Sunday 24 January 2016

వాస్తు విజ్ఞానం 12&13
ద్వారాల అమరిక తీసుకోవలసిన జాగ్రత్తలు.
సూర్యదేవర వేణుగోపాల్  M. A ( జ్యోతిష్యం)
పూర్వకాలంలో నిర్మించే గృహాలకు గృహ మధ్యభాగంలో వచ్చే విధంగా దర్వాజాలను అమర్చేవారు. కానీ నేటి కాలంలో  యే నిర్మాణానికైనా మధ్యలో కాకుండా ఉచ్చ స్థానాలలో దర్వాజాలను అమర్చుతున్నారు. ఈ రెండు పద్దతులు సరైనవే. అయితే ఉచ్చ స్థానాలలో దర్వాజాలు ఉంటే మెరుగైన ఫలితాలు రావడం గమనార్హం. ఏ నిర్మాణానికైనా దర్వాజాలు తప్పనిసరి. యే నిర్మాణానికైనా మంచి స్థానాలలో దర్వాజాలను అమర్చాలి. మంచి స్థానాలలో ఉండే దర్వాజాల వలన మంచి నడక వస్తుంది. మేరుగైన జీవితం ఉంటుంది. చెడు దిశలలో దర్వాజాలను ఉంచినట్లైతే చెడు దిశల గుండా నడక సాగి సమస్యలు వస్తాయి. కనుక దర్వాజాలు అమర్చే సందర్భంలో అనేక జాగ్రత్తలను మనం తీసుకోవాలి.
పాత గృహాలకు దర్వాజాలను ఇంటి మధ్యభాగంలో, గృహ కొలతను సగం చేసి కొంచెం ఉచ్చ స్థానానికి వచ్చే విధంగా దర్వాజాలను అమర్చేవారు. అంటే ప్రధాన దిక్కులందు దర్వాజాలను పెట్టేవారు. దిక్కును 9 భాగాలుగా చేసి, ఈ భాగాలను 9 గ్రహాలకు విభజించి మంచి గ్రహ ఆదిపత్యం లో ఉన్న స్థలంలో సుమారు సెంటర్ నందు దర్వాజ అమర్చే వారు.  పురాతన గృహాలు దాదాపుగా పూరిళ్ళు, నిట్టాడు గృహాలు. ఇటువంటి గృహాలకు గృహ మధ్య భాగంలో దర్వాజా ఉంచితే పై కప్పు బరువును దర్వాజా సమానంగా మోస్తుంది. పై కప్పును సమానంగా మోసే నిమిత్తమై దర్వాజాను మధ్యలో ఉంచేవారు. ఇప్పుడు నిర్మాణ రంగం బాగా వృద్ది చెందింది. అనేక మార్పులు వచ్చాయి. పై కప్పును మోయడానికి పిల్లర్లు,బీమ్ లు ఉన్నాయి. దర్వాజాలను మధ్యలో కాకుండా ఉచ్చ దిశలైన  ఈశాన్యం, పడమర వాయవ్యం, దక్షిణ ఆగ్నేయం లో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి అన్నది నేటి భావన. ఉచ్చ స్థానాలలో దర్వాజాలు ఉంచితే మంచి దిశలగుండా నడక సాగి మెరుగైన జీవితం ఖచ్చితంగా వస్తుంది. కనుక ఉచ్చ దిశలలో ద్వారాలు ఉంచుట మంచిది. ఈ దిశలగుండ నడక సాగినట్లైతే మంచి జీవితం ఉంటుంది అన్నది అనుభవం ద్వారా తెలుసుకొన్న అంశం.
తూర్పు ముఖంగా ఉండే గృహాలకు తూర్పు మరియు తూర్పు ఈశాన్యం నందు దర్వాజాలను ఉంచవచ్చు.  18, 12, లేదా 9 అంగుళాల కట్ట ను ఉంచి తూర్పు ఈశాన్యంలో దర్వాజను అమర్చితే చాలా మంచిది.  ఈ దర్వాజకు ఎదురుగా పశ్చిమ వాయవ్యంలో కూడా దర్వాజాను ఉంచితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక వేళ సెంటర్ దర్వాజాను ఉంచాలనుకొంటే గృహ కొలతను సగం చేసే కొంచెం ఉచ్చ దిశ అయిన ఈశాన్యం నకు జరిపి డోర్ ఉంచాలి. అయితే ఇటువంటి సందర్భం లో ద్వారానికి ఇరు వైపులా కిటికీలు తప్పని సరిగా ఉంచాలి. అదే విధంగా దక్షిణ ముఖంగా నిర్మించే గృహానికి తప్పనిసరిగా దక్షిణ ఆగ్నేయంనందు ద్వారం అమర్చాలి. దక్షిణం సెంటర్ లో దర్వాజను అమర్చడం అంతా మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయంలో దర్వాజాను ఉంచి దానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యం లో ద్వారం అమర్చాలి. ఉత్తరం లో ద్వారం లేకుండా దక్షిణం లో ద్వారం ఉంచకూడదు. పశ్చిమ ముఖ గృహానికి పడమర వాయవ్యం లో దర్వాజ ఉంచాలి. పడమర సెంటర్ లో డోర్ ఉంచకూడదు. పడమర వాయవ్యం లో డోర్ ఉంచి దానికి ఎదురుగా తూర్పు ఈశాన్యం లో డోర్ ఉంచాలి. తూర్పున డోర్ లేకుండా పడమర వైపు డోర్ ఉంచరాదు. ఉత్తర ముఖంగా నిర్మించే గృహానికి ఉత్తర ఈశాన్యం లేదా ఉత్తరం సెంటర్ లో డోర్ ఉంచవచ్చు. ఈ డోర్ కు ఎదురుగా దక్షిణ ఆగ్నేయం లో డోర్ ఉంచుట మంచిది. ఈ డోర్ అమరిక వలన ఆడపిల్లల వివాహాలు త్వరగా తృప్తికరంగా జరుగుతాయి. ఉత్తరం సెంటర్ లో డోర్ ఉంచితే తప్పనిసరిగా డోర్ కు ఇరువైపుల కిటికీలను ఉంచాలి.

ఇంటికి లోపలి భాగం లో గాని వెలుపలి భాగం లో గాని ఇంటికి గాని గదులకు గాని నీచస్థానాలలో ద్వారాలు అమర్చకూడదు. నీచ దిశలైన దక్షిణ నైరుతి,పశ్చిమ నైరుతి, ఉత్తర వాయవ్యం, మరియు తూర్పు ఆగ్నేయం లందు దర్వాజాలు అమర్చకూడదు. ఈ దిశలందు దర్వాజాలు ఉంచి ఈ స్థానాల గుండా నడక సాగడం ప్రమాద హేతువు. అనేక రకాలైన ప్రమాదాలు గృహస్తుకు కలుగుతాయి. కనుక ఉచ్చ స్థానాలైన తూర్పు, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం మరియు పడమర వాయవ్యం నందు డోర్లు అమర్చి ఈ దిశలగుండా నడక సాగితే మనిషి జీవితం అబివృద్దిని పొందుతుంది.
ఈ దర్వాజాలను అమర్చే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహద్వారం ప్రక్కన తప్పనిసరిగా కిటికీ ఉండాలి. కిటికీ లేకుండా సింహద్వారం ఉండ కూడదు. డోర్ కనుక మధ్యలో ఉంటే ఈ డోర్ కు ఇరు వైపులా తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. సింహద్వారం మిగిలిన ద్వారాల కన్నా ఎత్తులో మరియు వెడల్పు లో ఎంతో కొంత పెద్దగా ఉండాలి. సింహా ద్వారాన్ని మించిన కొలతతో లోపలి దర్వాజాలు ఉండకూడదు. దర్వాజాలకు ఎదురుగా దర్వాజా ఉండుట మంచిది. అలా ఉంచలేని పక్షం లో కనీసం కిటికీని  అయినా ఉంచాలి. దర్వాజాలకు ఎదురుగా బోర్ లు బావులు, సెప్టిక్ ట్యాంక్ లు ఉండరాదు. దర్వాజాలకు ఎదురుగా పిల్లర్ కూడా ఉండరాదు. ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
దర్వాజలు కిటికీ లు ఒకే రకమైన కలప తో చేయించుట మంచిది. లేదా 2 రకాలైన కలపతో అయినా ఫరవాలేదు. అంతేకాని 2 రకాలకన్నా ఎక్కువ జాతి తో కలప ఉండకూడదు. వేప కలప వాడినట్లైతే గడప మాత్రం వేరే కలపతో ఉండాలి. గడపకు వేప కలప వాడకూడదు. ఇంటికి వాడే కలప బాగా ఆరుదల కట్టే అయి ఉండాలి. పచ్చి కట్టే వాడ కూడదు. పాత కలప, పుచ్చిపోయిన కలప వాడరాదు. దర్వాజాలను తొర్రలున్న కట్టేతో చేయించరాదు. పిడుగు పడిన గృహ కలపను నూతన గృహానికి వినియోగించరాదు.
దర్వాజాలు అమర్చే సందర్భంలో తప్పనిసరిగా వాస్తు పండితుని సలహా అవసరం.  అన్నీ జాగ్రత్తలు తీసుకొని దర్వాజాలు అమర్చాలి. మంచి దిశకు ఉన్న దర్వాజ మంచి ఫలితాన్ని అందిస్తుంది. దర్వాజాకు ఎదురుగా చెట్లు కానీ నీటిప్రవాహపు పోటు గానీ ఉండరాదు. దర్వాజా సెంటర్ నందు ఆలయాల నీడ లేదా ధ్వజ స్తంభం ఉండకూడదు. ఆలయం ఉండకూడదు. దర్వాజులు వేసేటప్పుడు గాని తీసే తప్పుడు గాని భయంకరమైన ధ్వనులు రాకూడదు. దర్వాజలపై క్రూర మృగాల బొమ్మలు ఉంచరాదు. దర్వాజాలకు ఎదురుగా మెట్లు ఉండకూడదు. మరుగు దొడ్లు దర్వాజాకు ఎదురుగా రాకూడదు. గోడ మూలలు దర్వాజలో ఉండరాదు. ఈ విధంగా దర్వాజా లు అన్నీ జాగ్రత్తలు తీసుకొని అమర్చితే మంచి లాభం కలుగుతుంది.


సూర్యదేవర వేణుగోపాల్   M .A  (జ్యోతిష్యం)   సుందరయ్య నగర్   మధిర    ఖమ్మం జిల్లా

Friday 15 January 2016

మకర సంక్రాంతి ప్రత్యేకం..........
మకర సంక్రాంతి ఆచారాలు- పరమార్ధం
సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)

ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతితో ప్రారంభం అవుతుంది. రవి మకర రాశి ప్రవేశం తో మకర సంక్రాంతి వస్తుంది. ఈ రోజుననే దేవ మార్గం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం లో చేసే వ్రతాలు అనేక శుభఫలాలను అందిస్తాయి. అదే విధంగా ఉత్తరాయణం లో మానవుడు చేసే శుభకార్యాలు ఎక్కువ ఫలాన్ని ప్రసాదిస్తాయి. సూర్యుడు మకరరాశి లో ప్రవేశించే ఈ మకర సంక్రాంతి రోజున చేసే స్నాన,జప,దాన,వ్రతాదులు విశేషాఫలితాలను కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం ఈ రోజున విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున చేసే పితృ తర్పణాలు, దానాలు మానవులను పితృ రుణం నుండి తప్పించగలవు.  ప్రజలు అమ్మవారిని పౌష్యలక్ష్మిగా పూజిస్తారు. సంక్రాంతి రోజు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేయకపోతే అనేక రోగాలు వస్తాయని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
రవి సంక్రమణేప్రాప్తే  నస్నాయా ద్యస్తు మానవ:
సప్త జన్మ సు రోగీస్యాత్ నిర్ధన చైవ జాయతే.
మానవులకు పంచవిధమైన రుణాలు ఉంటాయి. దేవరుణం, పితృ రుణం, భూత రుణం, మానవ రుణం మరియు ఋషి రుణం. భూమిపై జీవించే ప్రతి మానవునికి ఈ రుణాలు ఉంటాయి. ఈ రుణాల నుండి విముక్తిని ప్రతి మానవుడు పొందాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ తత్వం అవగతం ఆవుతుంది. ఈ రుణాల నుండి  మనుష్యలకు విముక్తి ని కలిగించడానికి పరిహారాలను ఆచారాల రూపంలో మన పెద్దలు తెలియచేసారు. పెద్దలు చెప్పిన ఈ ఆచారాలను పాటించినట్లైతే  ప్రతి మనిషి తన పంచ విధమైన రుణాలనుండి విముక్తిని పొంది పరమాత్మకు దగ్గర అవుతాడు. పంచ రుణాలనుండి గృహస్తు విముక్తి పొందే మార్గాలను మకర సంక్రాంతి ఆచారాల రూపంలో మన ఋషులు తెలియచేసారు. ఈ విముక్తి తరుణోపాయాలు సంక్రాంతి ఆచారాల రూపంలో నిర్దేశింపబడినవి. కనుక మకర సంక్రాంతి రోజున మన పెద్దలు చెప్పిన ఆచారాలను పాటిస్తే అన్నీ రుణాలనుండి విముక్తిని పొందవచ్చు.
మకర సంక్రాంతి రోజున కొత్తబియ్యం తో పాలు పొంగించి సూర్యాది దేవతలకు మనం నివేదిస్తాం. పులగం, పాయసం చేసి సూర్యాది దేవతలను మకర సంక్రాంతి రోజున పూజించడం చేత  ఈ దేవతల కృపవలన దేవ రుణం నుండి కొంత మేరకు విముక్తిని పొందగలం. మకర సంక్రాంతికి పండిన పంట ఇంటికి వస్తుంది. పాడిపంటలకు, వ్యవసాయానికి ఆధారమైన సూర్యభగవానుని తప్పనిసరిగా ఆరాధించాలి. ఆయన ద్వారా వచ్చిన పంటను సూర్యునికే పాలు పొంగళ్ళ రూపంలో నివేదించుట వలన దేవరుణం కొంత మేరకు తొలుగుతుంది.
పితృ తర్పణాలు, పిండోదక దానాల వలన పితృ రుణం తీరుతుంది. మకర సంక్రాంతి రోజున పితృ తర్పణాలు,  దానాలు చేయాలని మన పెద్దలు తెలియజేశారు. ఈ రోజున పితృ పూజను చేసి తర్పణాలు వదలి దానాలు బ్రాహ్మణులకు ఇవ్వడం ద్వారా పితృ రుణం నుండి కొంత మేరకు విముక్తిని పొందవచ్చు.
 గాలి, నీరు, ఆకాశం ,భూమి మొ|లైన పంచభూతాల కృప వలన సమస్త జీవరాశికి వ్యవసాయం ద్వారా ఆహారం లభిస్తుంది. కనుక ఈ పంచభూతాలు మానవులకు పూజనీయాలు. సంక్రాంతి రోజున పొలాలలో పొంగలి మెతుకులు చల్లడం, పసుపు కుంకాలు చల్లి గుమ్మడికాయ పగులగొట్టి దిష్టి తీయడం ఆచారంగా మారింది.  పశువులు మానవులకు చేసే మేలుకు గుర్తుగా కనుమ రోజున వీటిని పూజించి కొష్టాలను అలంకరిస్తాము. ఇంకా ముగ్గు లో బియ్యపు పిండిని కలిపి ముగ్గులు వేసి వీటి ద్వారా చీమలు వంటి అల్ప ప్రాణులకు ఆహారం అందిస్తాము. ఇటువంటి ఆచారం పాటిస్తే భూత రుణం నుండి మానవులు  కొంతమేరకు విముక్తిని పొందుతారు.
సంక్రాంతి రోజున దానధర్మాలు చేయమమని మన ధర్మం చెపుతుంది. పండుగ రోజున తిలలు, వస్త్రాలు, ధాన్యం, చెరకు, గోవులు ఫలాలు మొ|లైనవి దానం చేస్తారు. వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వారికి ధాన్యం దానం చేస్తారు.  ఇటువంటి దానాల వలన మనుష్య రుణం నుండి కొంత మేరకు విముక్తి లభిస్తుంది. పురాణ పటనం, జపాతపాలు, బ్రాహ్మణులకు దానాలు వంటివి ఆచరించుట ద్వారా ఋషి రుణం నుండి కొంత మేరకు విముక్తి లభిస్తుంది. ఈ విధంగా మానవులకు ఏర్పడే పంచరుణాలను తొలగించడానికి మన పెద్దలు ఆచారాల రూపంలో తరుణోపాయాలను చూపించారు. వీటిని గురించి తెలిసినా తెలియకపోయినా పండగ ఆచారాలను పాటిస్తే మనుషులకు ఎంతో మేలు జరుగుతుంది.
మకర సంక్రాంతి తో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం లో చేసే ఎటు వంటి పుణ్యకార్యమైన, శుభకార్యమైన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాయణం  గృహారంభాలకు, గృహప్రవేశాలకు చాలమంచి కాలం.దేవతా ప్రతిష్టాలకు ఉత్తరాయణం మంచిది. సౌమ్య దేవత ప్రతిష్టలు తప్పనిసరిగా ఉత్తరాయణం లోనే చేయాలి. నూతన ఆలయాల ప్రారంభం ఉత్తరాయణం లోనే చేయాలి. వివాహాలకు అన్ని శుభకార్యాలకు ఉత్తరాయణం మంచిది.
మకర సంక్రాంతి రోజున ప్రతివారు తప్పనిసరిగా తెలకపిండి ఒంటికి రాసుకొని స్నానం ఆచరించాలి. తెలక పిండికి వాతాన్ని హరించే గుణం ఉంది. శని మకర రాశికి అధిపతి. శని గ్రహం వాతాన్ని పెంచుతుంది. కనుక వాతాన్ని హరించే తెలకపిండి స్నానం ఈ రోజు చాలా మంచిది. ఈ కాలం లో పెరిగే వాతాన్ని అరిసెలు కూడా బాగా తగ్గిస్తాయి. అందుకనే బెల్లం, నువ్వులు, బియ్యపు పిండి తో తప్పనిసరిగా అరిసెలు వండుకు తినాలని మన పెద్దలు చెపుతారు. మన ప్రాంతం లో అందుకనే ప్రతి గృహం లో అరిసలు వండుతారు. సంక్రాంతి రోజు నువ్వులు గుమ్మడికాయ, బెల్లం వంటి వస్తువులు మంచి ఆరోగ్యం కోసం దానం చేయాలి. మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా దానాలు ఇవ్వాలి.
మకర సంక్రమణ పుణ్యకాలేతదానం స్వశక్తి:
ఫలం కాంస్యాది దాన్యాని దీయతే దోషనాశనం
ఫలాని మూలన్యజీనం సువర్ణం గ్రామాంశు కాద్యమ్ సతిలేక్షు గావ:
ధాన్యం ఖరాంశో: మకర ప్రవేశ ఏతానిదానాని వివేషితాని
ఈ శ్లోకం ప్రకారం సంక్రాంతి రోజు ధాన్యం, ఫలాలు, బంగారం,కంచు వంటి లోహాలు దానం ఇవ్వడం మంచిది. ఘృత కంబళి దానం శ్రేష్టం.
సంక్రాంతి రోజు ఏది దాన చేస్తామో అవి అధికంగా జన్మ జన్మలకు లభిస్తాయని విశ్వాసం. ఈ రోజులో నువ్వులు, బియ్యం కలిపి శివ భగవానుని పూజించాలి. నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. ఆవు నేతితో శివునకి అభిషేకం చేస్తే చాలా మంచిది. నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలి. సంక్రాంతి రోజు ఒక్కపూట భోజనం చేయాలి. రాత్రి కాలంలో భుజించరాదు.
యయా సన్నిహితా నాడ్యా: తాస్తా: పుణ్యతమా స్మృతా:
సంక్రాంతి సమీపిస్తున్న కొద్ది అధిక పుణ్య కాలం కాబట్టి  ఈ రోజులో చేసే మంత్ర ధ్యానాలు,జపాలు తపాలు. దానాలు తర్పణాలు శ్రేష్ట మైన ఫలితాలు ఇస్తాయి. చలికాలంలో రాత్రికాలం దీర్ఘంగా ఉంటుంది. పగటికాలం తక్కువుగా ఉంటుంది. కనుక నిద్ర లేచే సమయానికి బాగా ఆకలిగా ఉంటుంది. దీనికి విరుగుడుగా పులగం తినాలని వాగ్భటుడు మొ|లైన వైద్యులు చెప్పడం జరిగింది. రోజు పులగం తినడం ఖర్చుతో కూడిన పని. అందరికీ సాధ్యం కాదు. కనుక ఈ పండుగనాడు అందరికీ అందుబాటులో ఉండటానికి ఆలయ ప్రసాదంగా మన పెద్దలు ఏర్పాటు చేశారు. మకర సంక్రాంతి రోజున శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చదవితే మంచి లాభం కలుగుతుంది.మకర సంక్రాంతి ఆచారాల వెనుక అనేక పారమార్ధిక విషయాలు దాగున్నాయి. వీటిని భక్తితో ఆచరిస్తే పరమాత్మ కృప లభించి జీవితం ధన్యం అవుతుంది.


సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

H.NO—1-879   సుందరయ్య నగర్       మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా

Saturday 2 January 2016

వాస్తు విజ్ఞానం-8&9
స్థల ఎంపికలో వాస్తు నియమాలు- ఆంతర్యం
సూర్యదేవర వేణుగోపాల్  M.A (జ్యోతిష్యం)

నిర్మాణానికి స్థలం ముఖ్యం. సేకరించిన స్థలం నిర్మాణానికి అనువుగా ఉండాలి. స్థలం వాస్తు ప్రకారం ఉంటే నిర్మాణం కూడా దాదాపుగా వాస్తుకు అనుగుణంగానే ఉంటుంది. కనుక స్థలం తప్పనిసరిగా వాస్తుకు ఉండాలి. స్థలం తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని స్థలాలు నిర్మాణానికి పనికి రావు. నిర్మాణానికి పనికివచ్చే స్థలం లోనే మనం గృహాన్ని నిర్మించాలి. స్థల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు చెపుతుంది. చాలా నియమాలను వాస్తు నిర్దేశించింది. మనిషికి మెరుగైన, ఆరోగ్య ప్రదమైన జీవితం ఇవ్వడమే ఈ వాస్తు నియమాల వెనుక గల ఆంతర్యం. వీటిని మూఢ నమ్మకంగా కొట్టిపారవేయకూడదు. అన్నింటిని పాటించడం నేటి కాలంలో కష్టం. కనుక కొన్ని ముఖ్యమైన, ప్రాధమికమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేని పక్షంలో నష్టాలు కలుగుతాయి. స్థల సేకరణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
స్థలం లో లోపాలు ఉన్నప్పటికి వాటిని వాస్తు ప్రకారం సవరించడానికి వీలుంటే వాటిని తీసుకోవచ్చు. సవరించడానికి వీలులేని వాస్తు దోషం ఉన్న స్థలం నిర్మాణానికి పనికిరాదు. దక్షిణం, పడమర, మరియు నైరుతి ప్రాంతంలందు సవరించుటకు వీలు లేనంతగా పల్లం ఉంటే అటువంటి స్థలాన్ని తీసుకోకూడదు. ఈ దిక్కులందు నదులు, నీటి ప్రవాహం, లేదా బావులు ఇంకా పూడ్చలేనంత గోతులు ఉంటే ఇటువంటి స్థలం నిర్మాణానికి పనికి రాదు. ఇటువంటి స్థలాలలో గృహాలను నిర్మిస్తే అనేక ఉపద్రవాలు ఏర్పడతాయి. తీవ్ర నష్టాలు వస్తాయి. ఈ దిక్కులందు గుంటలు లేదా బావులు ఉంటే సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దిక్కులు పల్లం అయితే మానవ మనుగడ కష్టతరం అవుతుంది. చెడును కలిగించే దిశల బలం పెరుగుతుంది. దీనివల్ల మనిషి జీవితం ప్రశాంతంగా ఉండదు. కనుకనే  ఈ వాస్తు నియమాన్ని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ క్రింది శ్లోకం గమనించండి.....
నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:    
ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
ధనహానిమ్తధానిత్యంకురుతేనైరుతి ప్లవా                                                                       
పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.
                                      - “ అపరాజితపృచ్చ”
“అపరాజితపృచ్చ” అనే ప్రాచీన వాస్తు గ్రంధం నుండి పై శ్లోకం తీసుకోబడింది. ఈ శ్లోకం ప్రకారం దక్షిణం పల్లం అయితే ధననష్టం, రోగభయం  ఉంటుంది  ఇటువంటి స్థలంలో దేవుడు కూడా రాణించలేడని తెలుపుతుంది. ఇంకా పశ్చిమం పల్లం అయితే ధన ధాన్య నష్టం, నిత్యం శోకం కలుగుతుందని, నైరుతి పల్లం అయితే మృత్యుభయం, ధననష్టం  మరియు ప్రవర్తనా దోషాలు కలుగుతాయని తెలుపుతుంది. బావులు, నీటిప్రవాహాలు గుంటలు మొ| వాటి వలన భూమి  పల్లం  అవుతుంది. కనుక స్థలానికి దక్షిణం,పశ్చిమం మరియు నైరుతి పల్లం గా ఉన్న స్థలాలను కొనరాదు. ఈ పల్లాన్ని సవరించుకొనే వీలు ఉంటే స్థలాన్ని తీసుకొని వెంటనే మెరక చేయాలి. గృహ నిర్మాణానికి పూర్వమే సవరించాల్సి ఉంటుంది.
ఈశాన్య, తూర్పు మరియు ఉత్తర దిశలందు సవరించడానికి వీలు లేనంత ఎత్తైన కట్టడాలు గాని, పర్వతాలు గాని లేదా రాళ్ళు గాని ఉంటే ఈ స్థలం అంతగా కలసిరాదు.  ఈ స్థలం ధననష్టాన్ని కలిగిస్తుంది. మగవారికి కలసిరాదు.ఈ వాస్తు అమరిక వలన శుభాలను ప్రసాదించే దిక్కులైన తూర్పు,ఉత్తరం, మరియు ఈశాన్యాలు  తమ బలాన్ని కోల్పోతాయి. దీని వలన సుఖప్రదమైన జీవితం లోపిస్తుంది. అందుకొనే ఇటువంటి స్థలాలను కొనేటప్పుడు అధిక జాగ్రత్తను పాటించాలి. అయితే స్థలాన్ని సవరించి శుభ దిక్కులకు బలాన్ని చేకూర్చే వీలుంటే  తీసుకోవచ్చు. వీధి శూలలు ఉన్న స్థలం పనికిరాదు. నైరుతి, ఉత్తర వాయవ్యం, తూర్పు ఆగ్నేయం నుండి వీధి శూలలు ఉన్న స్థలం పనికిరాదు. ఈ వీధి శూలలు వలన మృత్యు భయం, ఆర్ధిక నష్టం, ఆరోగ్య నష్టం సంతానం తో సమస్యలు మున్నగు ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ వీధి శూలలు పడే మేరకు స్థలం వదలి గృహాన్ని నిర్మించే వీలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. వాణిజ్య ప్రాంతం,మెయిన్ రోడ్ లో ఉన్న స్థలానికి ఈ వీధి శూలలు ఉంటే వాస్తు లో చెప్పబడిన పరిహారాలు పాటించి ఇందులో నిర్మాణం చేయవచ్చును. ఏదిఏమైనా వీధి శూలలు ఉన్న స్థలం నిర్మాణానికి మంచిది కాదు. వీధిచూపులున్న స్థలాలు లాభాన్ని కలిగిస్తాయి. తూర్పు,ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, మరియు పశ్చిమ వాయవ్యం నుండి వీధి చూపులుంటే ఇటువంటి స్థలాలను తీసుకోవచ్చు. ప్రవాహ శూల ఉన్న స్థలం కూడా మంచిది కాదు. ప్రవాహ శూల ఏ దిశలోనూ స్థలానికి తగులకూడదు.  ఈ జాగ్రత్త లన్ని గృహస్థుకు సుఖాన్ని కలిగించడానికి చెప్పబడినాయి.
ఆలయ శిఖరం మరియు ధ్వజ స్తంభం నీడ పడే స్థలాలు మంచివికావు. వీటి నీడ వలన జీవితాలు అభివృద్దికి నోచుకోవు. కనుక ఇటువంటి స్థలాలను తీసుకో రాదు. తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవలసి వచ్చినప్పుడు వీటి నీడ పడే మేరకు స్థలం వదలి గృహాన్ని నిర్మించాలి. విష్ణు ఆలయాలకు వెనుక భాగంలో, శివుని ఆలయానికి ఎదురుగా మరియు దేవి ఆలయాలకు పార్శ్వ భాగంలో ఉన్న స్థలాలు మంచివి కావు. ఇటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించి నివశిస్తే అనేక నష్టాలు ఏర్పడి జీవితంలో అభివృద్ది ఉండదు. కాబట్టి ఇటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. కానీ నేటి పరిస్థితులలో ఈ విధంగా వదలివేయుట చాలా కష్టం. కనుక  వీటి ఛాయ పడిన మేరకు స్థలంను వదలి మిగిలిన స్థలంలో గృహం నిర్మించుకోవచ్చును.ఈ క్రింది శ్లోకం పరిశీలించండి..
శివదృష్టి,ర్విష్ణుపృష్టంచ, దుర్గాయా పార్శ్వతో దృశమ్
విఘ్నేశ స్యోర్ద్వ దృష్టించ, తీక్షణ మాహు ర్మనీషీణా
                                                “భృగు మహర్షి “
శివాలయానికి ఎదురుగా ఉండే ఇంటికి శివ దృష్టి వేధ కలుగుతుంది. విష్ణు ఆలయాలకు వెనుక భాగంలో ఉండే గృహానికి విష్ణు వేధ కలుగుతుంది. విఘ్నేశునుకి  ఉర్ద్వ దృష్టి ఉంటుందని భృగు మహర్షి వివరించారు. ఎత్తుగా ఉండే నిర్మాణాలకు సమీపంలో గణేశ్ ఆలయం ఉంటే గణపతి వేధ  కలుగుతుంది. ఆలయప్రహరికి ఇంటికి మధ్య  కనీసం 18 నుండి 20 అడుగుల  వెడల్పుతో రోడ్ తీసి మిగిలిన  స్థలంలో ఇంటిని నిర్మిస్తే దేవతా వేధలు ఉండవు. కనుక ఆలయాల సమీపంలో ఇంటిని నిర్మించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి . ఈ నియమాలన్నీ మానవుని ప్రశాంతతకు కోసం రూపొందించబడినాయి. ఆలయాలకు దగ్గరగా ఉంటే జన సమ్మర్ధం ఎక్కువుగా ఉంటుంది. ప్రశాంతతకు భంగం ఉంటుంది. అందుకనే ఇటువంటి నియమాలు రూపొందించబడినాయి. గృహంలో జరిగే కార్యక్రమం వేరు ఆలయంలో ఉండే కార్యక్రమం వేరు. గృహాలలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల వల్ల ఆలయంలోని దేవునికి, ఇంకా ఆలయం ను సందర్శించే భక్తులకు మైల, ఇతర సమస్యలు రాకుండా వుండడానికే ఆలయాలకు దూరంగా ఉండాలని  వాస్తు చెపుతుంది

స్థలాలు కొనే ముందు స్థలం ఎక్కడ ఉన్నదో జాగ్రత్తగా పరిశీలించాలి. నైసర్గిక వాస్తు చాలా ముఖ్యమైనది. మన స్థలంలో  ఎటువంటి మార్పునైనా చేసుకోగలం. కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను మార్చలేము. కనుక నైసర్గిక వాస్తును గమనించాలి. పరిశ్రమలు, పెద్ద నిర్మాణాల విషయంలో మరీ జాగ్రత్త అవసరం. ఎందుకంటే స్థలనిర్ణయంలో పొరపాట్లు జరిగితే పరిశ్రమలు దానిపై ఆధారపడి జీవించేవారు తీవ్రంగా నష్టపోతారు. శుభాలను కలిగించే దిశలు బలంగా ఉన్న స్థలాలను ఎంచుకోవాలి. నష్టాలు కలిగించే దిశలు బలహీనంగా ఉండే స్థలంలో ఇటువంటి నిర్మాణం చేయాలి. శుభాలను ప్రసాదించే తూర్పు ఉత్తరం ఈశాన్య భాగాలు పల్లంగా ఉండి  దక్షిణం,పశ్చిమం ప్రాంతాలు మెరకగా ఉన్న స్థలాలో పరిశ్రమలు నిర్మించాలి. ఇటువంటి స్థలాలకు తూర్పు,ఉత్తరం, ఈశాన్య ప్రాంతాలలో నదులు, నీటి ప్రవాహం ఉంటే బాగా రాణిస్తాయి. పరిశ్రమలు స్థాపించేటప్పుడు దక్షిణ,పశ్చిమ నైరుతి దిక్కులలో ఎత్తైన పర్వతాలు, నిర్మాణాలు ఉన్న స్థలాలను ఎంచుకోవాలి.
శ్మశానాలు ప్రక్కన ఉన్న స్థలం మంచిదికాదు. ఇటువంటి స్థలంలో నివశిస్తే మానసిక ఆందోళనలు, సమస్యలు వస్తాయని వాస్తు ఈ విధంగా నిర్దేశిస్తుంది. ఇంకా నది తో కోత పడిన స్థలం, పిడుగులు పడిన స్థలం, కుళ్లిన జంతు కళేబరాలు ఉంచే స్థలం, ఊడలు దిగిన వృక్షం ఉన్న స్థలం, కొండ యొక్క పాదం దగ్గర ఉండే స్థలం, కొలిమి పెట్టిన స్థలం, గానుగా సున్నం ఆడించిన స్థలం, విపరీతమైన రద్దీ,  జనసమ్మర్ధం ఉండే స్థలం, పుట్టలు,బొరియలతో నిండి ఉన్న స్థలం  మంచివి కావని వాస్తు చెపుతుంది. ఈ ఆదేశాలన్నీ మనిషి రక్షణ కోసం చెప్పబడినవి. కనుక యధాతధంగా కాకపోయిన, వీటిలో కొన్నిటి నైనా పాటించుట మంచిది.కొత్త స్థలం కొనే ముందు వర్గు ను కూడా పాటించితే మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రస్తుత పరిస్థితులలో ఇన్ని వాస్తు నియమాలు పాటించడం కష్టం. కనుక ముఖ్యమైన వాస్తు నియమాలలో రాజీ పడకుండా స్థలంను ఎంపిక చేసుకోవచ్చు. కొన్నివాస్తు దోషాలు స్థలంలో ఉన్నాయి అని భావిస్తే అటువంటి స్థలంలో కనుక నిర్మాణం చేయవలసి వస్తే గృహ నిర్మాణానికి ముందే ఆ స్థలాన్ని దున్నించి నవధాన్యాలు వేయాలి. ఇంకా అటువంటి స్థలంలో కనీసం మండలం రోజుల పాటు ఆవులను ఉంచాలి. దోషాలు తొలగిపోతాయి. ఎటువంటి స్థలం అయిన గృహస్తుకు చిత్త శాంతిని ప్రసాదించాలి. అటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించుకోవాలి.  ఈ శ్లోకాన్ని గమనించండి.......
మనస చక్షుషో ర్యత్ర సంతోషో జాయతే భువి
తస్యాం కార్యం గృహం సర్వైరీతి గర్గాది సమ్మతం
                                    “వసిష్ట సంహిత.”
యజమాని మనసుకు, చూపులకు ఏ భూమి సంతోషమును కలిగిస్తుందో ఆ స్థలలంలోనే ఇంటిని నిర్మించాలని గర్గాది మహర్షులు చెప్పారని దీని భావం. ఈ శ్లోకం కూడా గమనించండి...
మనోరమా చ యా భూమి పరిక్షేత ప్రయత్నత:
సర్వేషాం చైవ వర్ణానాం సమభూమి సుభావహా.
                                    “విశ్వకర్మ ప్రకాశిక”
ఏ భూమి యజమానికి మనోహరంగా ఉంటుందో దానిని పరిక్షించి గృహాన్ని నిర్మించాలని, ఎత్తుపల్లాలు లేని శాస్త్ర దూష్యం కానీ స్థలంలో ఇల్లుకట్టాలని దీని భావం. కనుక ఏ స్థలం మనసుకు ప్రశాంతతను ఇస్తుందో అటువంటి స్థలం లోనే గృహనిర్మాణం చేయాలని మన మహర్షులు ఉపదేశించారు.
నేటి కాలంలో స్థలం కొనుక్కునే ఇల్లు కట్టలంటే విపరీతమైన ఖర్చుతో కూడిన పని. అన్ని వాస్తునియమాలు పాటించి స్థలం కోనాలంటే నేటి కాలంలో కొంచెం కష్టం. కనుక ప్రధానమైన వాటిని పాటించి చిన్న చిన్న దోషాలుంటే సవరించి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. వాస్తు నియమాలన్నీ మనిషి కి ప్రశాంతతను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ఉద్దేశించబడినవి. వీటిని పాటించుట ద్వారా మంచి జీవితం ఉంటుంది.
సూర్యదేవర వేణుగోపాల్

 venusuryadevara@gmail.com 
సూర్యదేవరవేణుగోపాల్. M.A(జ్యోతీష్యం) H.NO-1-879

సుందరయ్య నగర్  మధిర  ఖమ్మం జిల్లా