Monday 7 December 2015

               స్థలఎంపికలో- వాస్తు జాగ్రత్తలు
                                                                                      సూర్యదేవర వేణుగోపాల్

గృహ నిర్మాణానికి  స్థల నిర్ణయం చాలా ముఖ్యమైనది. అన్ని స్థలాలు నిర్మాణానికి పనికి రావు. స్థల ఎంపికలో వాస్తును ఖచ్చితంగా పాటించాలి. మన పూర్వ వాస్తుగ్రంధాలు ఈ స్థల ఎంపికపై చాలా సూచనలు చేశాయి. ఈ సూచనలను నేటి కాలంలో యధాతధంగా, పూర్తిగా మనము పాటించలేకపోయినప్పటికి,కొన్ని ముఖ్యమైన వాటిని తప్పనిసరిగా పాటించాలి. కనుక ఈ సూచనలను స్థలాలు కొనే సందర్భంలో తప్పనిసరిగా ప్రతీవ్యక్తి గుర్తుంచుకోవాలి.
తూర్పు ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులలో తొలగించడానికి వీలు లేని ఎత్తైన కట్టడాలు గాని కొండలు ,గుట్టలు గాని ఉన్న స్థలాలను తీసుకోకూడదు. ఇటువంటి ప్రదేశాలలో నివశిస్తే అభివృద్ది కుంటుబడుతుంది. తూర్పులో ఎత్తైన గుట్టలు ,కొండలు ఉంటే ఆ ప్రదేశం లో మగవారికి అభివృద్ది ఉండదు. ఇటువంటి స్థలాలలో పరిశ్రమలు ఉంటే వాటి మనుగడ సామాన్యం గా ఉంటుంది.ముఖ్యంగా వ్యాపారాలకు ఉత్తరము మరియు ఈశాన్యము తేలికగా పల్లం గా ఉండాలి. ఈ దిక్కులందు పైన ఉదహరించినట్లు గుట్టలు, బరువైన నిర్మాణాలు ఉంటే వ్యాపారము రాణించదు.స్థలాలను ఎంపిక చేసే సమయములో ఈ జాగ్రత్తను తప్పనిసరిగా పాటించాలి. ఈ దిక్కులలో ఉన్న బరువులను తొలగించడానికి వీలుగా ఉంటే స్థలమును తీసుకోవచ్చు. నిర్మాణానికి ముందే వీటిని తొలగించాలి.అప్పుడే నిర్మాణం సకాలంలో పూర్తి అవుతుంది.
తీసుకొనే స్థలానికి దక్షిణ పడమర దిక్కులలో నదులు గాని, ఎక్కువ విస్తీర్ణము కలిగిన నీటి ప్రవాహములు గాని, బావులుగానీ ఉండగూడదు. వీటివల్ల చాలా నష్టాలు వస్తాయి. ఈ స్థలాలలో తీవ్ర ఆర్ధిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా సవరించడానికి వీలులేనంతగా గుంటలు గాని లేదా పల్లంగాని ఈదిక్కులలో ఉంటే ఇటువంటి స్థలాలను వదిలివేయడం మంచిది. పరిశ్రమలకైతే ఇటువంటి స్థలాలు మంచివికావు. ఇటువంటే ప్రదేశాలలో కట్టే పరిశ్రమలు సిక్ పరిశ్రమలుగా మారతాయి.

 నైరుతి, ఆగ్నేయం పల్లంగా ఉండగూడదు. ఈ దిక్కులలో పల్లం ఉంటే అక్కడ కట్టే పరిశ్రమలు, పెట్టె వ్యాపారాలు దెబ్బతింటాయి.
దక్షిణ పడమర మరియు నైరుతి దిశలందు ఎత్తైన గుట్టలు గాని, నిర్మాణాలు గాని ఉంటే అటువంటి స్థలాలు మంచివి.ఇటువంటి స్థలాలలో పరిశ్రమలు  గాని వ్యాపారాలు గాని ఇంకా గృహాలు గాని బాగా రాణిస్తాయి. ఇటువంటి స్థలాలకు  తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులలో నీటి ప్రవాహాలు గాని నదులు గాని ఉంటే ఈ స్థలం లక్ష్మీమయం అవుతుంది. ఎటువంటి నిర్మాణాలైన బాగా రాణిస్తాయి. స్థలానికి ఉత్తరం తూర్పు బాగా పల్లం గా ఉంటే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే అన్నీ దిశల కన్నా ఉత్తరం పల్లం గా ఉంటే మంచి ఆర్ధిక పుష్టి, అభివృద్ది ఉంటుంది. ఈ దిశలందు నీటి ప్రవాహాలు నదులు మొ| నవి ఉంటే  ఇంకా మంచిది .
ఇక వీధి శూలలు గురించి బాగా గమనించాలి. స్థలాలను కొనే ముందే ఈ వీధిశూలలను పరిశీలించాలి..దక్షిణం పడమర ల వీధి శూలలు ఉన్న ప్రదేశాలు మంచివికావు. నైరుతి, తూర్పు ఆగ్నేయంమరియు ఉత్తరవాయవ్యం నుండి వీధి శూల ఉంటే అటువంటి స్థలాలను తీసుకోకూడదు. అయితే వీధి శూల పడే మేరకు స్థలాన్ని వేరు చేసి మిగిలిన స్థలం లో నిర్మాణం చేసే వీలు ఉంటే స్థలాన్ని తీసుకోవచ్చు. Mainroad మరియు మంచి మార్కెట్ ఏరియా లో ఇటువంటి స్థలం ఉంటే  స్థలం తీసుకొని వీధిశూలకు వాస్తు లో చెప్పిన పరిహారాలను ఉపాయాలను పాటించవచ్చు. ఈశాన్య పశ్చిమ వాయవ్య,మరియు దక్షిణ ఆగ్నేయ దిశల నుండి వీధి చూపులున్న స్థలాలు మంచివే. తూర్పు ఉత్తర వీధి చూపులు కూడా మంచివే.. వీటిని కొనవచ్చు.అయితే కేవలం తూర్పు ఉత్తరం వీధిచూపులుంటే వాస్తు పండితుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.వ్యాపారాలకు పరిశ్రమలకు  దక్షిణ ఆగ్నేయ మరియు ఉత్తర ఈశాన్య వీధి చూపులుచాలా మంచివి.స్థలాలను కొనే ముందు వీధి శూలలను బాగా గమనించి కొనాలి.
నూతన స్థలాలను కొనే ముందు దేవాలయాల విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. శిఖరం నీడ, ధ్వజ స్తంభం నీడ పడే స్థలాలను కొనకూడదు.ఈ నీడలు వల్ల జీవితాలు అభివృద్దిని కోల్పోతాయి. అనేక ఆర్ధిక,ఆరోగ్య ఇతర సమస్యలు దేవాలయ, ధ్వజస్తంభ నీడలవల్ల కలుగుతాయి. ఇంకా విష్ణు ఆలయాలకు వెనుక వైపు, శివాలయాలకు ఎదురుగా మరియు శక్తి ఆలయాలకు పార్శ్వ భాగం లోఅంటే ప్రక్క భాగంలో  ఇల్లు గాని స్థలాలు గాని ఉండకూడదు.నవగ్రహాలలో శని అత్యంత బలవంతుడు.ఈ శనీశ్వరుని వీక్షణ ఉన్న స్థలంలో నిర్మాణాలు మంచివి కావు. కనుక ఇటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. అదేవిధంగా జాతరలు జరిగే స్థలాలు కూడా మంచివి కావు.
శ్మశానాలకు దగ్గరగా ఉన్న స్థలాలు మంచివి కావు. శ్మశానాలకు అనుకోని ఉన్న స్థలాలను కొనకూడదు.ఇంకా కొలిమి పెట్టిన స్థలాలు, సున్నం గానుగా పెట్టిన స్థలాలు మంచివి కావని ఋషి వాక్కు.అదేవిధంగా పిడుగు పడిన స్థలాలను కూడా వదిలివేయాలని మన పూర్వీకులు సూచించారు. త్రికోణ ఆకారం కలిగిన స్థలాలు మంచివికావు. అయితే ఈ స్థలాలను వాస్తుకు అనుగుణంగా మార్చుకోగలిగితే తీసుకోవచ్చు. తటాకాలను పూడ్చి నేడు నిర్మాణాలు చేస్తున్నారు. ఇటువంటి స్థలాలు కూడా అంతగా కలసి రావు. స్థలానికి నీటి ప్రవాహపు పోటు మంచిది కాదు. స్థలానికి ఎదురుగా నీటిప్రవాహపు పోటు ఉంటే ఆ స్థలాన్ని వదిలివేయుట మంచిది.
నైరుతి దిక్కున సవరించడానికి వీలు లేని బావులు గాని, నీటి ప్రవాహం గాని పల్లమైన స్థలం గాని ఉంటే అవి మృత్యుదేవతకు నివాసంగా మారతాయి.కనుక అటువంటి స్థలాలను వదలివేయాలి. ఇటువంటి దోషాలు వాయవ్యం మరియు ఆగ్నేయంలోఉన్నాకూడా అటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. మృత్తిక రుచి,రంగు పై ఆధారపడి మన పూర్వీకులు కొన్ని వాస్తు సూచనలు చేశారు. కానీ వాటిని ఇప్పటి కాలంలో అనుసరించలేము.
ఊరి బయట స్థలాలను తీసుకొన్నప్పడు తప్పనిసరిగా దాని పూర్వస్థితిని  గమనించాలి. ఇటువంటి స్థలాలలో గృహాన్ని నిర్మించేటప్పుడు తప్పనిసరిగా అడుగు లేదా రెండు అడుగుల మందం పై భూమిని తొలగించి గృహాన్ని నిర్మించాలి. పరిశ్రమలకోసం స్థలాన్ని తీసుకొనే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థలం యొక్క నైసర్గిక వాస్తును తప్పనిసరిగా పరిశీలించాలి. లేకపోతే పరిశ్రమలు తీవ్ర నష్టాలపాలు అవుతాయి.వ్యాపారాలకు గాని పరిశ్రమలకు గాని తప్పనిసరిగా ఉత్తరం మరియు ఈశాన్యం పల్లంగా ఉండాలి. దక్షిణ పడమర మరియు నైరుతి దిక్కులందు ఎత్తైయన గుట్టలుగాని,కట్టడాలు గాని ఉంటే ఆ పరిశ్రమలు, వ్యాపారాలు బాగా రాణిస్తాయి.
అన్నీ స్థలాలు అందరికీ కలసి రావు. కొన్ని దిక్కులు కొందరికే సరిపడతాయి. కనుక స్థలాన్ని కొనే ముందు మంచి వాస్తు పండితుడి సలహా తీసుకోవాలి. వర్గు పద్దతిని తప్పనిసరిగా పాటించాలి. నేటి కాలంలో ఈ వర్గు విధానాన్ని విస్మరిస్తున్నారు. కానీ దీనిని పరిగణలోకి తీసుకొంటే మంచి ఫలితాలు వస్తాయి. వర్గును విస్మరించడం తప్పు. నేటి నవీన వాస్తుకు మన ప్రాచీన గ్రంధాలలో చెప్పిన కొన్ని మంచి విషయాలను అన్వయించితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. కనుక వర్గు ను సాధ్యమైనంత మేరకు ఉపయోగించుకొంటె మంచి ఫలితాలు వస్తాయి. వర్గును నేటి పరిస్థితులకు తగినట్లుగా  యే విధంగా మలుచుకోవాలి అనే విషయాన్ని తదుపరి వ్యాసాలలో వివరిస్తాను. స్థలం కొనే ముందే వర్గు విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. అదే విధంగా మన నామ నక్షత్ర ప్రాతిపదికపై స్థల నిర్ణయం చేయడం మంచిది. కొందరు జన్మ నక్షత్రం ను ఆధారం గా తీసుకొని స్థలాలను నిర్ణయిస్తున్నారు.ఇది తప్పుకాకపోయినప్పటికి స్థలాలు గృహాలు వ్యాపారాలు నిర్ణయించే సమయంలో నామ నక్షత్రం పై ఆధార పడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ క్రింది శ్లోకం గమనించండి---
దేశే,గ్రామే,గృహే,యుద్ధే సేనయా వ్యవహారికే
నామరాశే: ప్రధానత్వం జన్మరాశి న చింతయేత్
“జ్యోతిర్నిబంధం”
స్థలాలను ఎంపిక చేసే సమయం లో పైన ఉదహరింపబడిన సూచనలను పాటిస్తే  సుఖప్రదమైన జీవితం మరియు సర్వతోముఖాభివృద్ది లభిస్తుంది.

సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

H.NO—1-879   సుందరయ్య నగర్       మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా

No comments:

Post a Comment