానం గృహస్తుకు కలుగుతుంది. ఇహ లోకంలో సుఖాలను పొందాలనుకుంటే ఈ దిశ తప్పనిసరిగా
పల్లం గా ఉండాలి.
పూజ్యా లాభకరీ నిత్యం పుత్ర పౌత్ర వివర్ధినీ
కామదా
భోగదా చైవ ధనదాచోత్తర ప్లవా --- అపరాజితపృచ్చ
అన్నివిధాలైన ఇహలోక లాభాలకు,వంశవృద్దికి, ఇష్టకామ్య సిద్దికి అన్నీ భోగాలకు ఉత్తరం
పల్లం గా ఉంచాలి. ఈ దిశ మెరక ఉంటే ధన నష్టం వ్యాపార విద్యా నష్టం, స్త్రీలకు వివాహం ఆలస్యం కావడం వంటి నష్టాలు కలుగుతాయి.. ఉత్తరమ్ మెరకగా ఉంటే
ఆర్ధికాభివృద్దికి తీవ్ర ప్రతిబంధకం. కనుక సత్వర అభివృద్దికి ఉత్తరం పల్లంగా ఉండాలి.
ఈశాన్యం:
ఇది అన్నీ దిశల కన్నా పల్లంగా తేలికగా ఉండాలి. ఈశాన్య పల్లం సకల సంపదలకు నిలయం. వంశవృద్దికి,ధనవృద్దికి విద్యావృద్దికి ఈ దిశే
కారణం. ఈశాన్యం పల్లంగా ఉంటే మగ పిల్లలు చక్కగా వృద్దిలోనికి వస్తారు. మగవారు తమ భాద్యతల పట్ల అంకిత భావం తో ఉంటారు.
వరసౌఖ్య సతీ సత్య సౌభాగ్యాది వివర్ధిని.
ధనా:ఐశ్వర్య సంపన్న ధర్మ ఈశానక
ప్లవా
అపరాజితపృచ్చ
పై శ్లోకం
ప్రకారం ఈశాన్యం పల్లంగా ఉంటే సర్వతోముఖాభివృద్ది ఉంటుంది. మానవుడు సకల సౌఖ్యాలను పొందుతాడు.
ఈశాన్యం మెరక ఉంటే తీవ్ర ఆర్ధిక సమస్యలు ఉంటాయి. యే రంగం లో ను కలసి రాదు. మగవారు అంతగా
ప్రయోజకులు కాలేరు. కాన్సర్ వంటి రోగాలు వస్తాయి. కనుక మంచి జీవితానికి ఈశాన్యం పల్లం
గా ఉండాలి.
పై విధమైన నియమాలను దృష్టి లోఉంచుకొని గృహ నిర్మాణాన్ని చేయాలి.
ఆయా దిక్కులు వాటి ఎత్తుపల్లా ల నియమాలను దృష్టిలో ఉంచుకొని వాటిని పరస్పరం సమన్వయం
చేసి గృహ నిర్మాణమ్ చేయాలి.ఈ నియమాలను
అన్నీ నిర్మాణ విషయాలలో అంటే శ్లాబ్,ఫ్లోరింగ్, ప్రహరీ ఇంకా వసారాలు వంటి అన్నీ నిర్మాణాలలో పాటించాలి. ఈ విధం గా పాటిస్తే ఎంతో మేలు జరుగుతుంది.
ఈ సూత్రాలను ఉల్లంఘిస్తే తిప్పలు తప్పవు. అందుకని వీటిని సమతౌల్యం చేసి అన్నీ నిర్మాణాలలో
పాటించాలి. అప్పుడే సంపదతో పాటు సర్వతోముఖాభివృద్ది కలుగుతుంది.
సకల శుభాలను యే విధంగా పొందవచ్చో ఈ క్రింది శ్లోకం తెలుపుతుంది
గమనించండి.
అత్యంత వృద్దిదమ్ నృణా ఈశాన ప్రాగుదక్ ప్లవమ్
అన్య
దిక్షు ప్లవమ్ తేషాం శశ్వదత్యంత హానిదమ్.
నారద
సంహిత.
ఈశాన్యం, తూర్పుమరియు
ఉత్తరం పల్లంగా ఉంటే అత్యంత శుభం కలుగుతుంది. మిగిలిన దిక్కులు పల్లమైతే విపరీత మైన
హాని కలుగు తుంది అని పై శ్లోకం తెలుపుతుంది.
కనుక ఎత్తుపల్లాల నియమాలను నిర్లక్ష్యం చేయకుండా వీటిని చక్కగా
పాటించితే సకల విధమైన అభివృద్ది తప్పక కలుగుతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే విపరీతమైన
నష్టం అన్నీ విషయాలలో కలుగుతుంది. ఈ నిజాన్నిగమనించి
పాటించుట మంచిది.
సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
వాస్తువిజ్ఞానం-1
వాస్తు మూఢ నమ్మకం కాదు
సూర్యదేవర
వేణుగోపాల్ M.A(జ్యోతీష్యము)
వాస్తు మూఢ
విశ్వాసం కాదు. వాస్తు నియమాలలో శాస్త్రీయత ఉంది. ప్రకృతితో
మనిషి జీవితాన్ని వాస్తు సమతౌల్యం చేస్తుంది. వాస్తును పాటించడం
వల్ల మానవ జీవితం ఆరోగ్యకరంగా,మంగళప్రదంగా సాగుతుంది.
"వసనివాసే' అనే ధాతువు వాస్తు అనే పదానికి
మూలము." వసత్" అనే పదము నుండి
వాస్తు అనే మాట జన్మించింది. నివశించడానికి యోగ్యమైన స్థలాన్ని
"వసత్" అని అంటారు. భూమికి వాస్తువు అనే పేరు ఉంది.
భూమిపై నిర్మిస్తున్నాం కాబట్టి వాస్తు అయిందని "మయమతం"అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలియజేస్తుంది. ఈ వాస్తు
భూమిపై నిర్మించే అన్ని నిర్మాణాలకు అంటే, గృహాలు,ఆలయాలు, రాజప్రాసాదాలు, పట్టణాలు, మరియు తటాకాలు వంటి అన్నింటికీ వర్తిస్తుంది.
మానవ సర్వతోముఖ అభివృద్దికి యే నిర్మాణ నియమాలు అమలు చేయాలి, అదే విధంగా ప్రకృతి నుండి మంచి ఆరోగ్యాన్నియేలా పొందాలి అనే విషయాలను వాస్తుశాస్త్రం
తెలియ జేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, అనేక
లాభాలను ప్రకృతి నుండి పొందడానికి యే విధమైన నియమాలను పాటించాలో వాస్తుశాస్త్రం తెలుపుతుంది.
వాస్తు వేదం
నుండి ఉధ్భవించింది. వేదాంగాలలో ఒకటైన జ్యోతిష్యం నుండి వాస్తు జన్మించింది.
వాస్తుశాస్త్రం ను 18 మంది మహర్షులు అందించినట్లుగా మత్స్త్యపురాణం తెలియజేస్తుంది.
ఈ శ్లోకాన్ని గమనించండి.
“భృగు
అత్రి వశిష్ట శ్చ్హ విశ్వకర్మా మయ స్తధా
నారదో నిగ్నాజీశ్చైవ విశాలాక్ష: పురందర:
బ్రహ్మకుమారో
నందీశ సౌనాకో గర్గ ఏవచ
వాసుదేవో
నిరుదశ్చ్హ తధా శుక్రో బృహస్పతి:
ఆష్ట
దశైతే విఖ్యాత వాస్తు శాస్త్రపదేశకా;”
-------- "మత్స్థ్యపురాణం"
వాస్తు నవీనమైనది
కాదు. పై శ్లోకం ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.వాస్తు, వేదాంగమైన
జ్యోతిష్యం లోని సంహిత విభాగానికి చెందుతుంది. సమరాంగణ సూత్రధారము, మయమతము, విశ్వకర్మప్రకాశిక, వసిష్ట
సంహిత, నారదసంహిత,,పద్మపురాణం, అపరాజిత పృచ్చ,మొదలైన గ్రంధాలలో వాస్తు ఉదహరింపబడినది. మహాభారతములో మయసభ వర్ణనలో ఇంకా రామాయణం లో లంకా పట్టణ వర్ణనలో వాస్తు అంశాలు ఇమిడిఉన్నాయి..
సింధులోయ నాగరికత లో పట్టణాలు, గృహనిర్మాణాలు వాస్తు సూత్రాలకు
అనుగుణంగా ఉన్నాయని పండితుల విశ్వాసం. ఈ అంశాలను పరిశీలిస్తే వాస్తు అత్యంత ప్రాచీనమైన
శాస్త్రం అని తెలుస్తుంది.
ప్రకృతి పరిస్థితులకు
అనుగుణంగా వాస్తు రూపొందించబడింది. మనదేశం లో ఉన్న వాతావరణాన్ని దృష్టిలోఉంచుకొని మన మహర్షులు వాస్తును మనకు అందించారు. ఇది మూఢనమ్మకం
కాదు. ఇందులో ఎంతో విజ్ఞానం ఇమిడిఉంది. మనదేశం భూమిపై తూర్పు భాగంలో ఉంది. దక్షిణ,నైరుతి,పడమర గుండా ప్రపంచ గాలులు మనదేశానికి వీస్తాయి. ఈ దక్షిణ, నైరుతి ,పడమర గాలులు తూర్పు, ఉత్తర, మరియు ఈశాన్యం వైపుకు వీస్తాయి. ఈ
గాలి వీచే అంశాన్ని దృష్టి లో ఉంచుకొని ముఖ్యమైన కొన్ని వాస్తు విషయాలు రూపొందించబడ్డాయి.
నీరు ఉండవలసిన స్థానాలు, వాస్తులోని ఎత్తుపల్లాల నియమాలు ఈ గాలి
వీచే పద్దతి పైనే సూచించబడ్డాయి.. నీరు ఈశాన్యం,తూర్పు మరియు
ఉత్తరం దిశలలో ఉండాలని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే మనం బావులు, బోర్లు నీటి ట్యాంకులు అన్నీ ఈ దిశలందే ఉంచుతున్నాము. ఈ నీటిని దక్షిణ, పడమర మరియు నైరుతి ప్రాంతాలందు ఉంచితే తీవ్ర నష్టాలు వస్తాయని వాస్తు తెలుపుతుంది.
ఈ నియమమం లో అంతర్లీనంగా వైజ్ఞానిక అంశం ఇమిడిఉంది. మనదేశంలో గాలి దక్షిణం,నైరుతి,పడమర నుండి తూర్పు, ఉత్తర, ఈశాన్యం వైపుకు వీస్తుంది..నిల్వ ఉన్న నీరు సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుంది.
నీరు గృహానికి దక్షిణ,నైరుతి, పడమర దిశలల్లో
ఉంటే ఈ నీటి పై నుండి గాలి వీస్తుంది. అప్పుడు ఈ గాలితో పాటు నిల్వ నీటి పై ఉండే సూక్ష్మజీవులు
తూర్పు ఉత్తరంగా ప్రయాణించి ఇంట్లోకి చేరతాయి. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు గృహంలో
ఉండేవారికి కలుగుతాయి.తద్వారా కుటుంబం రోగగ్రస్తం
అవుతుంది. అందుకే ఈ దిశలందు నీటిని ఉంచకుండా తూర్పు,ఉత్తర, ఈశాన్యాలలో ఉంచమని వాస్తు చెపుతుంది. ఈ దిశలందు నీటిని ఉంచినట్లైతే విషక్రిములు
ఇంట్లోకి రాకుండా బయటకు పోతాయి. అందుకే ఇంటికి దూరంగా ఈ దిశలందు నీటిని ఉంచాలి. నిల్వ
నీటిపై నుండి గాలి గృహం వెలుపలికి పోయే విధంగా వాస్తు సూత్రాలను రూపొందించారు. నీరు
తూర్పు,ఉత్తర,ఈశాన్యమూలందు ఉంటే ఇంట్లో
ఉండేవారికి నష్టం రాదు. ఎందుకంటే వీచే గాలి నిల్వ నీటి పై నుండి ఇంటి వెలుపలికి వెళ్లిపోగలదు.
వాస్తుప్రకారం
దక్షిణం.పడమర దిశలు, తూర్పు,ఉత్తర దిశలకన్నా
ఎత్తులోఉండాలి. . అన్ని రకాల నిర్మాణాలలో తూర్పు,ఉత్తరం దిశలను
పల్లంగా ఉంచాలని వాస్తు తెలుపుతుంది. దీనిలో కూడా శాస్రీయత ఉంది. పడమర. దక్షిణ దిశలలో
నీరు ఉంటే ఆరోగ్యానికి చేటు. ఇక్కడ వర్షపు నీరు ,వాడుక నీరు నిల్వ
ఉండకుండా తూర్పు,ఉత్తర దిశలను పల్లంగా ఉంచాలని వాస్తు తెలుపుతుంది.
దక్షిణం,పడమర లను తూర్పు,ఉత్తరాలకన్నా మెరకలొ
ఉంచితే ఉపయోగించిన నీరు, వర్షపునీరు దక్షిణ పడమరలలో ఉండకుండా
తూర్పు,ఉత్తరాలవైపు వెళతాయి.అక్కడి నుండి గృహం వెలుపలకు పంపితే
ఎటువంటి నష్టం ఉండదు. అందుకనే ఇంట్లోని వాడుక నీటిని తూర్పు,ఉత్తర, ఈశాన్యాల గుండా వెలుపలికి పంపమని వాస్తు నిర్దేశిస్తుంది.దక్షిణ,నైరుతి,పడమర దిశలలో నీరు నిలవ ఉండకుండా చేసేందుకు మహర్షులు
ఈ నియమాన్ని ఏర్పరిచారు. పూర్వకాలం లో డ్రైనేజ్ వ్యవస్థ అంతగా ఉండేది కాదు.
దక్షిణం, పడమర
మరియు నైరుతి నుండి వచ్చే గాలి ఎటువంటి ఆటంకం లేకుండా తూర్పు ఉత్తరాలకు వెళ్ళాలి. లేకపోతే
నిర్మాణాలకు నష్టం ఏర్పడుతుంది. ఈ సూత్రం ప్రాతిపదికపై దక్షిణం,పడమరల ప్రహరీలకన్నా తూర్పు, ఉత్తరాల వైపు తక్కువ ఎత్తులో
ప్రహరీలని నిర్మించాలన్న వాస్తు నియమము వచ్చింది.. అదే విధంగా తూర్పు ఉత్తరం వైపు ఎక్కువ
కిటికీలను, దర్వాజాలను ఉంచాలని వాస్తు తెలుపుతుంది.గాలి సులభంగా
ప్రవహించడానికే వేసే వసారాలు తూర్పు, ఉత్తరం వాటంగా ఉండాలని వాస్తు తెలియజేస్తుంది. ఇంకా తూర్పు ఉత్తరాలలో ఎత్తైన
చెట్లు గాని నిర్మాణాలు గాని ఉంటే వీచే గాలి నిరోధింపబడుతుంది. దీనివల్ల అనేక నష్టాలు
గృహస్తుకు, నిర్మాణాలకు కలుగుతుంది. అందువల్ల ఈ దిశలందు ఎత్తైన
చెట్లు, నిర్మాణాలు ఉండరాదని వాస్తు ఆదేశిస్తుంది. ఈ వాస్తు నియమాలన్నీ
మనిషికి ఆరోగ్యాన్ని కలిగించేవే. ప్రకృతిని పూర్తిగా అర్ధం చేసుకొని దాని గమనం మానవ
శ్రేయస్సుకు ఉపయోగపడే విధం గా వాస్తు నియమాలు రూపొందింపబడినాయి.
భూమిపై నుండే
ప్రతి వస్తువు ఉత్తర ధ్రువం వైపు ఆకర్షింపబడుతుంది. మానవులపై కూడా ఈ ఆకర్షణాప్రభావం
ఉంటుంది. అయస్కాంత తరంగాలు ఎల్లప్పుడు దక్షిణం
నుండి ఉత్తరం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి.ఉత్తర ధ్రువం ఆకర్షణ ప్రతి వస్తువు
పై ఉంటుంది. ఈ అయస్కాంత తరంగాలకు మనిషి మెదడు ప్రభావితం కాకూడదని ఉత్తరం వైపు శిరసునుంచి
నిద్రపోకూడదని వాస్తు తెలుపుతుంది. ఉత్తరం వైపు తల పెట్టరాదని వాస్తు నిర్దేశిస్తుంది.
ఉత్తరం వైపు తలనుంచి నిద్రిస్తే అయస్కాంత తరంగాల ప్రభావం మనిషి మెదడు పై పడి అనేక ఆరోగ్య
సమస్యలు వస్తాయి. శిరోసంబంధమైన సమస్యలు,నిద్ర లోపించడం,టెన్షన్, మొదలగు సమస్యలు వస్తాయి. అందువల్ల ఉత్తరం వైపు తలనుంచి నిద్రపోకూడదని వాస్తు తెలుపుతుంది.
ఈ విధంగా ఇంకా
ఎన్నో నియమాలు వాస్తు లో రూపొందించబడినవి. ఈ నియమాలలో ఉన్న ఆంతరార్ధాన్ని శోధిస్తే
ఎన్నోవిజ్ఞాన విషయాలు తెలుస్తాయి.వాస్తు మూఢవిశ్వాసం కాదు అని అర్ధం అవుతుంది. మన ప్రాచీన
వాస్తు గ్రంధాలు అప్పటి జీవన విధానానికి అనుగుణంగా ఉన్నాయి. ఇప్పటి వాస్తుకు కొన్నిపురాతన నియమాలకు భేదముంది. అయినప్పటికి మౌలిక
సూత్రాలు ఒకటే. ఇప్పుడు అనుసరిస్తున్న వాస్తు నవీన కాలానికి అనుగుణంగా ఉంది. ఇవన్నీ
శోధించి తెలుసుకొన్నవే. పాతవాటితో ఇప్పటి కొన్ని
సూత్రాలు విభేదించినప్పటికి వాస్తు మౌలికతకు నష్టం కలుగ కుండా ప్రజలకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి.
వాస్తు కొన్ని సందర్భాలలో మానవ మేధస్సు అందని ఫలితాలు ఇస్తుంది. వీటి పై ఇంకా పరిశోధన
చేయవలసింది ఉంది. ఏదిఏమైనా వాస్తు మూఢనమ్మకం కాదు. వాస్తు లోని అంతరార్ధాన్ని గ్రహించి
ఈ నియమాలను అనుసరిస్తే మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. గుప్తంగా చెప్పబడిన సత్యాన్ని
గ్రహించకుండా వాస్తును విస్మరిస్తే తీవ్ర నష్టాలు కలుగుతాయి. ఇది సత్యం.
Friday, 27 November 2015
Friday, 20 November 2015
Friday, 13 November 2015
Subscribe to:
Posts (Atom)