Wednesday, 24 July 2019


దక్షిణం అంటే భయం ఎందుకు?

 ఈ రోజుల్లో దక్షిణం దిశ మీద చాలా అపోహలు ప్రజలలో ఉన్నాయి. ఇప్పటి వాస్తు పండితులు కూడా దక్షిణ దిశ పై లేనిపోని భయాలను, అపోహలను పెంచుతున్నారు. వాస్తవం ఏమిటంటే వాస్తు లో అన్ని దిశలకు దేనికుండే లాభ నష్టాలు వాటికున్నాయి.. అయితే  పరిస్థితులకు అనుగుణంగా దిశలను సరిచేసి కట్టడాలను నిర్మించాలి. దిక్కుల యొక్క లక్షణాలు వాటి పరిమితులను తెలుసుకొని వాస్తు సూత్రాలను పాటించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కాని ఒక దిశ మంచిదని ఇంకొక దిశ మంచిది కాదని వర్గీకరించకూడదు.
దక్షిణ దిక్కు చాలా బలమైన దిక్కు. దీని అధిపతి యముడు. నవగ్రహాలలో కుజ గ్రహం ఈ దిక్కునకు ఆధిపత్యం కలిగి ఉంటాడు. మన కర్మల ఫలాలను ఈ దిశ మనకు అందిస్తుంది.  ఈ దిక్కును సరియైన రీతిలో వినియోగించుకుంటే సత్వర అభివృద్ది తధ్యం. ఈ దిక్కును వినియోగించుకోవడంలో పొరపాట్లు జరిగితే అనేక నష్టాలు కలిగే ప్రమాదం ఉంది. సరియైన రీతిలో దక్షిణ దిక్కును ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.
దక్షిణం ను సరిగ్గా ఉంచితే చాలా మంచి ఫలితాలు త్వరగా కలుగుతాయి. ముందుగా గృహ ప్రాంగణంలో దక్షిణ దిక్కును మెరకలో ఉంచాలి. ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా ఉంటే ధనలాభం ఆరోగ్యం తప్పక కలుగుతాయి. దక్షిణ దిక్కును ఎప్పుడు పల్లంగా ఉంచరాదు. ఈ శ్లోకాన్ని గమనించండి......

నశ్యన్తి పురుషా స్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన హానింకరో తధా నిత్యం రోగ కృ దక్షిణ ప్లవ
   అపరాజిత పృచ్చ
దక్షిణ దిశ పల్లంగా ఉంటే ధన నష్టం రోగాలు కలుగుతాయి అని దీనర్థం. దేవతలు కూడా ఇటువంటి స్థలాలలో ఉంటే నశిస్తారు  అని అపరాజిత పృచ్చ అనే ప్రాచీన వాస్తుగ్రంధం తెలుపుతుంది.  కనుక దక్షిణ దిక్కును ఎత్తులో ఉంచితే ఆరోగ్యం, ధనం సులభంగా ప్రాప్తిస్తాయి.  కనుక దక్షిణ దిక్కును ఫ్లోరింగ్ లోనూ, నిర్మాణం లోనూ ఎత్తులో ఉంచితే అనేక లాభాలు కలుగుతాయి.  కాబట్టి ఈ దిక్కును ఎత్తులో ఉంచినంత వరకు దక్షిణ దిక్కు ను గురించి భయపడనక్కర లేదు.

,,,  అనే అక్షరాలతో పేరు ప్రారంభం అయ్యే వారికి దక్షిణ  ఫెసింగ్ చాలా బాగా కలిసి వస్తుంది. ఈ అక్షరాల తో ప్రారంభం అయ్యేపేరు గల  వ్యాపారాలు కూడా దక్షిణ ఫెసింగ్ లో ఉంటే బాగా సాగుతాయి.  అయితే దక్షిణం లో వేరే దోషాలు లేకపోతే ఈ అక్షరాల వారికి అద్భుతుంగా కలిసి వస్తుంది.  దక్షిణ ఫెసింగ్ లో ఉండటం అంటే ఉత్తరం లో నివసించినట్లే. అంటే రోడ్ దక్షిణం ఉంటుంది . వ్యాపార సంస్థలు రోడ్ కు ఉత్తరం లో ఉంటాయి. అంటే కుబేర స్థానంలో వ్యాపారాలు ఉంటాయి కాబట్టి అవి బాగా సాగి మంచి లాభాలు వస్తాయి. కిరాణా దుకాణాలు, హోటల్స్ ఇంకా నిత్యవసర వస్తు దుకాణాలు బాగా సాగుతాయి. ఈ సూత్రం య,,, వ అక్షరాల వారికి వర్తిస్తుంది. ఈ రహస్యం తెలియక చాలామంది దక్షిణ ముఖంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇష్టపడరు. భయపడతారు. దక్షిణంలో ఇతర దోషాలు లేనంతవరకు ఈ ముఖంగా వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. ఇది అనుభవ పూర్వకం గా తెలుసు కున్న సత్యం.
గృహంలో దక్షిణ దిక్కులో ఏ గది ఉంచాలో మన ప్రాచీన వాస్తు గ్రంధాలు తెలియజేశాయి.
దక్షిణేచైవ శయనం .......... సనత్ కుమార సంహిత
అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న బెడ్రూం దక్షిణంలో ఉండాలని సనాత్కుమార సంహిత  తో పాటు అనేక ప్రాచీన వాస్తు గ్రంధాలు  తెలియజేశాయి. అయితే ఇప్పుడు మనం బెడ్రూం లను నైరుతిలో ఉంచుతున్నాము.  ఇది తప్పు లేదుకాని,  వీటిని దక్షిణంలో ఉంచితే ఇంకా మరిన్ని ప్రయోజనాలు తప్పక కలుగుతాయి. బెడ్ రూమ్ లను నైరుతి లో కన్నా దక్షిణ దిశలో ఉంచితే తప్పనిసరిగా మంచి ఆరోగ్యం కలుగుతుంది. సందేహం లేదు.  అయితే దక్షిణంలో తప్పనిసరిగా కిటికీ ఉంచాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది.
బరువులను మోసే దిశ దక్షిణం కనుక ఈ దిశలో ఎక్కువ బరువైన వస్తువులను ఉంచాలి. దక్షిణ నైరుతిలో స్టోర్ రూమ్ వేసి ఎక్కువ బరువులను ఉంచితే అద్భుతమైన ఫలితాలు తప్పక కలుగుతాయి. 
దక్షిణం పల్లంగా ఉండకూడదు కాబట్టి బావులు కానీ గుంటలు కానీ ఉంచరాదు. ఈ దిశలో బొర్స్ కానీ బావులు కానీ ఉంటే ఆకస్మిక ప్రమాదాలు,ఆరోగ్య ఆర్ధిక సమస్యలు వస్తాయి. ఇంకా ప్రమాదాలలో అంగవైకల్యం కలిగే వీలుంది.
స్త్రీకలహా స్త్రీ దౌష్ట్యం ..........  బృహత్ సంహిత...
దక్షిణంలో బావులుంటే స్త్రీ నాశనం, స్త్రీలకు సమస్య  అని బృహత్ సంహిత తెలియ జేస్తుంది..

గృహంలో దక్షిణ దిక్కును ఎత్తులో ఉంచాలని చాలామంది ఇంటి లోపలి భాగం కన్నా బయట  ఫ్లోరింగ్ ( అంటే ప్రహరికి, ఇంటికి మధ్య వదలిన ఖాళీస్థలం) ఎత్తులో ఉంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధమైన అమరిక వలన ధనం బాగా ఖర్చు అవుతుంది.  కనుక దక్షిణం ను గృహంలో కన్నా కొంచెం పల్లంలో ఉంచి ఉత్తరం కన్నా ఎత్తులో ఉంచాలి.  అప్పుడు మాత్రమే ఈ దిశ నుండి మంచి ఫలాలు లభిస్తాయి.  

గృహం లో కానీ ఇంకా ఏ  నిర్మాణం లో నైనా దక్షిణ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలి నిర్మాణం చేపట్టాలి. దక్షిణం కన్నా ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ ఉంచి నిర్మాణం చేయాలి.
దక్షిణం వైపు అసలు ఖాళీ స్థలం వదలకుండా నిర్మాణాలు చేయకూడదు. నిర్మాణాలకు 4 ప్రక్కల ఖాళీ తప్పనిసరిగా ఉంచాలి. దక్షిణం వైపు ఇంటిని ఖాయం చేసి అంటే ఖాళీ స్థలం వదలకుండా నిర్మిస్తే గృహస్తుకు అనేక సమస్యలు వస్తాయి. చాలామంది దక్షిణం వైపు ద్వారాలను ఉంచడానికి భయపడతారు. ఇది అర్ధం లేని భయం మాత్రమే. నిరభ్యంతరంగా దక్షిణం వైపు ద్వారాన్ని అమర్చవచ్చు. అదే విధంగా దక్షిణ దిశలో కిటికీ తప్పనిసరిగా ఉండాలి.  దక్షిణంలో కిటికీ లేని గృహం రోగ గృహం.
కన్య, మకర, మిథున రాశులవారికి దక్షిణం సింహద్వారం శ్రేష్టం. ఇది గమనించండి...
కన్యా మకర యుగ్మానామ్ దక్షిణ ద్వారా మిష్టదమ్........... జ్యోతిర్నిబంధం
జ్యోతిర్నిబంధం అనే ప్రాచీన గ్రంధం  కన్య,  మకర మరియు మిధున రాశులవారికి దక్షిణ సింహద్వారం మంచిదని సూచిస్తుంది.  కనుక భయం లేకుండా దక్షిణ ద్వారం అమర్చవచ్చు.

ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే, దక్షిణ దిశ చాలా బలమైనది. ఫలితాలను వెంటనే చూపిస్తుంది. ఈ దిశను వాస్తు ప్రకారం కరెక్ట్ గా ఉంచినట్లైతే భయపడనవసరం లేదు. ఈ దిశను మెరకగా ఉంచి, బావులు, సంప్స్ లేకుండా, ఇంకా తక్కువ స్థలం వదిలి నిర్మాణాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతే కానీ అసలు ఈ దిక్కు మంచిది కాదని నిర్ణయించి నిర్మాణాలు చేస్తే ప్రగతి లోపిస్తుంది. అన్ని దిక్కులను సమన్వయం చేసి ఉపయోగించుకుంటేనే మంచి అభివృద్ది సాధ్యం. అందుచేత సరియైన వాస్తు సూత్రాలను పాటించి దక్షిణంను సరియైన రీతి లో ఉపయోగించుకోవాలి అప్పుడు మాత్రమే మంచి ఆరోగ్యం, మంచి సంపద లభిస్తాయి.
 సూర్యదేవర వేణుగోపాల్. M.A. (జ్యోతిష్యం)
మధిర  ఖమ్మం జిల్లా.


venusuryadevara@gmail.
సూర్యదేవర వేణుగోపాల్ 
ఇంటి నెం  1-879
సుందరయ్య నగర్  మధిర
ఖమ్మం జిల్లా  తెలంగాణా 507 203

Monday, 15 July 2019

ఈశాన్యం లో బెడ్రూం ఉండవచ్చా?

సాధారణం గా ఈశాన్యం లో మనం పూజ చేస్తాం. ఈశాన్యం గదిలో దేవుని మందిరం ఉంచి ప్రతిరోజూ పూజ చేస్తాం. కానీ నేటి పరిస్థితులలో ఈశాన్యం గది ని బెడ్రూం గా వినియోగించడం మనం చాలా ఇళ్ళల్లో, ఫ్లాట్స్ లో చూస్తున్నాం. అసలు ఈశాన్యం లో బెడ్రూం ఉండవచ్చా?

ఈశాన్యం గది ని బెడ్ రూమ్ గా కొన్ని వాస్తు జాగ్రత్తలు తీసుకొని వినియోగించవచ్చు. ఈశాన్యం లో చిల్డ్రన్ బెడ్రూం ని మాత్రమే ఉంచాలి. పెద్దలు వినియోగించరాదు. ఈశాన్యం బెడ్ రూమ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈశాన్యం లో బాల్కనీ ఉండాలి. బాల్కనీ లేకుండా ఈశాన్యం లో బెడ్ రూమ్ ఉండ
కూడదు. తూర్పు ఈశాన్యం లో బెడ్రూం ఉంటే తప్పనిసరిగా తూర్పు ఈశాన్యం లో బాల్కనీ ఉండాలి. తూర్పు హద్దు చేసుకొని రూమ్ ఉండకూడదు.

ఉత్తర ఈశాన్యం లో బెడ్రూం ఉంటే తప్పనిసరిగా ఉత్తర ఈశాన్యం లో బాల్కనీ ఉండాలి. బాల్కనీ లేకుండా ఉండకూడదు. హద్దు ఖాయం చేయరాదు.

ఈశాన్యం బెడ్ రూమ్ కి అనుకొని Attatched Toilet ఉండకూడదు. ఇది చాలా పెద్ద దోషం.

ఈ విధమైన వాస్తు జాగ్రత్తలు తీసుకొని బెడ్ రూమ్ ఉంటే తప్పులేదు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా బెడ్ రూమ్ ఇక్కడ ఉంచితే మగవారికి, మగ పిల్లలకు సమస్యలు వస్తాయి

సాధారణం గా పడమర, దక్షిణ ముఖద్వారం గా కలిగిన ఇళ్ళు, ఫ్లాట్స్ కి ఈశాన్యం బెడ్రూం వస్తుంది.

వాస్తు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ బెడ్రూం ఉంచితే సమస్యలు రావు.


సూర్యదేవర వేణుగోపాల్. M. A. (జ్యోతిష్యం)

సుందరయ్య నగర్  మధిర

ఖమ్మం జిల్లా, తెలంగాణా
507203
venusuryadevara@gmail.com


Sunday, 14 July 2019

ది. 16- 7- 2019 చంద్ర గ్రహణం

ది. 16- 7- 2019 , మంగళవారం తెల్లవారితే 17- 7- 2019 బుధవారం, ఆషాఢ శుక్ల పౌర్ణిమ ఉత్తరాషాఢ నక్షత్రం ప్రధమ చరణములో కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది..

గ్రహణ సమయ వివరాలు...

గ్రహణ స్పర్శ కాలం     అర్ధరాత్రి  గం: 01:34 ని...లకు

గ్రహణ మధ్య కాలం     రాత్రి తె|| ఝాా గం..03:03 ని..లకు

గ్రహణ మోక్ష కాలం       రాత్రి..తె|| ఝా గం..04:27..ని.


ఇది కేతు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం

ఈ గ్రహణమును ధను, మకర రాశుల వారు ఇంకా గర్భిణీ స్త్రీలు చూడరాదు

గ్రహణం అర్ధరాత్రి నందు సంభవించుట వలన నిత్య భోజన ప్రత్యాభ్దికములు , గ్రహణ విడుపు స్నానాలు , శుద్ది కార్యక్రమములు బుధవారం ఉదయం చేయవచ్చు.మంత్ర పఠనములు లలిత, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం మంచి ఫలితాలు ఇవ్వగలవు



సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)

సుందరయ్య నగర్ , మధిర

ఖమ్మం జిల్లా తెలంగాణా

507203

venusuryadevara@ gmail.com


ఇంట్లో చెట్లు - వాస్తు జాగ్రత్తలు

వాస్తు ప్రకారం ఇంట్లో పెద్ద వృక్షాలు లేదా చెట్లు ఇంటికి పడమర, దక్షిణ ఇంకా నైరుతి దిక్కులందు వేయాలి. పెద్ద చెట్లు నైరుతి లో ఉండటం చాలా మంచిది. పూల మొక్కలు మధ్యమ ఎత్తులో ఉండే మొక్కలు వాయవ్య, ఆగ్నేయ ఇంకా తూర్పు ఉత్తర దిశలందు ఉంచవచ్చు. తూర్పున గాని ఉత్తరం దిక్కున గాని ఇంటి కంటే ఎత్తు పెరిగే చెట్లను ఉంచరాదు. తూర్పు వైపు ఉన్న పెద్ద వృక్షాల వలన ఇంట్లో మగవారు ఇంకా మగ పిల్లలు జీవితంలో ఎదగలేరు. వారికి కలిసి రాదు. ఇంకా ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులను బాధిస్తాయి. ఉత్తరం లో వేసిన పెద్ద చెట్ల వలన ఆర్ధిక సమస్యలు వస్తాయి. ఇంట్లో ఉండే ఆడ పిల్లలకు సకాలం లో వివాహం కాదు. వ్యాపారం లో నష్టాలు వస్తాయి. పిల్లలకు చదువు లో సమస్యలుంటాయి.

ఇంటి ఆవరణ లో మొక్కలు గాని చెట్లను గాని వేసే సమయం లో కొన్ని వాస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. .....పెద్ద చెట్లను ఎట్టి పరిస్థితి లో తూర్పు ఉత్తర ఇంకా ఈశాన్య ప్రాంతం లందు వేయ రాదు. ఈ చెట్లను దక్షిణం  పడమర ఇంకా నైరుతి దిక్కులందు మాత్రమే వేయాలి....

తూర్పు ఉత్తర దిక్కులందు పూల మొక్కలను, కూరగాయ మొక్కలను వేయవచ్చు. కూరగాయ మొక్కలకు పందిళ్ళు వేయవలసి వస్తే అప్పుడు వాయవ్య ఆగ్నేయ దిక్కులందు ఉంచాలి. పెద్ద చెట్లను ఎట్టి పరిస్థితిలోను ఈ దిక్కులందు వేయరాదు. పెద్ద చెట్లు ఈ దిక్కులందు ఉంటే అనేక సమస్యలొస్తాయి.

ఈశాన్యం లో ఎటువంటి మొక్కలు లేదా చెట్లు లేకుండా ఉండాలి. ఈ దిక్కులో పెద్ద వృక్షాలు ఉంటే వంశ నష్టం జరుగుతుంది. మగ సంతానానికి కష్టలుంటాయి. ఇంకా ఆర్ధిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వంటి రోగాలు రావొచ్చు. ఈశాన్యం లో చిన్న పూల మొక్కలు, ఆకు కూరలు వంటివి ఉంచవచ్చు.

చెట్లు బావికి  లేదా బోర్ వెల్  కి ఎదురుగా ఉండకూడదు. అదేవిధంగా ద్వారాలకు ఎదురుగా ఉండకూడదు. ఇంకా ఇంటి పిల్లర్ లేదా గోడలకు ఎదురుగా ఉండకూడదు. చెట్లు ప్రహరికి అమర్చే gates కి ఎదురుగా ఉండకూడదు.

తులసి మొక్కను ఇంటి ద్వారం ఎదురుగా ఉంచాలి. ఈశాన్యంలో కూడా ఉంచవచ్చును. తులసి మొక్కను 4 ప్రధాన దిక్కులలో ఎక్కడైనా వేయవచ్చు. అయితే తూర్పు, ఉత్తర ఇంకా ఈశాన్య భాగాలలో ఉంచే సందర్భం లో తులసి కోట ను తక్కువ ఎత్తు లో ఉంచాలి. బాగాఎత్తులో ఉంచకూడదు.


ఈ విధమైన వాస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.


సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)

సుందరయ్య నగర్ , మధిర
ఖమ్మం జిల్లా  తెలంగాణా
507203
venusuryadevara@gmail.com