వాస్తు విజ్ఞానం 6&7
బావి ఈశాన్యంలో, ఉపగృహం నైరుతిలో ఎందుకుండాలి?
సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
దిక్కులను యే విధంగా ఉపయోగించుకోవాలో మనం పరిశీలిద్దాం. అన్ని దిక్కులు ఉపయోగకరమైనవే. ఏ దిక్కుకు ఉండే లాభ నష్టాలు
ఆ దిక్కుకు ఉంటాయి. మానవ మనుగడకు దిక్కులను సమతౌల్యం చేసి వినియోగించుకోవాలి. సుఖ శాంతులను ప్రసాదించే దిక్కుల బలాన్ని పెంచి, నష్టాలను
ఇచ్చే దిక్కుల బలాన్ని తగ్గించడం ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు అనే విషయాన్ని మనం
గత అధ్యాయాలలో తెలుసుకొన్నాం. దిక్పతుల బలం, నవగ్రహ బలం మనపై
ఉంటుంది. దిక్పతుల, నవగ్రహాల లక్షణాలను అనుసరించి దిక్కుల బలాబలాలను
సమతౌల్యం చేయాలి..దిక్పతుల బలాన్ని యే విధంగా పెంచాలి లేదా తగ్గించాలి
అన్నది వాస్తులో చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిజ్ఞానం తప్పనిసరిగా వాస్తు పండితునికి ఉండాలి.
ముందుగా దిక్పతి బలాన్ని యే విధంగా పెంచాలో తెలుసుకొందాం. మనకు యే దిక్పతి బలం అవసరమో
ఆ దిక్కును బాగా పల్లం చేయాలి. అదే విధంగా విశాలంగా బరువులు వేయకుండా ఉంచాలి. అప్పుడే
ఆ దిక్పతి బలం పెరిగి అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అదేవిధంగా ఏ దిక్పతి బలం మనకు
నష్టం కలిగిస్తుందో లేదా ఏ దిక్పతి బలహీనంగా ఉంటే లాభిస్తుందో, ఆ దిక్కును బాగా మెరకలో అంటే ఎత్తులో ఉంచి బరువులను వేయాలి. అదే విధంగా ఆ
దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలాలి. అప్పుడే ఆ దిక్కు బలం తగ్గి మంచి లాభాలను కలిగిస్తుంది.
స్థూలంగా చెప్పాలంటే పల్లమైన దిశ అధిబలం కలిగి ఉంటుంది. మెరకలో ఉన్న దిశ బలహీన
మౌతుంది.
తూర్పు, ఉత్తరం మరియు
ఈశాన్య దిక్కులు శుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. అదే
విధంగా దక్షిణ, పశ్చిమ,నైరుతి,వాయవ్య మరియు ఆగ్నేయ దిశలు అశుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో
ఉంటున్నాయి. సుఖప్రదమైన జీవితానికి శుభాలను ప్రసాదించే తూర్పు,ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి. అదేవిధంగా అశుభాలను ప్రసాదించే దక్షిణ,పశ్చిమ ,నైరుతి మొదలగు దిశల బలం తగ్గాలి. అప్పుడే దిక్కుల
మధ్య సమతౌల్య స్థితి ఉండి మనిషి మనుగడ సుఖప్రదంగా సాగుతుంది. మంచి జీవితం కోసం శుభాలను
కలిగించే తూర్పు ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి కాబట్టి ఈ దిక్కులను పల్లంగాఉంచి
బరువులు వేయకుండా విశాలంగా ఎక్కువ ఖాళీగా ఉంచాలని వాస్తు ఆదేశిస్తుంది. అదేవిధంగా మిగిలిన
దిక్కులు కష్టాలను నష్టాలను ఇస్తాయి కాబట్టి ఈ దిక్కుల బలం తగ్గాలి కనుక తక్కువ ఖాళీ
స్థలం వదలి బరువులు పెట్టి మెరకలో ఉంచాలని
వాస్తు తెలుపుతుంది. ఈ విధంగా చేస్తే మనిషి జీవితం సుఖప్రదంగా ఉంటుంది.
పై
సూత్రం ప్రాతిపదిక పైనే మనం ఈశాన్యం లో జలాశయాలు, బోర్
వెల్స్ మరియు బావులను త్రవ్వుతున్నాము. బావి, బోర్లు ఈశాన్యంలో
ఉండుటవలన అవి బాగా పల్లంగా లోతుగా ఉండటం వల్ల ఈశాన్యం బలం పెరిగి తద్వారా మంచి ఫలితాలు
కలుగుతాయి. అదే విధంగా తూర్పు ఉత్తరంలలో ఉన్నప్పటికి ఈ దిక్కుల బలం పెరిగి సుఖశాంతులు
కలుగుతాయి. ఈ దిక్కుల బలం మానవ మనుగడకు తప్పనిసరిగా అవసరం కాబట్టి ఈ దిక్కులందే బావులను, జలాశయాలను ఉంచాలని వాస్తు చెపుతుంది. అంతేకాని గ్రుడ్డిగా కారణం లేకుండా వాస్తు
చెప్పలేదు. ఈ దిక్కులందు బాగా పల్లం ఉంటే గృహస్తుకు అన్ని విషయాలలో యోగిస్తుంది. అన్నివిధాల
అభివృద్ది ఉంటుంది. ఈ క్రింది శ్లోకం గమనించండి......
పూర్వప్లవా ధరా శ్రేష్టా ఆయు: శ్రీ బలవర్ధినీ
సర్వసంపత్కరీ పుంసాం ప్రాసాదానామ్ విభూతిధా
పూజ్యా లాభకరీ నిత్యం పుత్ర పౌత్ర వివర్ధినీ
కామదా భోగదా చైవ ధనదాచోత్తర ప్లవా ---
వరసౌఖ్య సతీ సత్య సౌభాగ్యాది వివర్ధిని.
ధనా:ఐశ్వర్య సంపన్న ధర్మ ఈశానక ప్లవా----" అపరాజితపృచ్చ"
పై శ్లోకం "అపరాజితపృచ్చ"
అనే ప్రాచీన వాస్తు గ్రంధం లోనిది. తూర్పు పల్లంగా ఉంటే ఆయుషు, ధనం తో పాటు
అన్ని శుభాలు కలుగుతాయి, ఉత్తరం పల్లంగా ఉంటే ధనధాన్య వృద్ది
ఇంకా వంశ వృద్ది ఉంటుంది. అదేవిధంగా ఈశాన్యం పల్లంగా ఉంటే సతీ సౌఖ్యం, ధనం, ఐశ్వర్యం సమకూరగలవు అని పై శ్లోకం చెపుతుంది. కనుక
సకల శుభాలను కలిగించే ఈ దిక్కులను కావలసినంత మేరకు విశాలంగా పల్లంగా ఉంచితే, ఈ దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న దిక్పతుల, గ్రహాల ఆశీర్వాదం వల్ల మానవ మనుగడ సుఖప్రదం అవుతుంది.
కనుక అత్యంత పల్లం కలిగిన బోర్లు, నూతులు ఇంకా జలాశయాలు ఈ దిక్కులలోనే
ఉంచాలి.అప్పుడే ఈ దిక్కులు శక్తివంతంగా మారి శుభాలను ప్రసాదిస్తాయి కాబట్టే మన ప్రాచీన
వాస్తు గ్రంధాలు ఈ దిక్కులను పల్లంగా ఉంచాలని చెపుతున్నాయి. ఈ దిశలందు పల్లం ఉంటే ఎటువంటి
మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని అనుభవంద్వారా కనుగొని మన మహర్షులు తెలియ జేశారు.
అశుభాలను ప్రసాదించే దిక్కుల
బలాన్ని సుఖప్రదమైన జీవితం కోసం తగ్గించాలి. కనుక ఈ దిక్కులను మెరక చేసి, బరువులను ఉంచి
తక్కువ ఖాళీ స్థలం వదలాలి. దక్షిణ,పశ్చిమ,నైరుతి, ఆగ్నేయ,మరియు వాయవ్య దిశలను
మెరక చేసి బరువులను ఉంచడం ద్వారా ఈ దిక్పతులను, గ్రహాలను బలహీనం
చేయాలి. అప్పుడే సమస్యలు తగ్గిపోగలవు. ఈ దిశలు పల్లం అయితే ఈ దిక్పతుల బలం పెరిగి తీవ్ర
నష్టాలు వస్తాయి. మన ప్రాచీన వాస్తు గ్రంధాలు ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. ఈ దిక్పతులను
పల్లం చేయడం ద్వారా ఈ దిక్కుల బలాన్ని పెంచితే ఎటువంటి దుష్ట ఫలితాలు కలుగుతాయో
" అపరాజితపృచ్చ" అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలిపింది. ఈ శ్లోకం గమనించండి.....
నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన
హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:
ప్రవర్తయే
గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
ధనహానిమ్
తధా నిత్యం కురుతే నైరుతి ప్లవా.
పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
శోకదాహ్యామ్
కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.
ఆగ్నేయ
ప్లవకా భూమి అగ్నిదాహ భయావహా
శత్రు
సంతాపదా నిత్యం కలి దోషోగ్ని ప్లవ: స్మృత:
శతృకర్త్రీ విరాగీ చ గోత్ర క్షయకరీ
తధా
గృహే
చ కన్యకానాం హంత్రీ సదా దు:ఖ భయవహా.
అపరాజితపృచ్చ
పై శ్లోకం ప్రకారం దక్షిణం పల్లమైతే ధననష్టం, రోగభయం. ఇటువంటి స్థలంలో దేవుడు కూడా రాణించడు.
నైరుతి పల్లం అయితే సదా రోగ భయం, ప్రవర్తన దోషాలు, ధన హాని ఇంకా మృత్యు భయం. పడమర పల్లం ధన ధాన్యాలను నాశనం చేస్తుంది. ఇంకా
ఆగ్నేయ పల్లం వలన అగ్నిభయం, శత్రువృద్ది ఉంటుంది. వాయవ్య పల్లం
స్త్రీలకు నష్టం కలిగిస్తుంది. ఇంకా సదా దుఖాన్ని కలిగిస్తుంది. పై శ్లోకం అర్ధం ఇదే. ఈ దిశలందు పల్లం అయితే ఈ దిక్కుల బలం పెరిగి మానవునికి
తీవ్ర నష్టాలు వస్తాయి. కనుక వీటిని మెరకలో ఉంచి తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లుగా చేసి
బరువులు వేయడం ద్వారా వీటి బలాన్ని తగ్గిస్తే మనిషి జీవితం బాగుంటుంది. అత్యంత పల్లం
ఉండే బావులు, బోర్లు, జలాశయాలు ఈ దిక్కులలో
ఉంచితే వీటి బలం విపరీతంగా పెరిగి తీవ్ర నష్టాలు వస్తాయి. అందువల్లే ఈ దిక్కులందు నూతులు, బోర్లు, జలాశయాలు ఉండరాదని వాస్తు తెలియజేస్తుంది.ఈ
దిక్కుయందు ఉపగృహాలు నిర్మిస్తే ఈ దిక్కుల బలం తగ్గి సమస్యలు తగ్గుతాయి. అయితే బావులు
పడమర వాయవ్యంలో ఉండటం పాత ఇండ్లలో మనం నేటికీ చూస్తాము. ఈ దిక్కు చంద్రుని ఆధిపత్యంలో
ఉంటుంది కాబట్టి బావులు ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికి
ఈ దిక్కు లో బావులు ఉండుట వలన ఆర్ధిక అభివృద్ది లోపిస్తుంది. స్త్రీలకు ఇంకా పురుషలకు
కూడా ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు. ఈ దిశ పల్లం అయితే వాయు మరియు చంద్రుని బలం పెరిగుతుంది.
ఈ బలం వ్యవసాయానికి మరియు పశువుల అభివృద్దికి తోడ్పడుతుంది. పూర్వకాలంలో మానవుని ప్రధానమైన
ఆర్ధిక వనరు ఇవే కాబట్టి వారికి లాభించి ఉండవచ్చు. అయితే నేటి కాలంలో ఇది లాభించదు.
కాబట్టి ఇక్కడ బావులు ఉండకూడదు. కనుక నష్టాలను లేదా అశుభాలను కలిగించే దిక్కులను బలహీనపర్చుట
ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు. ఈ దిక్కులు కూడా మంచివే. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో వీటి బలం కూడా మనిషికి అవసరం అవుతుంది. కనుక వీటిని జాగ్రత్తగా
కావలసినంత మేరకే వినియోగించుకొంటే సర్వోతోముఖాభివృద్ది ప్రాప్తిస్తుంది.
మానవుని సుఖజీవితం కోసం శుభాలను కలిగించే తూర్పు, ఉత్తర,ఈశాన్య దిక్కులకు బలం
పెంచడానికే అత్యంత లోతుగా, పల్లంగా ఉండే నూతులు, బోర్లు, జలాశయాలు ఈ దిక్కులందు ఉండాలని వాస్తు ఆదేశిస్తుంది.
అశుభాలను, నష్టాలను కలిగించే దక్షిణ,పశ్చిమ, నైరుతి,ఆగ్నేయ మరియు వాయవ్య దిశల బలం తగ్గించడం కోసం
ఈ దిక్కులందు బావులను బోర్లను ఉంచకుండా, మెరకజేసి బరువులను ఇంకా
ఉపగృహాలను నిర్మించమని వాస్తు తెలియజేస్తుంది. ప్రకృతి నుండి లాభాలను పొందడానికే వాస్తు
ఈ విధమైన సూత్రాలను అందించింది. అంతే కాని వాస్తు సూత్రాలు మూఢంగా కారణం లేకుండా రూపొందించబడినవి
కావు. ఇందులో ఎంతో విజ్ఞానం ఇమిడివుంది. ఈ సూత్రాలన్నీ మానవ శ్రేయస్సుకోసం ఉద్దేశింపబడినవే.
సూర్యదేవర వేణుగోపాల్
సూర్యదేవర వేణుగోపాల్.
M.A(జ్యోతీష్యం), H.NO-1-879, సుందరయ్య నగర్
మధిర, ఖమ్మం జిల్లా తెలంగాణ